కి'లేడీ' దొంగలు! | Women Snachers Theft Gold Chains at Trimulgherry | Sakshi
Sakshi News home page

కి'లేడీ' దొంగలు!

Aug 7 2013 7:10 PM | Updated on Sep 4 2018 5:07 PM

కి'లేడీ' దొంగలు! - Sakshi

కి'లేడీ' దొంగలు!

ఆడదానికి ఆడదే శత్రువు అన్న నానుడి నిజం చేస్తున్నారు 'గొలుసు' దొంగలు. లేడీ చైన్ స్నాచర్ల అవతారమెత్తి తోటి మహిళల మెళ్లో నుంచి బంగారపు గొలుసులు తెంపుకుపోతున్నారు.

ఆడదానికి ఆడదే శత్రువు అన్న నానుడి నిజం చేస్తున్నారు 'గొలుసు' దొంగలు. లేడీ చైన్ స్నాచర్ల అవతారమెత్తి తోటి మహిళల మెళ్లో నుంచి బంగారపు గొలుసులు తెంపుకుపోతున్నారు. స్నాచింగ్లో మగాళ్లకు తామేమీ తీసిపోమని చోరశిఖామణులుగా మారిన మహిళలు నిరూపిస్తున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర రాజధానిలోనే చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ సాటి వాళ్లను హడలెత్తున్నారు కి'లేడీ'లు. పోలీసులకు సవాల్ విసురుతున్నారు.

సాధారణంగా స్త్రీలకు సువర్ణాభరణాలతో చెప్పలేంత ప్రీతి. కనక వస్తువులు ఒంటి నిండా అలంకరించుకోవాలని ఉవ్విళ్లూరని వనితలు తెలుగుగడ్డపై అరుదు. శుభకార్యాలు, వేడుకల్లో మహిళలు చూపే బంగారపు ధగధగల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గాజులు, జుకాలు, వడ్డాణాలు, పాపిడి బిందెలు, అరవంకీలు, కాసులపేర్లతో కళకళలాడి పోతుంటారు. ఎంత బంగారం అలంకరించుకున్నా అతివలకు తనివి తీరదు. ఈ మోజే వారి కొంప ముంచుతోంది.

మహిళల మెడల్లోంచి బంగారపు గొలుసులు తెంపుకుపోవడాలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. ఒంటరిగా బయటకు వచ్చిన వనితల మెడల్లోంచి బలవంతంగా చైన్లు లాక్కుపోవడం సర్వసాధారణమైపోయింది. ఇప్పుడీ చోరీల్లో మహిళలు పాలుపంచుకోవడం విస్తుగొల్పుతుంది. తాజాగా తిరుమలగిరి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన రెండు చైన్ స్నాచింగ్లో ఆడ దొంగలు స్వయంగా పాల్గొనడంతో పోలీసులకు పాలుపోవడం లేదు.

జీడిమెట్లకి చెందిన ఉషారాణి ఆదివారం రాత్రి(ఆగస్టు 4) ఆమె తిరుమలగిరి టీచర్స్ కాలనీలో ఉన్న తన తల్లి ఇంటికి హోండా యాక్టివాపై బయల్దేరారు. కాలనీ వద్ద ఎదురుగా ఓ బైక్ వచ్చింది. యువకుడు బైక్ నడుపుతుండగా దాని వెనుక కూర్చున్న యువతి ఎదురుగా మరో వాహనంపై వస్తున్న ఉషారాణి మెడలోని 3 తులాల బంగారం గొలుసును రెప్పపాటులో లాఘవంగా తెంచి పరారైంది. పట్టుకోవటానికి ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది.

స్నాచింగ్‌కు పాల్పడిన యువతి పంజాబీ డ్రెస్సు.. దానిపై జాకెట్ వేసుకుందని, బైక్‌ను యువకుడు నడిపిస్తున్నాడని బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటిదే మరో ఘటన తిరుమలగిరి పోలీసుస్టేషన్ పరిధిలోని కార్ఖానా ప్రాంతంలో కొద్దివారాల క్రితం చోటుచేసుకుంది. అయితే ఈ రెండు చోరీలకు పాల్పడింది ఒకరేనా, కాదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కొసమెరుపు ఏంటంటే మగ చైన్ స్నాచర్ల ఆట కట్టించేందుకు లేడీ కానిస్టేబుళ్లను సాధారణ మహిళల మాదిరిగా ముస్తాబు చేసి ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్న ప్రాంతాలకు వీరిని పంపి కొంతమంది మగ గొలుసు దొంగలను పట్టుకున్నారు. మరీ లేడీ చైన్ స్నాచర్లకు ముకుతాడు వేసేందుకు పోలీసులు ఎలాంటి ఎర వేస్తారో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement