పాపకు తరచూ  విరేచనాలు...  ఎందుకిలా? 

Your girl Is a Problem Nan Infectious Diarrhea - Sakshi

పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్స్‌

మా పాప వయసు పదేళ్లు. గత కొద్ది నెలలుగా పదే పదే విరేచనాలు అవుతున్నాయి. కొద్దిపాటి మందులతో తగ్గినట్లే తగ్గినా... మళ్లీ సమస్య తిరగబెడుతోంది. మరీ చెప్పాలంటే... పాప భోజనం తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి వస్తోంది. ఎప్పుడైనా కొద్దిగా నీరసంగా ఉంటోంది. మా పాప సమస్య ఏమిటి? ఎందుకిలా జరుగుతోంది. పరిష్కారం ఉందా? 
 
మీరు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే మీ పాపకు రికరెంట్‌ డయేరియల్‌ ఎపిసోడ్స్‌ ఉన్నట్లు చెప్పవచ్చు. పిల్లల్లో వారు సాధారణంగా విసర్జనకు వెళ్లే టాయిలెట్స్‌ హాబిట్స్‌తో పోల్చినప్పుడు... వారు మలవిసర్జనకు వెళ్లాల్సిన విడతలు ఎక్కువైనా లేదా వారి క్రమబద్ధమైన వేళల్లో మార్పువచ్చినా దాన్ని డయేరియా అని నిర్వచించవచ్చు. అలాగే అది  ఒకేసారి ఎక్కువగా విరేచనాలు (అక్యూట్‌ డయేరియా), లేదా పదే పదే విరేచనాలు కావడం లేదా దీర్ఘకాలికంగా ఉండే డయేరియా అయినా కావచ్చు. 

మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తూంటే మీ అమ్మాయిది రికరెంట్‌ డయేరియా అని చెప్పవచ్చు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. వాటిల్లో ఒకటి ఇన్ఫెక్షన్‌ అంటే బ్యాక్టీరియల్‌ లేదా ప్రోటోజోవా (అమీబిక్‌) కావచ్చు. లేదా నాన్‌ ఇన్ఫెక్షియస్‌ డయేరియా కూడా కావచ్చు. మీరు చెబుతున్న లక్షణాలతో మీ అమ్మాయిది నాన్‌ ఇన్ఫెక్షియస్‌ డయేరియా అయ్యేందుకు అవకాశం ఎక్కువ. ఇలాంటి కండిషన్‌కు చాలా అంశాలు కారణం కావచ్చు. ఉదాహరణకు... 

►తిన్న తిండి ఒంటికి పట్టడంలో సమస్యలు (మాల్‌ అబ్‌జార్‌ప్షన్‌). ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్‌ లేదా ప్రోటీన్స్‌ లేదా ఫ్యాట్‌ అబ్‌జార్‌ప్షన్‌లో సమస్యలు. 

►ఎండోక్రైన్‌ సమస్యలు, కొన్ని ఆటో ఇమ్యూన్‌ సమస్యలు, నిర్దిష్టమైన ఎంజైమ్స్‌లో లోపాలు, ఇన్‌ఫ్లమేటరీ బవెల్‌ డిసీజెస్‌ (ఐబీడీ), ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌) వంటి ఏదైనా కారణం వల్ల కూడా ఆమెకు సమస్య వచ్చి ఉండవచ్చు. తిన్న తిండి ఒంటికి పట్టకపోవడం (మాల్‌ అబ్‌జార్‌ప్షన్‌) ఉన్న పిల్లల్లో నీళ్ల విరేచనాలు, పొట్ట ఉబ్బరంగా ఉండటం, ఎదుగుదల లోపాలు రావడం, కడుపునొప్పి ఎక్కువగా ఉండటం, దుర్వాసనతో కూడిన మలం, కొన్నిసార్లు ముఖం–కాళ్లూ చేతుల్లో వాపురావడం, కొన్ని విటమిన్‌ (ముఖ్యంగా ఎ, డి, ఈ, కె, బి12) లోపాలతో కనిపించే లక్షణాలు ఎక్కువగా చూస్తుంటాం. 

కొన్ని అరుదైన ఉదంతాల్లో కౌమార వయసులో (అడాలసెంట్‌) పిల్లల్లో కెఫిన్‌ పాళ్లు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకున్నప్పుడు లేదా చాలా ఎక్కువగా శారీరక శ్రమ చేసినప్పుడు, రుతుస్రావంలో మార్పుల (మెనుస్ట్రువల్‌ డిస్టర్బెన్సెస్‌)తో కూడా డయేరియా లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే మీ పాపకు ఉన్న రికరెంట్‌ డయేరియాకు కారణం చెప్పడానికి కూలంకషమైన పరీక్షలు, డిటెయిల్డ్‌ స్టూల్‌ ఇవాల్యుయేషన్, హార్మోన్స్, ఎంజైమ్స్‌ అండ్‌ ఇమ్యూనోగ్లోబ్యులిన్‌ ఎస్సేతో పాటు... అవసరమనిపిస్తే తప్పనిసరిగా కొలనోస్కోపీ, ఎండోస్కోపీ చేయించడం కూడా ముఖ్యం. ఇటువంటి పిల్లల్లో ఆహారంలో మార్పులు – అంటే ముఖ్యంగా వాళ్లకు ఏది సరిపడటం లేదో, లేదా ఏది తింటే సరిగా జీర్ణం కావడం లేదో గుర్తించి, ఆ ఆహారంలో మార్పులు చేయడంతో పాటు కొవ్వు పదార్థాలు, మసాలాలు తగ్గించడం వల్ల చాలావరకు మెరుగుదల కనిపిస్తుంది.

కొన్ని ఎంజైమ్‌ సప్లిమెంట్లు ఇవ్వడంతో పాటు వైటమిన్లు, జింక్‌ ఇవ్వడం, యాంటీమొటిలిటీ డ్రగ్స్‌ (పేగుల కదలికలను తగ్గించే మందులు), యాంటీ సెక్రిటరీ డ్రగ్స్‌ (జీర్ణవ్యవస్థలో ఊరే రసాయనాలను తగ్గించే మందులు), అబ్జార్బెంట్స్, ప్రోబయాటిక్స్‌ (శరీరంలో మేలు చేసే బ్యాక్టీరియాను పెంచే మందులు) ఇవ్వడం వల్ల పాపకు డయేరియా లక్షణాలు తగ్గుతాయి. అయితే ఇలా విరేచనాలు ఎక్కువగా అవుతున్నప్పుడు కారణం లేకుండా యాంటీబయాటిక్స్‌ వాడటం జరిగితే వ్యాధి తీవ్రత మరింత పెరగడానికి (యాంటీబయాటిక్‌ ఇండ్యూస్‌డ్‌ డయేరియాకు) దారితీయవచ్చు. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా ఒకసారి గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి మీ పాప సమస్యకు తగిన చికిత్స తీసుకోండి. 

ముర్రుపాలు,తల్లిపాలు, పోతపాలు –ప్రయోజనాలు
కొత్తగా తల్లి అయిన చాలామందిలో ఒక సందేహం ఉంటుంది. మొదట ఊరిన పాలు (ముర్రుపాలు) పట్టించాల్సిందేనని కొందరు, అవి బిడ్డకు మంచిది కాదని మరికొందరు అంటుంటారు. కానీ బిడ్డకు ముర్రుపాలు తప్పక తాగించాలి. బిడ్డ పుట్టిన తర్వాత తల్లిలో ఊరే ముర్రుపాలను కొలెస్ట్రమ్‌ అంటారు. ఈ ముర్రుపాలలో చాలా శక్తిమంతమైన యాంటీబాడీస్‌ ఉంటాయి. అవి బిడ్డలోని రోగనిరోధకశక్తిని స్వాభావికంగా పెంచుతాయి. ఆ నేచురల్‌ ఇమ్యూనిటీ వల్ల  జీవితకాలంలో బిడ్డ ఎన్నో ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని సమకూర్చుకుంటుంది. అంతేకాదు... వయసు పెరిగాక కనిపించే ఎన్నో జబ్బులు... ఈ ముర్రుపాల కారణంగా రాకపోవచ్చు లేదా చాలా ఆలస్యం రావచ్చు.

అందుకే బిడ్డకు ముర్రుపాలు తప్పక పట్టించాలి. ఇక ఆ తర్వాత కూడా పిల్లలకు సాధ్యమైనంతవరకు తల్లిపాలే ఇవ్వాలి. కేవలం తల్లికి తగినన్ని పాలు పడనప్పుడు మాత్రమే పోతపాలకు వెళ్లాలి తప్ప... ఒకవేళ తల్లి దగ్గర పుష్కలంగా పాలు ఉంటే పిల్లలకు కడుపు నిండా తల్లిపాలు తాగించడం మంచిది. దీనివల్ల బిడ్డలకు ఎన్నో లాభాలు చేకూరుతాయి. బిడ్డల్లో రోగనిరోధక శక్తి పెరగడం, వాళ్లు పెద్దయ్యాక వచ్చే అనేక డీజనరేటివ్‌ డిసీజెస్‌ ఆలస్యం కావడం వంటి ప్రయోజనాలు తల్లిపాల వల్ల సమకూరుతాయి. 

మరి పోతపాలు వాడవచ్చా? 
ఇటీవలి కొన్ని నిరూపితమైన అధ్యయనాల ప్రకారం... పోతపాల (యానిమల్‌ మిల్క్‌)పై పెరిగే పిల్లల్లో కడుపునొప్పి వంటి ఉదరసంబంధమైన సమస్యలు, ఆస్తమా వంటి అలర్జిక్‌ వ్యాధులు ఎక్కువగా వస్తాయని తేలింది. పిల్లల్లో చెవి ఇన్ఫెక్షన్లు, స్థూలకాయం వంటి అనేక సమస్యలకు కూడా పోతపాలు ఒక ప్రధాన కారణమని కూడా తెలుస్తోంది. పైగా ఇటీవల పశువుల్లో పాల ఉత్పత్తి పెంచడానికి అనేక హార్మోన్లు, మందులు, యాంటీబయాటిక్స్‌ ఉపయోస్తున్నారు. కాబట్టి ఇలాంటి పాలపై పెరిగిన పిల్లల్లో వాళ్ల దీర్ఘకాలిక ఆరోగ్యంపై ఆ రసాయనాల దుష్ప్రభావం కనిపిస్తోంది. కాబట్టి పోతపాలు వాడటం సరికాదు.  ఒకవేళ తల్లికి తగినన్ని పాలు పడకపోవడం లేదా బిడ్డకు పాలుసరిపడకపోవడం వంటి పరిస్థితుల్లో (అంటే లాక్టోజెన్‌ ఇన్‌టాలరెన్స్, ప్రోటీన్‌ ఇన్‌టాలరెన్స్‌ వంటి సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే).

మార్కెట్‌లో దొరికే కొన్ని ఫార్ములా ఫీడ్స్‌ ఉపయోగించవచ్చు. కానీ తల్లి వద్ద సరిపడా పాలు లేనప్పుడు పోత పాలు లేదా ఆవు లేదా గేదె పాలు పట్టించడం కంటే తల్లిలోనే పాలు పెరిగేలా కొన్ని స్వాభావిక విధానాలు (ప్రోటీన్‌లు పుష్కలంగా ఉండే పుష్టికరమైన ఆహారం ఇవ్వడం వంటివి) అనుసరించడం మంచిది. అలా చేయడం వల్ల కూడా తల్లిలో పాలు పడకపోతే అప్పుడు మాత్రమే డాక్టర్‌ సలహామేరకు తల్లిలో పాలు పెరిగేందుకు కొన్ని మందులు ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకే... ముర్రుపాలు తప్పనిసరి. తల్లిపాలు కంపల్సరీ. తల్లి దగ్గర తగినన్ని పాలు లేనప్పుడు మాత్రమే పోతపాలు. 

పాపకు నోట్లో పుండ్లు... తగ్గేదెలా?

మా పాప వయసు ఏడేళ్లు.ఈమధ్య ఒకసారి గొంతులో నొప్పి ఉందని చెప్పింది.  వెంటనే డాక్టర్‌కు చూపించాం. పాప నోట్లో, నాలుక మీద, గొంతులోపలా  పుండ్లలాగా  వచ్చాయి. గొంతులో ఇన్ఫెక్షన్‌లా కొంచెం పుండులాగా ఎర్రబారింది. ఏదైనా తినడానికి పెడితే గొంతులో నొప్పి అంటూ ఏడుస్తోంది. ఏమీ తినలేకపోతోంది. మా పాప సమస్యకు పరిష్కారం చూపండి. 

మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు పదే పదే నోటిలో పుండ్లు (మౌత్‌ అల్సర్స్‌) వస్తున్నాయని తెలుస్తోంది.ఈ సమస్యను చాలా సాధారణంగా చూస్తుంటాం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు... ఉద్వేగాలపరమైన ఒత్తిడి బాగా నీరసంగా అయిపోవడం ∙విటమిన్‌లు, పోషకాల లోపం... (ఇందులోనూ విటమిన్‌ బి12, ఐరన్, ఫోలిక్‌ యాసిడ్, జింక్‌ల వంటి పోషకాలు లోపించడం) వైరల్‌ ఇన్ఫెక్షన్‌లు (ముఖ్యంగా హెర్పిస్‌ వంటివి) గాయాలు కావడం (బ్రషింగ్‌లో గాయాలు, బాగా ఘాటైన పేస్టులు, కొన్ని ఆహారపదార్థాల వల్ల అయ్యే గాయాల కారణంగా).

 పేగుకు సంబంధించిన సమస్యలు, రక్తంలో మార్పులు, గ్లూటిన్‌ అనే పదార్థం పడకపోవడం, తరచూ జ్వరాలు రావడం... వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యల వల్ల పిల్లలకు తరచూ నోటిలో పుండ్లు వస్తుంటాయి. లెటర్‌లో చెప్పిన కొద్ది పాటి వివరాలతో నిర్దిష్టంగా ఇదీ కారణం అని చెప్పలేకపోయినా... మీ పాపకు  విటమిన్‌ల వంటి పోషకాల లోపం లేదా తరచూ వచ్చే ఇన్ఫెక్షన్స్‌తో ఈ సమస్య వస్తున్నట్లు విశ్లేషించవచ్చు. ఇలాంటి పిల్లలకు నోటిలో బాధ తెలియకుండా ఉండేందుకు పైపూతగా  వాడే మందులు, యాంటిసెప్టిక్‌ మౌత్‌ వాష్‌లు, విటమిన్‌ సప్లిమెంట్స్‌ వాడాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో చాలా అరుదుగా స్టెరాయిడ్‌ క్రీమ్స్‌ వాడటం వల్ల ప్రయోజనం  ఉంటుంది. మీరు మరోసారి మీ పిల్లల వైద్య నిపుణుడినిగానీ లేదా దంత వైద్య నిపుణుడినిగానీ సంప్రదించి వారి ఆధ్వర్యంలో తగిన చికిత్స తీసుకోండి. 

డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్‌ పీడియాట్రీషియన్,రోహన్‌ హాస్పిటల్స్, 
విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌

  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top