ఆ కంచెను కత్తిరించాలి

మల్లెపల్లి లక్ష్మయ్య - Sakshi


 కొత్త కోణం

 1981 నుంచి ఇప్పటివరకు జనాభా పెరుగుదలకనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచక పోవడం వల్ల కేంద్ర ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీలు తమ వాటాను గణనీయంగా కోల్పోతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, రైల్వేలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, విద్యాలయాలు, ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన ఉద్యోగాల వాటాను గత 30, 35 ఏళ్లుగా ఆ వర్గాలు నష్టపోతున్నాయి. అదేవిధంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) నియామకాల్లోనూ ఎస్సీ, ఎస్టీ యువకులు అవకాశాలను కోల్పోతున్నారు.



 ‘‘భారత సామాజిక నిర్మాణం నాలుగు శ్రేణులుగా జరిగింది. మొదటి శ్రేణిలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలు ఉన్నాయి. రెండవ శ్రేణి శూద్రు లది. వీరు వర్ణవ్యవస్థలో భాగం. ఆదివాసీ తెగలు, మైదాన ప్రాంతంలో నేర గాళ్లుగా ముద్ర పడిన కొన్ని తెగలది మూడవ శ్రేణి. నాలుగవ శ్రేణి అంటరాని కులాలు. మూడు, నాలుగుశ్రేణులు కలిపి అవర్ణకులాలు. వర్ణవ్యవస్థలో మొదటి శ్రేణికి చెందిన మూడు కులాలు ద్విజులు. వీరికి కుల సమాజంలో ప్రత్యేకమైన హక్కులుంటాయి. శూద్రుల మధ్య తేడా ఉన్నమాట వాస్తవం. ఈ తేడా ఒకరి నుంచి మరొకరిని వేరు చేయడానికి ఉద్దేశించినది కాదు. అలాగే శూద్రకులాలూ, అవర్ణ కులాలలోని ఆదివాసీ, నేరగాళ్లుగా ముద్ర వేసిన తెగలకూ మధ్య తేడా ఉంది. అది కూడా ద్వేషపూరితం కాదు. కానీ నాలుగవ శ్రేణిలో ఉన్న అంటరాని కులాలకూ మిగతా కుల సమాజంలోని అన్ని సమూహాలకూ నడుమ ఉన్న తేడా ఇనుప కంచెలాంటిది. ఇది తొలగిం చలేనంత బలమైనది.’’ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నమాటలివి. అంబే ద్కర్ రచనలలో అయిదవ సంపుటిలో పొందుపరిచిన ఈ అవగాహనా సారం ఇప్పటికీ కళ్లకు కట్టిన ట్టే ఉంది.



 అమలు దగ్గరే అసలు తంటా

 రాజ్యాంగంలో ఎన్నో రక్షణలు ఉన్నప్పటికీ, వాటి ఆధారంగా ఎన్ని చట్టాలు రూపొందుతున్నప్పటికీ ఆచరణలో అవి ఇస్తున్న ఫలాలు మాత్రం అరకొర గానే ఉంటున్నాయి. ముఖ్యంగా విద్య, ఉద్యోగ రిజర్వేషన్లలో ఉన్న రక్షణ అమలులో చాలా నిర్లక్ష్యం కనిపిస్తున్నది. చట్టాలు కూడా అమలులో ఎటు వంటి ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. రాజకీయ పార్టీలు సైతం చాలా రాష్ట్రాల్లో అంటరాని కులాలపట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాయి. సంవత్సరం క్రితం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఎస్సీ ఎస్టీల ఉద్యోగాల ప్రమోషన్లలో రిజర్వే షన్ బిల్లు ప్రతులను తమ అధినేత ములాయంసింగ్ యాదవ్ ఆదేశాల మేరకు సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు చింపి, చట్టం కాకుండా అడ్డుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో దళిత వ్యతిరేకత మీద ఆధారపడి పాలన సాగిస్తున్నారు. నిజా నికి తరతరాలుగా దూరంగా ఉండిపోయిన ఎస్సీలను ఈ సమాజం అక్కున చేర్చుకోవాల్సింది పోయి దాడులకూ, అత్యాచారాలకూ పాల్పడుతున్నది. చట్టాలతో రక్షణ, ఉద్యోగాలలో రిజర్వేషన్లు లేకుంటే ఇక మిగిలేది వివక్ష మాత్రమే. రాజ్యాంగం రక్షణ కల్పించిన తరువాత చైతన్యంతో ముందుకు సాగుతున్న దళిత సమాజంపై భౌతిక దాడులు, హత్యలు పెరిగాయి. ఇది ఇక్కడితో ఆపకుండా పద్ధతి ప్రకారం విద్య, ఆరోగ్యం, ఇతర రంగాల్లో ఈ వర్గాలకు అవకాశాలు అందకుండా పథకం వేస్తున్నారు. ప్రభుత్వ పాఠశా లల్లో, ప్రభుత్వ వైద్యశాలల్లో దళితులు ప్రవేశిస్తున్నారని గ్రహించిన ఆధిపత్య కులాలు వాటినే వెలివేశాయి. ప్రతి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నూటికి 80 శాతం మంది ఎస్సీలు ఉండడమే దీనికి కారణం.



