You Tube స్టార్స్! | You Tube Stars! | Sakshi
Sakshi News home page

You Tube స్టార్స్!

Feb 19 2014 11:22 PM | Updated on Sep 2 2017 3:52 AM

యూట్యూబ్... ఎవరికీ పరిచయం అక్కర్లేని వెబ్‌సైట్. వర్ణిస్తూ చెప్పాలంటే అదొక వినోద సామ్రాజ్యం. అంతులేని విహారం చేయవచ్చు. ఎన్నో వీడియోలను చూడవచ్చు.

యూట్యూబ్... ఎవరికీ పరిచయం అక్కర్లేని వెబ్‌సైట్. వర్ణిస్తూ చెప్పాలంటే అదొక వినోద సామ్రాజ్యం. అంతులేని విహారం చేయవచ్చు. ఎన్నో వీడియోలను చూడవచ్చు. సినిమాలు , క్రికెట్, పాటలు, ఫైట్లు, కామెడీ, ఫన్, రియాలిటీ, షార్ట్‌ఫిలిమ్స్... ఇలా ఎన్నో రకాల వీడియోలు అందుబాటులో ఉంటాయి. అలాంటి యూట్యూబ్‌లో సర్ఫింగ్ చేయడం ఎవరికైనా ఇష్టమే. మరి వినోదం కోసం యూట్యూబ్‌ను చూడటం మనమందరం చేసే పనే.. కానీ కొంతమంది యువతీ, యువకులు యూట్యూబ్‌ను తమ ఉన్నతికి ఉపయోగించుకొంటున్నారు. అలాంటి వారిలో కొంతమంది ప్రయత్నాలు సూపర్‌హిట్ అయ్యాయి. వారికి గొప్ప గుర్తింపును సంపాదించిపెట్టాయి. యూట్యూబ్‌స్టార్లను చేసి పెట్టాయి. వారి ప్రతిభ, ప్రయత్నంలోని చిత్తశుద్ధి గురించి తెలుసుకొని తీరాల్సిందే!
 
 జెన్నా ఎన్ మౌరే...


యూట్యూబ్ అకౌంట్‌తో ఒక సాధారణ అమ్మాయి సెలబ్రిటీగా మారిపోవచ్చని నిరూపించింది జెన్నా. యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేసిన మూడున్నర నిమిషాల వీడియో జెన్నా గతిని మార్చేసింది. "How To Trick People Into Thinking You're Good Looking"  పేరుతో జెన్నా అప్‌లోడ్ చేసిన వీడియో బీభత్సమైన స్థాయిలో వీక్షకాదరణ పొందింది. కాలేజీ స్టూడెంట్ అయిన జెన్నా అప్‌లోడ్ చేసిన ఆ వీడియోను తొలి వారంలోనే 53 లక్షల మంది  వీక్షించారు. స్టార్‌హీరోల సినిమాల టీజర్‌లకు సమాన స్థాయిలో ఆదరణ పొందింది జెన్నా వీడియో. ఇప్పటి వరకూ ఈ వీడియోను దాదాపు నాలుగుకోట్ల మంది వీక్షించారు. దీంతో  జెన్నా మార్బల్స్ పేరుతో ఆమె మొదలెట్టిన యూట్యూబ్ చానల్ కు ఎంతోపేరు వచ్చింది. అమెరికాకు చెందిన తను ఇప్పుడు యూట్యూబ్ పర్సనాలిటీగా, ఎంటర్‌టెయినర్‌గా గుర్తింపు సంపాదించుకొంది. సెలబ్రిటీగా మారిపోయింది.
 
 రే విలియమ్ జాన్సన్...


 ఎన్నో యేళ్ల కష్టం తర్వాత అదృష్టం, అవకాశం కలిసి వచ్చి ఓవర్‌నైట్ స్టార్‌లు అయినవారుండొచ్చు. అయితే కొన్ని గంటల పాటు కష్టపడి కొన్ని నిమిషాల నిడివి ఉండే వీడియోతో వండర్‌గా మారిన వాడు రే విలియమ్ జాన్సన్. ఈ అమెరికన్  వీడియో బ్లాగర్, Equals Three అనే వీడియోతో పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం రే యూట్యూబ్ చానల్‌కు కోటి మందికి పైగా సబ్‌స్క్రైబర్లున్నారు. వారందరినీ అలరించే వీడియోలను రూపొందించడమే ఇప్పుడు రే పని.
 
 నటాలీ ట్రాన్:  


 యూట్యూబ్ మొదలైన కొత్తలోనే నటాలియా ఆ సైట్‌లో ఒక చానల్‌ను ప్రారంభించింది. సొంతంగా స్కిట్స్ రాసి, అభినయించగలిగిన తన టాలెంట్‌ను అక్కడ ప్రదర్శించసాగింది. నిమిషాల వ్యవధిలో సాగే ఆ వీడియోలకు లక్షలాది మంది ఫ్యాన్స్ గా మారారు. ప్రస్తుతం ఈ ఆస్ట్రేలియన్ యూట్యూబ్ చానల్‌కు కోటిన్నర మంది సబ్‌స్క్రైబర్లున్నారు.
 
 జాక్ అండ్ ఫిన్....


 యువతీ యువకులను లక్ష్యంగా చేసుకొని కొత్త థియరీలను, నయా వేదాంతాలను చెబుతూ వీడియోలను రూపొందించడమే దక్షిణాఫ్రికాకు చెందిన ఈ కవల సోదరుల వృత్తి, ప్రవృత్తి. రూపానికి ఒకేలా ఉన్న ఈ కవల సోదరులు జంటగా చేసిన యూట్యూబ్ చానల్ ప్రయత్నం సూపర్‌సక్సెస్ అయ్యింది. వీళ్ల చానల్‌కు 40 లక్షల మంది సబ్‌స్క్రైబర్లున్నారు.  
 
 వీళ్లకేం వస్తుంది..?!


 యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేసి వీళ్లు సాధించేదేముంది? అంటే... పేరు, పాపులారిటీనే కాక డబ్బును కూడా ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఒరిజినల్ లేదా మీకు హక్కులున్న కంటెంట్‌ను యూట్యూబ్ లోకి అప్‌లోడ్ చేయడం ద్వారా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది. యూట్యూబ్ చానల్‌ను మొదలుపెట్టి అందులోకి వీడియోలు అప్‌లోడ్ చేస్తూ ఉంటే.. మీ వీడియోల ప్రారంభంలో ప్లే అయ్యే వ్యాపార ప్రకటనలను బట్టి డబ్బు వస్తుంది. ఈ అడ్వర్టైజ్‌మెంట్ వ్యవహారాలు ‘గూగుల్ యాడ్‌సెన్స్’ అకౌంట్‌తో ముడిపడి ఉంటాయి. వీక్షకుల సంఖ్యను బట్టి యాడ్‌రెవెన్యూ వచ్చి చేరుతూ ఉంటుంది. ఈ ఆదాయం దేశదేశానికీ మారుతూ ఉంటుంది. ఈ లెక్కన కోట్లాది మంది వీక్షకులను కలిగిన వీరు మిలియనీర్లుగా మారి అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని చెప్పవచ్చు.
 
అవకాశాలు వాటంతట అవే రావు. అదృష్టం కొద్దీ కలిసి రావు. వివిధ మార్గాల్లోని అవకాశాలను ఒడిసిపట్టుకోవడంలోనే ఎవరి ప్రతిభ అయినా దాగి ఉంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement