నిత్యాన్న ప్రసాదాలు

Annadanam, the best among TTD services - Sakshi

అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న మాటను నిజం చేసి చూపిస్తోంది టీటీడీ. శ్రీవారి దర్శనార్థం వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాన్ని అందచేస్తూ ఆకలి తీరుస్తోంది. ముప్పైమూడేళ్ల కిందట ప్రతి నిత్యం కొద్ది మంది భక్తులకు కడుపునింపే ఆశయంతో రూ. 5 లక్షల మూలధనంతో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం నేడు వెయ్యి కోట్ల రూపాయలకు చేరుకుని ప్రతిరోజూ లక్షల మందికి కడుపు నింపుతోంది.

నిత్యం భక్తులు హుండీలో వేసే కానుకలే కాకుండా టీటీడీ చేపట్టిన వివిధ ట్రస్టులకు దాతలు విరాళాలు అందచేస్తుంటారు. ఇలా అన్నప్రసాద çపథకం, ఆరోగ్య వరప్రసాదం, ప్రాణదాన పథకం, గో సంరక్షణ పథకం, వేద పరిరక్షణ పథకం, బాలమందిరం ట్రస్టు, స్విమ్స్‌ వంటి పలు పథకాలను అంచెలంచెలుగా ప్రారంభించింది టీటీడీ. వీటిలో అన్నప్రసాదం ట్రస్టుకు అత్యంత ప్రా«ధాన్యత ఉంది. మొదట్లో తిరుమలలోని స్ధానిక మఠాలు భక్తుల ఆకలిని తీరుస్తూ ఉండేవి. అయితే క్రమంగా పెరుగుతున్న భక్తుల సంఖ్య కారణంగా ఎక్కువ మంది ఆహారాన్ని కొని తినాల్సి వచ్చేది. దీంతో సామాన్య భక్తుల ఇబ్బందిని పరిగణనలోకి తీసుకున్న టీడీడీ నిర్ణయం ప్రకారం 1985 ఏప్రిల్‌ 6న నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ అన్నప్రసాద పథకాన్ని ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన ఎల్వీ రామయ్య అనే భక్తుడు ఇచ్చిన రూ. 5 లక్షల విరాళంతో ప్రారంభమైన ఈ పథకానికి మొదటి ఏడాదే రూ. 60 లక్షలకు పైగా విరాళాలు అందాయి. ఆ తర్వాత అన్నదాన పథకానికి భక్తుల నుంచి విరాళాలు మరింతగా ఊపందుకున్నాయి. ఏడాదికేడాదీ ప్రవాహంలా అన్నదాన ట్రస్టుకు భక్తులు విరాళాలు అందిస్తూండటంతో ప్రస్తుతం అన్నదానం ట్రస్టు డిపాజిట్లు వెయ్యి కోట్ల మార్కును దాటాయి. బ్యాంకులో డిపాజిట్ల రూపంలో ఉన్న ఈ నగదు నుంచి వచ్చే వడ్డీతో నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది. గతంలో అన్నదాన ట్రస్టు పేరులో  దానం అనే పదాన్ని  అన్నప్రసాద పథకంగా మార్చింది టీటీడీ. భక్తులు ఇస్తున్న కానుకలు ఏటా పెరుగుతూ ఉండటంతో ఈ ఏడాది సెప్టెంబరు నెలలో అన్నప్రసాద ట్రస్టుకు భక్తులు ఇచ్చిన విరాళాల మొత్తం రూ. 1,000 కోట్ల మార్కును దాటింది. 

మొదట్లో శ్రీవారిని దర్శించుకున్న భక్తులకు ఆలయంలోనే టోకెన్లు అందజేసి అన్నప్రసాద సౌకర్యం కల్పించిన టీటీడీ 2007 సంవత్సరం నుంచి టోకెన్లతో నిమిత్తం లేకుండా ఎవరికైనా భోజన సౌకర్యం కల్పించేలా ఏర్పాట్లు చేసింది.  ప్రస్తుతం తిరుమలలోని ప్రధాన అన్నదాన కేంద్రంలో ప్రతిరోజూ దాదాపు లక్షమందికి, ఇతర చోట్ల పది నుంచి పదిహేను వేలమంది వరకు భక్తులకు అన్నప్రసాదం లభిస్తోంది.నానాటికీ పెరుగుతున్న భక్తులకు గతంలో ఉన్న పాత అన్నదాన భవనం చాలక పోవడంతో టీటీడీ ఆసియాలోనే అతి పెద్ద అన్నప్రసాద ప్రాంగణాన్ని రూ.25 కోట్ల ఖర్చుతో నిర్మించింది. నాలుగువేల మంది భక్తులు ఏకకాలంలో భోజనం చేసేలా, నిత్యం లక్ష మంది భక్తులకు భోజన సౌకర్యం కల్పించేలా నిర్మించిన ఈ నూతన భవనాన్ని  2011లో ప్రారంభించారు. ఇందులో అత్యాధునిక భారీ ఆవిరి యంత్రాల ద్వారా ఆహారాన్ని తయారు చేసి వేలాది మందికి సకాలంలో ఆహారాన్ని సిద్ధం చేస్తుంటారు. టీటీడీ సిబ్బందితో పాటూ శ్రీవారి సేవకులూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ మానవసేవే మాధవ సేవ అని చాటుతున్నారు. ప్రధాన అన్నప్రసాద కేంద్రంలోనే కాకుండా తిరుమలలోని పలు ప్రదేశాల్లోనూ టీటీడీ భక్తులకు ఆహారాన్ని అందచేస్తోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్, యాత్రికుల వసతి సముదాయాలలో కూడా అన్నప్రసాదాన్ని అందచేస్తోంది. మూడేళ్ల కిందట తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయంలో కూడా అన్నప్రసాదం పథకాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత తిరుపతిలోని వసతిగృహ సముదాయాలకు అన్నప్రసాదం పథకాన్ని విస్తరించింది. తిరుమలతో పాటు పలుచోట్ల మొబైల్‌ çఫుడ్‌ కౌంటర్ల ద్వారా కూడా ఆహార వితరణ ప్రారంభించింది. తిరుమలలోని రద్దీ ప్రదేశాల్లోను, కాలినడక మార్గాల్లోను భక్తులకు అన్నప్రసాదాలు అందజేస్తోంది.

ఇటీవలి కాలంలో అన్నదాన పథకంలో కొన్ని కొత్త డొనేషన్‌ స్కీములను టీటీడీ ప్రవేశ పెట్టింది. వీటిలో భాగంగా రూ.6 లక్షలు విరాళం ఇస్తే ఆ దాత పేరుతో ఒకపూట అల్పాహారాన్ని భక్తులకు అందజేస్తారు.రూ.10 లక్షలు విరాళం ఇస్తే దాత పేరిట ఒకపూట అన్నప్రసాద వితరణను నిర్వహిస్తారు. రూ. 25 లక్షలు విరాళం ఇచ్చే దాత పేరిట ఒక రోజు అన్నప్రసాద వితరణ నిర్వహిస్తారు. ఇలా టీటీడీ అన్నదాన ట్రస్టులోని స్కీములకు దాతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కొందరు భక్తులు టీటీడీకి నిత్యం దాదాపు ఏడు టన్నుల కూరగాయలను ఉచితంగా పంపుతూ కొంతవరకు భారాన్ని తగ్గిస్తున్నారు. మిగిలిన అదనపు వ్యయాన్ని టీటీడీ హుండీ ఆదాయం ద్వారా వచ్చే నిధుల నుంచి భర్తీ చేస్తోంది. 
  

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top