 ఇక్కడ ఒక విషయాన్ని పరిశీలించాలి. అంటరానికులాలకూ, ఆదివాసీ లకూ రాజ్యాంగం ఇస్తున్న రక్షణల ఆధారంగా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. 16(4), 16(4)ఎ, 335 ఆర్టికల్స్ ప్రకారం ఈ రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయి. వీటి అమలులో కేంద్ర ప్రభుత్వాలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయనడానికి ఇంతవరకు జరిగిన ఆచరణే గీటురాయి. గత ముప్పయ్ ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా రావా ల్సిన వాటాను అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. నిజానికి బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ, వారిని విస్మరిస్తున్నాయనడం సబబు. స్వాతంత్య్రానంతర చరిత్రను పరిశీలిస్తే రిజర్వేషన్ల అమలులో జరిగిన లోపాలు బహిర్గతం అవుతాయి.  

   

 దేశం స్వాతంత్య్రం పొందడానికి ముందే 1943లో మొదటిసారిగా అంబేద్కర్, గాంధీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అధికారికంగా రిజర్వేషన్ల అమలు ప్రారంభమైంది. ఆ రోజు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కేవలం 8.33 శాతం రిజర్వేషన్లను అమలు చేశారు. స్వాతంత్య్రం వచ్చాక 1947 సెప్టెంబర్ 21వ తేదీ నుంచి వాటిని 12.5 శాతానికి పెంచారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత మొదటి సారిగా ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లను కల్పించారు. అయితే అప్పటి వరకు అమలు చేసిన రిజర్వేషన్లన్నీ జనాభా ప్రాతిపదికన జరిగినవి మాత్రం కాదు. మొదటిసారిగా 1961 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం కేటాయించి, 1970 మార్చి 25న వాటిని అమలులోకి తీసు కొచ్చారు. ఇది తొమ్మిదేళ్లు ఆలస్యంగా తీసుకున్న నిర్ణయం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవే లెక్కలను కేంద్రం పరిగణనలోనికి తీసుకుంటున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పెరిగిన జనాభా ఆధారంగా రిజర్వేషన్లను అమలు చే స్తున్నాయి.



 1981లో ఎస్సీలు 15.8 శాతం, ఎస్టీలు 7.8 శాతం ఉన్నారు. అంటే ఎస్సీ లకు 16 శాతం, ఎస్టీలకు 8 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. ఏ సంఖ్యలోనైనా 0.5 శాతం లేదా ఆ పైన పెరుగుదల ఉంటే అది ఆ తరువాత సంఖ్యగా మారు తుంది. కానీ కేంద్ర ప్రభుత్వాలు పెరిగిన జనాభా లెక్కల ప్రకారం రిజర్వే షన్లను అమలు చేయడం లేదు. మిగతా సంవత్సరాల లెక్కలను చూసినా జనాభా పెంపుదల ప్రకారం రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలి. 1991 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలు 16.5 శాతం, ఎస్టీలు 8.1 శాతానికి పెరిగారు. 2001 లెక్కల ప్రకారం ఎస్సీలు 16.2, ఎస్టీలు 8.2 శాతంగా ఉన్నారు. ఈ మేరకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలి. కానీ దళిత, ఆదివాసీల పట్ల ఏ మాత్రం శ్రద్ధలేని ప్రభుత్వాలు దుర్మార్గంగా వ్యవహరించాయి. పెరిగిన జనాభాను పరిగణలోనికి తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. 2011 లెక్కల ప్రకారం ఎస్సీల జనాభా 16.6 శాతం, ఎస్టీల జనాభా 8.6 శాతంగా నమోద య్యింది. అంటే ఎస్సీల రిజర్వేషన్లు 17 శాతం, ఎస్టీల రిజర్వేషన్లు 9 శాతం పెరగాలి. కానీ ఇప్పటికీ రిజర్వేషన్ల పెంపు పట్ల ఎటువంటి నిర్ణయాలు తీసు కోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికీ, దళిత వ్యతిరేక తత్వానికీ అద్దం పడుతోంది.



 అట్టడుగు వర్గాలకు అపార నష్టం

 1981 నుంచి ఇప్పటివరకు జనాభా పెరుగుదలకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచకపోవడం వల్ల కేంద్ర స్థాయిలో ఉన్న ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీలు తమ వాటాను గణనీయంగా కోల్పోతున్నారు. ప్రభుత్వ రంగ సం స్థలు, రైల్వేలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, విద్యాలయాలు, ప్రభు త్వంలోని వివిధ విభాగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన ఉద్యోగాల వాటాను గత 30, 35 ఏళ్లుగా ఆ వర్గాలు నష్టపోతున్నాయి. అదేవిధంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) నియామకాలలోనూ ఎస్సీ, ఎస్టీ యువ కులు అవకాశాలను కోల్పోతున్నారు. ఏ రాజకీయ పార్టీ దీనిపై దృష్టి పెట్టక పోవడం విచారకరం.



 బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు సమాజంలోని కుల స్వభావం ఎస్సీల పట్ల ఒక వ్యతిరేక భావాన్ని కలిగి ఉండడం వల్ల, ప్రభుత్వాలు ఆ ప్రభావానికి లొంగిపోతున్నట్టు రుజువవుతున్నది. అందువల్ల రాజ్యాంగంలో హక్కులు ఉన్నప్పటికీ, విధాన నిర్ణయాలు జరిగినప్పటికీ అవి అమలుకు నోచుకోవు. అందుకే దేశం ఒక జాతిగా నిర్మాణం కావడానికి కుల సమాజం అడ్డంకిగా ఉంటుంది. అంబేద్కర్ భావించినట్టు ‘‘కులం పునాదుల మీద ఒక జాతిని, నీతిని నిర్మించలేం’’అనేది కూడా రుజువవుతున్నది. భారతదేశంలో ఒక ఆదర్శ సమాజం ఏర్పడడానికి కులం బలమైన అడ్డంకిగా మారింది. మనిషి శక్తి, అర్హతలను బట్టికాక, కులం అనే ఒక ముద్రతో అన్ని అవకాశా లను కొన్ని కులాలే పొందుతున్నాయి. అందుకే భారత రాజ్యాంగ రచనా సమయంలో సుదీర్ఘ చర్చ జరిపి ఎవరైతే సామాజికంగా, ఆర్థికంగా వివక్షకు గురవుతున్నారో అటువంటి కులాలకు, వర్గాలకు ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించాలని భావించారు. అదేవిధంగా, ప్రజాస్వామిక ప్రాథమిక సూత్రం ప్రాతినిధ్యమే. అంటే దేశ పాలనలో, అభివృద్ధిలో, అవకాశాలలో సమాన భాగస్వామ్యం ఉండాలనేది దానర్థం. ప్రత్యేక సదుపాయాలు లేదా రిజర్వే షన్లు లేకుంటే ఎస్సీ, ఎస్టీలు భాగస్వామ్యం పొందలేరనేది ఆనాటి రాజ్యాంగ నిర్మాతల అభిప్రాయం. ఇది మన అనుభవం మాత్రమే కాదు. అమెరికా కూడా ఆఫ్రో-అమెరికన్‌లకు ప్రత్యేక అవకాశాలను కల్పిస్తున్నది.



 అయితే అమెరికాలో వలె కాకుండా భారతదేశంలో చట్టాలు సమాజం ఆధిపత్యం ముందు వీగిపోతాయి. ఆపై నిరుపయోగమైపోతాయి. ఇక్కడ చట్టాలు అమలు జరగాలంటే సమాజంలో వున్న దళిత వ్యతిరేకత రూపు మాసిపోవాలి. అప్పుడే మార్పు కనిపించే అవకాశం ఉంది. నూటికి పావు భాగంగా ఉన్న ఎస్సీ, ఎస్టీలను అభివృద్ధిలో భాగం చేయకపోతే ఎప్పటికీ ఈ దేశం సమగ్రాభివృద్ధిని సాధించలేదు. కాబట్టి ఆధిపత్య కులాల్లోని ప్రజా స్వామిక, ప్రగతిశీల శక్తులు ఇటువైపు దృష్టి సారించాలి. శరీరంలో ఒక భాగం రోగగ్రస్తమైనప్పుడు ఆ భాగానికి చికిత్స చేయకుంటే వ్యక్తి సంపూర్ణ ఆరోగ్య వంతుడు కాలేడు. నిత్య దారిద్య్రం, నిరుద్యోగం, అవమానం వంటి సమ స్యలతో కొట్టుమిట్టాడుతున్న ఎస్సీ, ఎస్టీలను విస్మరిస్తే దేశం పురోగమించడం అసాధ్యం.



 (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు)

  మొబైల్: 9705566213

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top