చేనుకి పోయిన మనిషి చితికిపోతే ఎలా?

YSR is a good source of free power supply for the farmers welfare - Sakshi

రైతు భరోసా 

పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా

చేనుకి పోయిన మనిషి ఇంటికి ఏ రూపంలో తిరిగొస్తాడో తెలియదు. రైతు తనని తాను చంపుకోవాల్సిన పరిస్థితులు కొన్నయితే విధాన నిర్ణేతల తప్పిదాలు మరికొన్ని. ఈ కోవలోదే చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన విద్యుత్‌ సరఫరా హామీ... గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మందాడి గ్రామానికి చెందిన యువ కౌలు రైతు వంకద్వత్‌ అంజి నాయక్‌ మిర్చి పంట పండిస్తుంటాడు. వాన మొఖం చాటేసింది. మబ్బులు కిందికి దిగిరానంటున్నాయి. బోరు బావులే దిక్కయ్యాయి. వీటికి ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో సర్కారు వారి దయ. దీంతో అంజి నాయక్‌ ఇటీవల ఓరోజు అర్ధరాత్రి దాటింతర్వాత చేనుకి నీళ్లు కట్టుకుందామని వెళ్లాడు. వెళ్లినవాడు పొద్దు బారెడెక్కినా ఇంటికి రాలేదు. ఏమైందో తెలియక తల్లడిల్లిన ఇల్లాలు చేనుకి పోయి చూసేసరికి గుండె గుభిల్లుమంది. విద్యుద్ఘాతం అంజిని పొట్టన పెట్టుకుంది. ఇలాంటివి ఎన్నో... కర్నూలు జిల్లా సంజామల మండలం మిక్కినేని గ్రామంలో ఒకేరోజు ముగ్గురు రైతులు మబ్బుల్లో పొలానికి పోయి మళ్లీ తిరిగి రాలేదు. ఆ చీకట్లో తెగిపడిన కరెంటు తీగె వారి ప్రాణాలను మిగేసింది.

రైతు వ్యథాభరిత చిత్రానికి ఇవన్నీ రుజువులు.వేళకాని వేళల్లో ఇచ్చే కరెంటు కోసం వెళ్లి రైతులు చచ్చిపోతున్నారు. గత నాలుగేళ్లుగా ఇదే తీరు. ఈ దశలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతన్నలకు ఓ హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే నవరత్నాలలో భాగంగా పగటిపూట నిరంతరాయంగా హెచ్చుతగ్గులు లేని నాణ్యమైన కరెంటును 9 గంటల పాటు సరఫరా చేస్తానని భరోసా ఇచ్చారు. ఆయన మాటను అన్నదాతలు విశ్వసించారు. ఎందుకో తెలుసా.. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రోజే ఉచిత విద్యుత్‌ సరఫరా ఫైల్‌పై సంతకం చేసిన ఘనత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిది. పాత బకాయిలు రద్దు చేసిన పెద్దమనసు ఆయనది. ఆవేళ ఉమ్మడి రాష్ట్రంలో 23 లక్షల బోర్లకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసి మాట నిలుపుకున్నారు.

ఉచిత విద్యుత్‌ ఇచ్చే విషయంలో ఆయా రైతులకు భూమి ఎంత, ఎటువంటి పంట, పంప్‌సెట్‌ సామర్థ్యం ఎంత, పేదరైతా? పెద్ద రైతా అనేది చూడలేదు. కస్టమర్‌ సర్వీస్‌ చార్జీలనూ నయాపైసా వసూలు చేయలేదు. రాష్ట్ర ఖజానాకు అది భారమవుతుందేమో అని యోచించలేదు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఉచిత విద్యుత్‌ సరఫరా చేసిన మహానేత వైఎస్సార్‌. అటువంటి ఆయన కడుపున పుట్టిన జగన్‌ మాట తప్పడన్న ధీమా రైతన్నది. అందుకే పాదయాత్రలో అంతలా ఆదరించారు. అక్కున చేర్చుకున్నారు. జగన్‌ హామీతో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 16 లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్‌ వస్తుంది. 17 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుంది. లక్షలాది ఎకరాలకు నీళ్లు అందుతాయి. వీళ్లందరికీ 9 గంటల పాటు పగటిపూట ఉచిత విద్యుత్‌ సరఫరా అవుతుంది. ఆక్వా రైతులకు యూనిట్‌కు రూపాయిన్నరకే విద్యుత్‌ వస్తుంది. 
– ఎ.అమరయ్య, చీఫ్‌ రిపోర్టర్, సాక్షి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top