
సిటీ నుంచి ఇంటికొచ్చిన మనవడు నానమ్మ గొలుసు కాజేశాడు. ఆ సంగతి నానమ్మ కనిపెట్టింది. మనవడంటే ఎంత ప్రేమో ఆమెకు. ఇంట్లో ఉండగా బాగా చదువుకుని టాపర్‌గా ఉన్న మనవడు సిటీకి వెళ్లి ఇలా అయ్యాడా అని బాధ పడింది. తర్వాత ఆమె చేసిన పని మనవడిలో మార్పు తెస్తుందో లేదో గాని టీనేజ్‌లో ఉన్న పిల్లల గురించి పెద్దలందరినీ ఆలోచనల్లో పడేసింది. కేరళలో జరిగిన ఈ తాజా ఘటన వివరాలు....
కేరళలోని అలెప్పి.
ఆ నానమ్మ రోజూ నిద్రపోయే ముందు తన ఒకటిన్నర సవర్ల గొలుసు దిండుకింద పెట్టుకుంటుంది. తెల్లవారి లేచిన తర్వాత మళ్లీ ధరిస్తుంది. కాని ఆ రోజు లేచి దిండు కింద చూస్తే గొలుసు లేదు. రెండు రోజుల క్రితం మనవడు వచ్చాడు. ఈ మధ్య వచ్చినప్పుడల్లా డబ్బు అడుగుతున్నాడు. ఈసారి గొలుసు తీసేశాడన్న మాట. ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. మనవడిని ఈ చేతులతో పెంచింది. వాడు ఇంటర్ వరకూ నిన్న మొన్న ఇక్కడే చదివాడు. టాపర్. ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తానని బెంగళూరు వెళ్లినప్పటి నుంచి ఏమైందో ఏమిటో ఇలా తయారయ్యాడు. నగరం వాడిని మార్చేసిందా... లేదంటే తల్లిదండ్రులకు దూరంగా ఉండటం... అజమాయిషీ లేకపోవడం... తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకపోవడం... ఇవి వాణ్ణి ఇలా తయారు చేశాయా అని మధన పడింది.
పోలీస్ రిపోర్టు ఇస్తే కేసవడం, అరెస్టు చేయడం తాను భరించలేదు. అలాగే తనకున్న ఒక్కగానొక్క గొలుసును పోగొట్టుకోవాలని లేదు. అందుకే పోలీసులకు చాటుగా ఫోన్ చేసింది. ‘అయ్యా... నా మనవడు ఇంత పని చేశాడు. కేసు గీసు ఏం వద్దు. వాడి దగ్గరి నుంచి ఆ గొలుసు సంపాదించి ఇవ్వండి చాలు.... వాడిని తీసుకెళ్లి లోపల వేసి కొట్టడం, హింసించడం చేయవద్దు’ అని బతిమిలాడింది.
అలెప్పి పోలీసులు నానమ్మ హృదయాన్ని అర్థం చేసుకున్నారు. వెంటనే మనవడి ఫొటోను వాట్సప్ చేయమన్నారు. ఆమె చేసింది. పోలీసులు ఆ ఫోటోను ‘ఆల్ కేరళ గోల్డ్ మర్చంట్ అసోసియేషన్’ అలెప్పీ సెక్రటరీ అబి థామస్‌కు పంపారు. అబి థామస్ దానిని తమ వర్తకుల వాట్సప్ గ్రూప్‌లో పెట్టి ‘ఈ కుర్రాడు గొలుసు తీసుకొని వస్తే ఎవరూ కొనవద్దు’ అని మెసేజ్ చేశాడు. అప్పటికే గొలుసుతో బయలుదేరిన మనవడు అలెప్పిలోని ఏ దుకాణానికి వెళ్లినా వర్తకులు ‘నువ్వు దొంగవి’ అనకుండా ‘మేం కొనం’ అని వెనక్కు పంపేయసాగారు.
మనవడు మొత్తం 25 షాపులు తిరిగాడు. ఎవరూ కొనలేదు. దాంతో మూడు రోజుల తర్వాత ఆ గొలుసును తిరిగి నానమ్మకు ఇచ్చేశాడు. ఆమె కోప్పడలేదు. కన్నీరు కార్చింది. మనవడికి బహుమతిగా 1000 రూపాయలు ఇచ్చింది. నువ్వు మారతావని ఆశిస్తున్నా... అంది. మనవడు మారతాడో లేదో కానీ ఇదో ఆలోచించాల్సిన విషయం. చదువు కోసం, కోర్సుల కోసం నగరాలకు పిల్లల్ని పంపాక వారితో నిత్యం కమ్యూనికేషన్‌లో తల్లిదండ్రులు ఉండాలి, ప్రేమను చూపాలి, సాధక బాధకాలు వినాలి... లేకుంటే వారు పెడత్రోవ తొక్కవచ్చు.