చెప్పులు విప్పితేనే భోజనం | Jai jalaram Hotel in hyderabad | Sakshi
Sakshi News home page

చెప్పులు విప్పితేనే భోజనం

Nov 2 2014 11:26 PM | Updated on Sep 2 2017 3:46 PM

చెప్పులు విప్పితేనే భోజనం

చెప్పులు విప్పితేనే భోజనం

చెప్పులు ఎక్కడ విప్పుతాం? గుడి, మసీదు, ప్రార్థనా మందిరాలు.. కొన్ని సందర్భాల్లో దుస్తులు, నగల దుకాణాల ముందు.. ఇలా అన్నిచోట్లా తిరిగి ఇంటికి చేరుకున్నాక, ఇంటి గుమ్మం ముందు విప్పుతాం.

వైవిధ్యం
చెప్పులు ఎక్కడ విప్పుతాం? గుడి, మసీదు, ప్రార్థనా మందిరాలు.. కొన్ని సందర్భాల్లో దుస్తులు, నగల దుకాణాల ముందు.. ఇలా అన్నిచోట్లా తిరిగి ఇంటికి చేరుకున్నాక, ఇంటి గుమ్మం ముందు విప్పుతాం. అయితే, భోజనం కోసం హోటల్ లోపలకు వెళ్లడానికి చెప్పులు వదలడం ఎక్కడైనా చూశారా? వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా.. ఇలాంటి హోటల్ మన భాగ్యనగరంలోనే ఉంది. నగరంలోని పెద్దపెద్ద స్టార్ హోటళ్లు, బడా రెస్టారెంట్లలో ఎక్కడా కనిపించని సంప్రదాయం పూటకూళ్ల ఇంటిని తలపించే ఆ చిన్న హోటల్‌లో కనిపిస్తుంది.
 
పట్టుమని పది అడుగుల పొడవు, ఐదడుగుల వెడల్పయినా లేని ఆ చిరు హోటల్‌లోకి అడుగు పెట్టాలంటే, పాదరక్షలను బయటే విడిచిపెట్టక తప్పదు. ఈ నిబంధన కేవలం భోజనానికి మాత్రమే పరిమితం కాదు. అక్కడ టిఫిన్ చేయాలన్నా, స్నాక్స్ తినాలన్నా ఈ నిబంధనను పాటించి తీరాల్సిందే. పాదరక్షల నిషేధాన్ని నిక్కచ్చిగా పాటిస్తున్న ఆ హోటల్.. సుల్తాన్‌బజార్‌లోని కందస్వామి లేన్‌లో ఉన్న ‘జై జలరాం హోటల్’. ఇంటి భోజనాన్ని తలపించే తృప్తికరమైన రుచులను వడ్డించడం ఈ హోటల్ ప్రత్యేకత అని చెబుతారు హోటల్ యజమానులు భావన్ రాజా, హర్ష రాజా దంపతులు.
 
కింద కూర్చునే..
భావన్‌ది మహారాష్ట్రలోని అమరావతి. తన తాతల కాలంనాటి నుంచి అంటే దాదాపు 150 ఏళ్లుగా అక్కడ హోటల్‌ను నడుపుతున్నారు. భావన్ కొంతకాలం డిజిటల్ స్క్రీన్, ఫ్లెక్సీ, సైన్‌బోర్డ్, గ్లో యాడ్స్ బిజినెస్ కూడా చేశారు. అది తృప్తికరంగా సాగకపోవడంతో వదిలేశారు. అత్తగారిల్లు హైదరాబాద్‌కు మకాం మార్చారు. సొంత ఊరిలో హోటల్ నడిపిన అనుభవం ఉండటంతో.. కందస్వామి లేన్‌లో రెండేళ్ల క్రితం అద్దె ఇంటిలో హోటల్ ఏర్పాటు చేశారు. ఏడాది కిందటి వరకు అక్కడ హోటల్ ఉందంటే ఎవరూ నమ్మేవారు కాదు. ఎందుకంటారా..? కనీసం హోటల్ అని తెలిపే బోర్డు లేకపోవడం, అది కూడా మొదటి అంతస్తులో అద్దెకుంటున్న ఇంట్లో ఉండడం. పైగా అక్కడ ఎంచక్కా కస్టమర్లను కింద కూర్చోబెట్టి పంక్తి భోజనంలా వడ్డించేవారు. ఈ తరహా సంప్రదాయం నచ్చిన వాళ్లంతా భోజనం చేయడానికి
 క్యూ కట్టేవారు.
 
సంప్రదాయుం ముఖ్యం..
ఏడాది కిందట షట్టర్ అద్దెకు తీసుకుని హోటల్‌ను కిందికి మార్చారు. ప్రస్తుతం కుర్చీల్లో కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తున్నా, కస్టవుర్లు పాదరక్షలను విడిచి రావాలన్న నిబంధనను మాత్రం వీడలేదు. చెప్పులు విప్పి తినమంటే చాలా మందికి చిరాకే. ఇది నచ్చక.. వచ్చిన క స్టమర్లు వెనుదిరగక మానరు. ఫలితంగా హోటల్ ఆర్థికంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీన్ని గ్రహించే పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు పాదరక్షలతో ప్రవేశంపై నిషేధాన్ని పాటించడం లేదు. కాని భావన్ అలాకాదు.

గిరాకీ ఎంత ముఖ్యమో, సంప్రదాయం కూడా అంతే ముఖ్యం అంటారు. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం. తినేటప్పుడు చెప్పులు విప్పాలన్న నియమం కొందరికి నచ్చదు. అలాంటి కస్టమర్లు తినకుండా వెళ్లిపోతుంటారు. కొన్ని రోజులకు ఆలోచించుకుని తిరిగి వస్తుంటారు. సంప్రదాయం అని మాత్రమే కాదు, చెప్పులు విప్పి, కాళ్లు చేతులు కడుక్కుని శుభ్రంగా భోజనం ముందు కూర్చుంటే క్రిమికీటకాలు దరిచేరవు. ఫలితంగా ఆరోగ్యంగా ఉండొచ్చు’ అని భావన్ అంటున్నారు.
  - మహి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement