ఎవరీ విజయకుమార్? | Sakshi
Sakshi News home page

ఎవరీ విజయకుమార్?

Published Tue, Oct 29 2013 11:15 AM

Who is this vijayakumar?

విజయకుమార్ ఐపీఎస్.. గంధపు చెక్కలు, ఏనుగు దంతాల స్మగ్లింగ్తో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు నిద్రలేకుండా చేసిన వీరప్పన్ను మట్టుబెట్టిన ఎస్టీఎఫ్కు నేతృత్వం వహించిన హీరో ఈయనే. విభజన నేపథ్యంలో తలెత్తే శాంతిభద్రతల సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహాలు రూపొందించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌కు ఈయన అధినేత. ప్రస్తుతం ఆయన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భద్రతా సలహాదారుగా ఉన్నారు.

చిన్నతనం నుంచే పోలీసు యూనిఫాం అంటే విజయకుమార్కు చెప్పలేనంత ఇష్టం. సివిల్ సర్వీసుల కోసం పరీక్ష రాసినప్పుడు ఐఏఎస్ అయ్యేలా మంచి ర్యాంకు వచ్చినా.. దాన్ని వద్దనుకుని ఐపీఎస్ ఎంచుకున్నారు. అందరికీ ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ అనే తెలుసు. కానీ ఆయన మాత్రం ఐడియల్ పబ్లిక్ సర్వీస్ అనుకుంటారు. ఆయన గురించి అభిమానులు చెప్పే మాటలు చూస్తే చాలు.. విజయకుమార్ అంటే ఏంటో తెలుస్తుంది.

''సినిమాలో హీరోలు మూడు గంటలే వెలుగుతారు.. రాజకీయ నాయకులు ఐదేళ్లలో మబ్బుల చాటుకు వెళ్లిపోతారు.. లెజెండ్స్ ఒక తరం పాటు వెలిగిపోతారు.. యోధులు మాత్రం ప్రజల హృదయాల్లో చిరకాలం నిలిచిపోతారు"

1952 సెప్టెంబర్ 15న పుట్టిన విజయకుమార్ తండ్రి కృష్ణన్ నాయర్, తల్లి కౌసల్య. ఆరుగురు సంతానంలో ఈయన రెండోవారు. తండ్రి కృష్ణన్ నాయర్ కూడా పోలీసు అధికారే కావడంతో విజయకుమార్ చిన్నతనం నుంచి పోలీసు యూనిఫాం పట్ల మక్కువ పెంచుకున్నారు. 1975లో ఆయన యూపీఎస్సీ పరీక్షలు రాసీ ఐపీఎస్ అయ్యారు. ఆయన పట్టుకొట్టాయ్, తిరుచ్చి, సెంబియాం (చెన్నై)లలో ఏఎస్పీగా పనిచేశారు. అనంతరం ధర్మపురి, సేలం జిల్లాలకు ఎస్పీగా వ్యవహరించారు. అదేసమయంలో వాల్టర్ దవారం అనే యువ పోలీసు అధికారితో చాలాకాలం కలిసి పనిచేశారు. ఆయన ధైర్యసాహసాలను విజయకుమార్ ఎప్పుడూ మెచ్చుకునేవారు.

విజయకుమార్ నిర్వహించిన మరికొన్ని కీలక పోస్టులు

  • మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి భద్రత కల్పించిన ఎస్పీజీ సభ్యుడు
  • కేంద్రంలోకి డిప్యూటేషన్ మీద బీఎస్ఎస్ ఆపరేషన్స్ ఐజీ
  • చెన్నై నగర పోలీసు కమిషనర్/ అదనపు డీజీపీ
  • స్పెషల్ టాస్క్ఫోర్స్ చీఫ్ (వీరప్పన్ను హతమార్చిన బృందం)
  • తమిళనాడు అదనపు డీజీపీ, శాంతిభద్రతలు
  • హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ డైరెక్టర్
  • కేంద్ర రిజర్వు పోలీసు ఫోర్సు డైరెక్టర్ జనరల్

Advertisement

తప్పక చదవండి

Advertisement