షాపర్స్ ఎక్స్‌ప్రెస్

షాపర్స్ ఎక్స్‌ప్రెస్ - Sakshi


గడప దాటకుండా అనుకున్న వస్తువును తలుపు తట్టేలా చేస్తున్నఆన్‌లైన్ షాపింగ్‌కు నెటిజన్లు ఎప్పుడో దాసోహమయ్యారు.అదే అనుకున్న వస్తువును అనుకూలమైన ధరకు లభిస్తే అంతకన్నా కావాల్సిందేముంటుంది. వినియోగదారునికి ఆదాయాన్ని ఆదా చేసుకునే దారిని చూపిస్తోంది ‘షాపర్స్ ఎక్స్‌ప్రెస్’. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల ఆలోచనల్లోంచి పుట్టిన ఈ షాపింగ్ సైట్.. వినియోగదారుడి ఖర్చు తగ్గిస్తూ ఆన్‌లైన్‌లో ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోతోంది.

 

గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలోని బీటెక్ ఈసీఈ సెకండ్ ఇయర్ స్టూడెంట్ మందడపు జీవన్, థర్డ్ ఇయర్ స్టూడెంట్ కొండా మురళీధర్.. స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్. ఇంజనీరింగ్ విద్యార్థులుగా టెక్నాలజీ వైపు పరుగులు తీస్తున్న ఈ యంగ్ తరంగ్‌ల ఆలోచన ఆన్‌లైన్ షాపింగ్‌పై పడింది. ఇంట్లో రోజువారీ కొనుగోళ్లు, మార్కెట్‌లో ఊరిస్తున్న డిస్కౌంట్లు.. ఆన్‌లైన్‌లో జరుగుతున్న బిజినెస్.. ఇవన్నీ గమనించారు. వీటన్నింటినీ లింకప్ చేస్తే ఖర్చు తగ్గించే మార్గం కనుగొన్నారు. అందుకోసం ‘షాపర్స్ ఎక్స్‌ప్రెస్’ వెబ్‌సైట్‌ను రూపొందించారు. http://shoppersexpress.inలో రిజిస్టర్ చేసుకుంటే చాలు సరసమైన ధరకు మీరు కోరుకున్న సరుకు సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు కొసరుగా కొంత మొత్తాన్ని తిరిగి పొందవచ్చు కూడా.

 

కొంత మాకు.. కొంత మీకు..


షాపర్స్ ఎక్స్‌ప్రెస్‌లో రిజిస్టర్ చేసుకుంటే ఇక్కడి నుంచి మీరు అన్ని రకాల ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లలో లాగిన్ కావొచ్చు. ఇందులో దాదాపు 200 వరకు సైట్లలో కొనుగోళ్లు దర్జాగా చేసుకోవచ్చు. అమెజాన్, మెంత్రా, జబాంగ్, డొమినోస్, కేఎఫ్‌సీ వంటి జనాదరణ కలిగిన వెబ్‌సైట్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఫోన్ రీచార్జ్ మొదలుకొని మనీ ట్రాన్స్‌ఫర్ దాకా, దుస్తులు, గాడ్జెట్స్ కొనుగోళ్లు.. ఒకటేమిటి నిత్యావసర సరుకులూ ఈ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ నుంచి ఆన్‌లైన్‌లో మీ ఇంటికి రప్పించొచ్చు.ఈ సైట్ ద్వారా షాపింగ్ చేస్తే రిటైలర్లు.. షాపర్స్ ఎక్స్‌ప్రెస్‌కు కొంత క మీషన్ ఇస్తారు. ఇలా వచ్చిన మొత్తంలోనుంచి నామమాత్రంగా కొంత తీసుకుని మిగిలిన అమౌంట్‌ను వినియోగదారునికి బదిలీ చేయడం షాపర్స్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకత. రిటర్న్ అమౌంట్ చిన్నమొత్తం అయితే మీ మొబైల్‌లో రీచార్జ్ చేయిస్తారు. అదే కాస్త పెద్ద మొత్తమైతే నేరుగా మీ అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు.

 

అనతి కాలంలోనే..


వెబ్‌సైట్ రూపొందిన మూడు నెలల్లోనే3,500 మంది పేర్లు నమోదు చేసుకొని షాపింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో 10 వేల మంది ఈ సైట్‌కు ఫాలోవర్స్ ఉన్నారు. మిత్రుల పరిచయాల ద్వారా ట్రిపుల్ ఐటీ, బిట్స్, సెంట్రల్ యూనివర్సిటీ వంటి విద్యాసంస్థల్లో సైట్ ప్రచారం బాగా జరిగింది. రానున్న రోజుల్లో సైట్ విస్తృతం చేసి అందరికీ అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పని చేస్తామంటున్నారు ఈ యంగిస్థాన్‌లు.

 

మిగల్చడమే లక్ష్యం..

ప్రతి ఒక్కరి షాపింగ్ ఖర్చులో కొంతైనా ఆదా చేయడమే మా షాపర్స్ ఎక్స్‌ప్రెస్ లక్ష్యం. చిన్నపాటి స్టార్ట్ అప్‌ను ప్రారంభించాం. కానీ, మూడు నెలల్లోనే ఎంతో ఆదరణ పొందింది. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఏటా రూ.40 వేల వరకూ ఖర్చు చేస్తుంటారు. మా వెబ్‌సైట్ ద్వారా షాపింగ్ చేస్తే కనీసం రూ.4 వేలు మిగుల్చుకోవచ్చు. పిజ్జా మొదలుకొని ఇతర వస్తువులు మా సైట్ ద్వారా కొనుగోలు చేస్తే కాస్తో కూస్తో మిగులుతుందనే అభిప్రాయం చాలా మందికి వచ్చింది.

 - జీవన్, రూపకర్త

 

టార్గెట్ లక్ష మంది

మా ఇద్దరికీ వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టాం. దీన్ని మరింత విస్తృతం చేయాలనే ఆలోచన ఉంది. కస్టమర్ల సంఖ్య లక్షకు చేరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. కేవలం విద్యార్థులే కాదు.. ఎవరైనా ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. అందరికీ మేలు జరిగే లక్ష్యంతోనే దీన్ని తీసుకొచ్చాం.

 - మురళీధర్, రూపకర్త

 ప్రజెంటేషన్: జె.రాజు/రామ్మోహన్

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top