స్త్రీలోక సంచారం

Womens empowerment:Mallika Sherawat seeks advice from lawyers to prep for Indian adaptation of The Good Wife - Sakshi

కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కె.చంద్రశేఖరరావు మహిళల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి దనసరి అనసూయ (సీతక్క), తెలంగాణ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారద ఆరోపించారు. రాష్ట్రంలో స్త్రీ సంక్షేమ శాఖ క్రియాశీలకంగా లేకపోవడంతో యాదాద్రి వంటి చోట్ల వ్యభిచారం వర్ధిల్లుతోందని, ఇలాంటి వాటిని కట్టడి చేసేందుకు కేసీఆర్‌ తన మంత్రి వర్గంలోకి తక్షణం ఒక మహిళను తీసుకుని, ఆమెకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖను అప్పగించాలని వీరు డిమాండ్‌ చేశారు.

► బ్రెజిల్‌లోని రియోలో 2016లో జరిగిన ఒలింపిక్స్‌లో హిజాబ్‌ ధరించి పాల్గొన్న తొలి ముస్లిం–అమెరికన్‌ అథ్లెట్‌ ఇబ్తిహాజ్‌ ముహమ్మద్‌ను పోలిన కొత్త బార్బీ మార్కెట్‌లోకి వచ్చింది. ‘బాలికలు ఇప్పుడు హిజాబ్‌ ధరించిన బార్బీ బొమ్మతో ఆడుకోవచ్చు’ అని అంటూ, ఇది తన చిన్ననాటి కల అని 32 ఏళ్ల ఈ ఫెన్సింగ్‌ చాంపియన్‌ ట్వీట్‌ చేశారు.

►లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ, పదిలక్షల డాలర్ల పూచీకత్తుపై బెయిలు మీద తిరుగుతున్న హాలీవుడ్‌ దిగ్గజం హార్వీ వైన్‌స్టీన్‌ కేసు సెప్టెంబరు 10కి వాయిదా పడింది. వైన్‌స్టీన్‌ ఎవర్నీ బలవంత పెట్టలేదనీ, ఆయన తమపై అత్యాచారం జరిపారని ఆరోపిస్తున్న మహిళలు వైన్‌స్టీన్‌కు రాసిన ప్రేమలేఖల్ని బట్టి వారి మధ్య జరిగినది సమ్మతితో కూడిన కలయికే తప్ప లైంగిక దాడి కాదని వైన్‌స్టీన్‌ తరఫు న్యాయవాది.. ఆ ప్రేమలేఖల్ని కోర్టుకు సమర్పిస్తూ.. అతడిపై ఉన్న అన్ని కేసుల్ని కొట్టివేయాలని వాదించారు.

​​​​​​​►అమెరికన్‌ సింగర్‌ జెన్నిఫర్‌ లోపెజ్‌ ధరించిన డెనిమ్‌ బూట్స్‌.. నలుగురి నోళ్లలో నానుతున్నాయి. ప్యాంట్, కాలి బూట్లు కలగలిసి ఉన్న ఈ డ్రెస్‌ ఆమె నడుముకింది నుంచి దిగి, మోకాళ్ల పైభాగం కనిపించేలా ఉండటంతో.. ‘జెన్నిఫర్‌ బాత్రూమ్‌కి వెళ్లి ప్యాంటు పైకి లాక్కోవడం మర్చిపోయి గానీ బయటికి రాలేదు కదా’ అనే నెగటివ్‌ కామెంట్లే ఈ డ్రెస్‌పై ఎక్కువగా వస్తున్నాయి. 

​​​​​​​► 2009 నుంచి 2016 వరకు 7 సీజన్లుగా, 156 ఎపిసోడ్‌లుగా సి.బి.ఎస్‌. (కొలంబియా బ్రాడ్‌కాస్టింగ్‌ సిస్టం) చానల్‌లో ప్రసారం అయి అత్యంత వీక్షకాదరణ పొందిన అమెరికన్‌ లీగల్, పొలిటికల్‌ డ్రామా ‘ది గుడ్‌ వైఫ్‌’ను బాలీవుడ్‌ నటి మల్లికా శెరావత్‌ భారతదేశానికి తెచ్చేస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రను పోషించడంతో పాటు, నిర్మాణ భాగస్వామ్యానికి కూడా చొరవ చూపుతున్న శెరావత్‌ ప్రస్తుతం ఆ పనిలో భాగంగా ముంబైలోని న్యాయ నిపుణులను కలిసి భార్యాభర్తల న్యాయవివాదాలలోని మలుపుతీర్పులను (ల్యాండ్‌మార్క్‌ జడ్జిమెంట్స్‌) అధ్యయనం చేస్తున్నారు. 

​​​​​​​► స్టీవ్‌ జాబ్స్‌ కూతురు లిసా బ్రెనన్‌ కొత్త పుస్తకం ‘స్మాల్‌ ఫ్రై’ (అప్రాముఖ్యాలు) లో..  క్యాన్సర్‌తో చనిపోతున్న చివరి రోజులలో ఆమె తన తండ్రి పక్కన  కూర్చున్నప్పుడు ‘నీ దగ్గర టాయ్‌లెట్‌ కంపు కొడుతోంది’ అని అన్నారని లిసా రాసిన జ్ఞాపకాలలోని కొంత భాగాన్ని ప్రచురణకర్తలు విడుదల చేశారు. ఆపిల్‌ కంపెనీని ప్రారంభించిన తొలి సంవత్సరాలలో న్యాయపరమైన వివాదాల కారణంగా లిసాను తన కూతురిగా అంగీకరించని స్టీవ్స్, ఆ తర్వాత ఆమె తన కూతురే అని ఒప్పుకున్నప్పటికీ చనిపోయేనాటి వరకు ఆమెను ద్వేషిస్తూనే ఉన్నారని, నిజానికి ఆయన ‘టాయ్‌లెట్‌ కంపు కొడుతోంది’ అన్న రోజు లీసా.. గులాబీల అత్తరును ఒంటి మీద స్ప్రే చేసుకుని ఉన్నారని ‘స్మాల్‌ ఫ్రై’లోంచి వెల్లడయిన  ముఖ్యాంశాలను బట్టి తెలుస్తోంది. 

​​​​​​​► లైటెనింగ్‌ లేజర్‌ ట్రీట్‌మెంట్‌తో పెదవులు మెరిపించుకోవడం ఇప్పుడు నగరాల్లో ట్రెండ్‌గా మారింది. పుట్టుకతోనో, పొగతాగడం వల్లనో నల్లగా ఉన్న పెదవులపై నలుపు రంగును తగ్గించే ఈ ట్రీట్‌మెంట్‌ను ఎక్కువగా 25–35 మధ్య వయసున్న యువతులు చేయించుకుంటుండగా, దీని వల్ల ఆశించిన ఫలితం ఉన్నా లేకున్నా.. హాని మాత్రం లేకుండా ఉండదని గట్టిగా చెప్పలేమని వైద్య నిపుణులు అంటున్నారు.             

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top