
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగితేనే భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ రాజునాయక్ అన్నారు. మంగళవారం వీఎస్‌టీ ఫంక్షన్‌హాల్‌లో న్యూఎరా కళాశాల ఆధ్వర్యంలో సంకల్ప్ దివాస్ పేరిట పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ... లక్ష్యం లేని చదువులు వృథా అవుతాయని అన్నారు.
ఆరేళ్లు కష్టపడి చదివితే 60 ఏళ్లు సుఖంగా జీవించొచ్చని అన్నారు. సెల్‌ఫోన్లకు కేటాయించే సమయాన్ని చదువు, ఆటలపైన కేటాయించాలని సూచించారు. ప్రేమ మత్తులోపడి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ... క్రమశిక్షణ పట్టుదల ఉన్న ఏ విద్యార్థి ఓడిపోడని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి.