ఆయనలా.. ఈయనిలా!!

ఆయనలా.. ఈయనిలా!! - Sakshi


గోదావరి జిల్లాలపై ప్రకృతి పగబట్టింది. రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. నలభై రోజుల వ్యవధిలోనే ఏకంగా మూడు తుఫాన్లు వరుసపెట్టి వచ్చి, చేతిదాకా అందిన కూడును నోటి వరకు రాకుండా చేసేసరికి రైతు గుండె అల్లాడిపోయింది. అలాంటి పరిస్థితుల్లో అన్నదాతకు తానున్నానంటూ ధైర్యం చెప్పి, నాలుగు మాటలు మాట్లాడి భరోసా ఇవ్వాల్సినది నాయకులే. తుఫాను బాధిత రైతులను పరామర్శించి, పలకరించి, వారికి ప్రభుత్వపరంగా అందాల్సిన సాయం అందుతోందో లేదో తెలుసుకుని, అందకపోతే అందేలా చేయాలన్న ఉద్దేశంతో ఇద్దరు నాయకులు గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లారు. వారిలో ఒకరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాగా, మరొకరు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.



జన నాయకుడు అనేవాడు ప్రజల హృదయాల్లో ఎలా ఉంటాడో, ప్రజల కష్టాల్లో ఎలా పాలుపంచుకుంటాడో తెలియాలంటే ఈ ఇద్దరు నాయకుల పర్యటనలను ఒక్కసారి చూస్తే చాలు. అన్నదాతల బాధలు వింటుంటే గుండె తరుక్కుపోతోందని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.  ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో ఆయన స్వయంగా పొలాల్లోకి దిగి, ఆ మట్టిలోనే నడుస్తూ రైతుల భుజాలపై చేతులు వేసి.. వారి గుండెల్లో కాసింత నిబ్బరం నింపడానికి శాయశక్తులా ప్రయత్నించారు.



మరోవైపు

పశ్చిమగోదావరిజిల్లా నరసాపురం సమీపంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా పర్యటించారు. బాధితులను పరామర్శించారు. పరామర్శించడానికి సీఎం రాకపోయినా తాను వచ్చానంటూ గొప్పలు చెప్పుకున్నారు. చేతికందిన పంటను కోల్పోయిన అన్నదాతను పరామర్శించేందుకు వెళ్లిన చంద్రబాబు... కాలికి కనీసం మట్టికూడా అంటకుండా ఆకుపచ్చ తివాచీ మీద చామంతి పూలు పరిపించుకుని మరీ దానిమీద అత్యంత సుతారంగా నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ నుంచే రైతులను 'ఓదార్చారు'. రాజకీయలబ్ధి కోసమే తప్ప... నిజంగా తమను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ఉంటే వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అంటూ రైతులు విమర్శిస్తున్నారు.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top