Sakshi News home page

అలాంటివాడే కావాలి!

Published Sat, Nov 21 2015 11:09 PM

అలాంటివాడే కావాలి! - Sakshi

పరిచయం అవసరం లేని నటి శ్రీయ. ‘ఇష్టం’తో ఆమె ఎంట్రీ ఇచ్చి నప్పుడే అందరూ ఇష్టపడిపోయారు. ఆమె అందాన్ని, నటనను చూసి ‘సంతోషం’ ప్రకటించారు. మా అభిమాన నటి ‘నువ్వే నువ్వే’ అంటూ తేల్చి చెప్పేశారు. నేటికీ సక్సెస్‌ఫుల్ నటిగా సాగిపోతోన్న శ్రీయ చెప్పిన కబుర్లివి. తన గ్లామర్ సీక్రెట్స్, ఫుడ్ హ్యాబిట్స్, తాను మనువాడబోయే వాడిలో ఉండాల్సిన క్వాలిటీస్... అన్నీ చదివి ఎంజాయ్ చేయండి!
 
 
 మీ గ్లామర్ సీక్రెట్?
 వ్యాయామం. ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా తెల్లవారు జామునే లేచి తప్పకుండా యోగా చేస్తాను. ఒకవేళ నటిని కాకుండా ఉన్నా ఇలాగే చేసేదాన్ని. ఎందుకంటే ఫిట్‌నెస్ అందరికీ ముఖ్యమే.
 
 మీ ఫుడ్ హ్యాబిట్స్?
 పొద్దున్నే పరాఠా, ఎగ్ వైట్‌తో ఆమ్లెట్, ఆరెంజ్ జ్యూస్... మధ్యాహ్నం పప్పు, వెజిటబుల్ కర్రీతో రోటీ,... రాత్రికి గ్రిల్డ్ ఫిష్‌తోనో, గ్రిల్డ్ చికెన్‌తోనో డిన్నర్. ఐస్‌క్రీమ్, స్వీట్స్ జోలికి మాత్రం అస్సలు వెళ్లను. 
 
 అందానికి మీరిచ్చే నిర్వచనం?
 అందమంటే మనసు. మనసు, ఆలోచనలు మంచిగా ఉండాలి. అప్పుడు ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. అది మనల్ని అందంగా కనబడేలా చేస్తుంది. 
 
 ఇండస్ట్రీలో మీకు పోటీ ఎవరు?
 పోటీ అన్న మాటే నాకు నచ్చదు. ప్రతి ఒక్కరికీ తమ ప్రతిభకు తగ్గ అవకాశాలు వస్తాయి. మనకంటే ఒకరికి తక్కువ వస్తే మనం ఎక్కువయినట్టు కాదు. మనకంటే ఒకరికి ఎక్కువ వస్తే మనం తక్కువయి పోయినట్టూ కాదు. ఎవరి టాలెంట్ వాళ్లది. ఎవరి అవకాశాలు వాళ్లవి.
 
 మిమ్మల్ని సంతోషపెట్టేది?
 పని. ఎప్పుడూ పని చేస్తూనే ఉండాలి. ఖాళీగా ఉంటే పిచ్చి పడుతుంది నాకు.
 
 మరి బాధపెట్టేది?
 అంధులను చూస్తే చాలా బాధగా ఉంటుంది. అన్నీ సరిగ్గా ఉంటేనే ఒక్కో సారి మనం మేనేజ్ చేసుకోలేక కష్టపడు తుంటాం. అలాంటిది పాపం వాళ్లు ఎలా జీవితాన్ని సాగిస్తారా అని దిగులు కలుగు తుంది. అందుకే నేను ముంబైలో ‘శ్రీ స్పందన’ అనే స్పా పెట్టి, విజువల్లీ చాలెంజెడ్ పీపుల్‌నే స్టాఫ్‌గా పెట్టాను. 
 
 తీరిక వేళల్లో ఏం చేస్తుంటారు?
 సినిమాలు చూస్తుంటాను. పుస్తకాలు చదువుతాను. ‘గాన్ విత్ ద విండ్’ నా ఫేవరేట్ బుక్. అలాగే ఫ్రీ టైమ్‌లో డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తుంటాను.
 
 మీరు కథక్ డ్యాన్సర్ కదా?
 అవును. చిన్నప్పట్నుంచీ నాకు డ్యాన్స్ అంటే ప్రాణం. కథక్, రాజస్థానీ ఫోక్ డ్యాన్స్ నేర్చుకున్నాను. సినిమాల్లో పలు రకాల డ్యాన్సులు చేస్తుంటాను కానీ పూర్తి స్థాయి క్లాసికల్ డ్యాన్స్ చేసే పాత్ర వస్తే బాగుణ్ననిపిస్తూ ఉంటుంది. అలాగే హృతిక్‌తో డ్యాన్స్ చేయాలని కోరిక.
 
 ప్రస్తుతం ఇండస్ట్రీలో మహిళ స్థానం ఎలా ఉంది?
 బాగానే ఉంది. అందుకేగా మేమంతా ఇక్కడ ఉన్నాం. అయినా కష్టసుఖాలనేవి ఎప్పుడూ కలిసే ఉంటాయి. అన్నిచోట్లా ఉంటాయి. అసలు సమస్యే లేని రంగం కావాలంటే ఎక్కడా కనిపించదు. మన పని మనం చేసుకుని పోతూ ఉంటే ఎటువంటి ఇబ్బందులూ రావు. నా వరకూ నాకెప్పుడూ చేదు అనుభవాలు ఎదురు కాలేదు.
 
 మహిళా సాధికారత గురించి మీ అభిప్రాయం?
 మగవాడు లేకుండా మహిళ లేదు. మహిళలు లేకుండా పురుషులూ లేరు. ఎవరూ ఎవరికంటే ఎక్కువా కాదు, తక్కువా కాదు. ఇద్దరూ సమానమే. పురుషులు, స్త్రీలు ఇద్దరూ కలిస్తేనే ఏదైనా సాధ్యపడుతుంది. 
 
 మీకు బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారా?
 ఉన్నారు. నేను మొదట్నుంచీ చాలా యాక్టివ్. అందరితోనూ త్వరగా కలిసిపోయేదాన్ని. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ఈజీగా నా ఫ్రెండ్స్ అయిపోయేవారు. ఇప్పటికీ నా స్కూల్ ఫ్రెండ్స్ నాతో టచ్‌లోనే ఉన్నారు.
 
 ఎవరినైనా ప్రేమించారా?
 లేదు. మనం ఎవరిని ప్రేమిస్తాం, ఎవరిని పెళ్లాడతాం అనేది రాసిపెట్టి ఉంటుంది. సమయం వచ్చినప్పుడు ఆ వ్యక్తి మనకు ఎదురు పడతారు. అప్పుడు ప్రేమ, పెళ్లి అన్నీ ఆటోమేటిగ్గా జరిగిపోతాయి. 
 
 ఎలాంటివాణ్ని కోరుకుంటారు?
 ఆడవాళ్లను గౌరవించేవాడై ఉండాలి. భార్యకీ ఒక వ్యక్తిత్వం ఉంటుందని గుర్తించాలి. మానసికంగా, ఆధ్యాత్మి కంగా పరిణతి గలవాడికే నా ఓటు.
 
 చివరిగా... మీ సక్సెస్ సీక్రెట్?
 క్రమశిక్షణ. ఏ కళలో నిష్ణాతులు కావాలన్నా సాధన చేయాలి. ఆ సాధనే క్రమశిక్షణను నేర్పుతుంది. సమయాన్ని వృథా చేయకుండా ఒక రోజుని ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకుంటే చాలు... అనుకున్నది నూటికి నూరుపాళ్లూ చేయగలుగుతాం. అప్పుడు ఎవరినైనా విజయం తప్పక వరిస్తుంది. 
 

Advertisement
Advertisement