స్త్రీలోక సంచారం

Womens empowerment: Aishwarya Rai Bachchan - Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

వేరొకరి భార్యతో శారీరక సంబంధం (అడల్టరీ) పెట్టుకున్న పురుషుడిని శిక్షించే భారతీయ శిక్షాస్మృతిలోని 497 సెక్షన్‌ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో కొన్నాళ్లుగా వాదోపవాదాలు సాగుతున్న క్రమంలో.. పిటిషనర్‌ వాదనకు అనుకూలంగా బుధవారం నాడు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కీలకమైన అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘అడల్టరీ’లో స్త్రీ, పురుషులిద్దరి ప్రమేయం, చొరవ ఉన్నప్పుడు కేవలం పురుషుడిని మాత్రమే శిక్షార్హం చేస్తున్న ఈ సెక్షన్‌.. స్త్రీ పురుషులిద్దరూ సమానమేనని చెబుతున్న రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14కి విరుద్ధమైనది కనుక.. స్త్రీని కూడా శిక్షించడం కాకుండా, ఏకంగా సెక్షన్‌నే రద్దు చేయాలన్న (డీక్రిమినలైజ్‌) పిటిషనర్‌ అభ్యర్థనలోని సమంజసత్వానికి సుప్రీంకోర్టు ఏకీభవించిందన్న భావన కలిగించే విధంగా పై అభిప్రాయం ఉండడంతో మున్ముందు జరిగే మరికొన్ని వాదోపవాదాల అనంతరం పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
హైదరాబాద్‌లోని తల్లీబిడ్డల ప్రభుత్వ ఆసుపత్రి ‘నీలోఫర్‌’లో గత నాలుగేళ్లుగా నర్సుల నియామకం లేకపోవడంతో.. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మూడు షిఫ్టులకు కలిపి 600 మంది నర్సులు కావలసి ఉండగా, కేవలం 147 మందితో మాత్రమే అతికష్టం మీద సేవలు అందించగలుగుతున్నారు! ఈ విషయాన్ని ఆసుపత్రి అధికారులు  ఆరోగ్యశాఖ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని, ప్రస్తుతం ఆసుపత్రిలో స్టాఫ్‌ నర్సుల ఖాళీలు 249 ఉన్నాయని తెలుస్తోంది.

ముజఫర్‌పూర్‌లోని ప్రభుత్వ వసతి గృహంలో మైనర్‌ బాలికలపై జరిగిన దారుణమైన లైంగిక అకృత్యాలపై శీఘ్ర విచారణకు ‘ఫాస్ట్‌ ట్రాక్‌’ కోర్టులను నెలకొల్పాలని బిహార్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, కేంద్ర న్యాయశాఖకు లేఖలు రాయడంతో నితీష్‌కుమార్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ముజఫర్‌పూర్‌లో బయటపడిన ఈ అమానుష లైంగిక అఘాయిత్యాలు ఒకవైపు పార్లమెంటును కుదిపివేస్తుండగనే, బుధవారం నాడు పాట్నాలోని సాహూ రోడ్డులో ఉన్న ‘స్వాధార్‌ గృహ్‌’లో పదకొండు మంది మహిళలు, నలుగురు బాలికలు అదృశ్యం కావడం దేశాన్ని మరోమారు దిగ్భ్రాంతికి గురి చేసింది.

నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, ఎం.బి.బి.ఎస్‌. చేయాలన్న ధ్యేయంతో, కూలినాలితో పాటు చేపలు కూడా అమ్ముకుంటూ చక్కగా చదువుకుంటోందని ప్రముఖ దిన పత్రికలో తనపై వచ్చిన ఒక స్ఫూర్తి కథనంతో ఒక్కసారిగా ప్రసిద్ధురాలై, ఆ కారణంగా సోషల్‌ మీడియాలో అసూయద్వేషాల అడ్డూ ఆపూ లేని ‘ట్రోలింగ్‌’లకు, అకారణ బెదరింపులకు గురవుతున్న కేరళలోని తోడిపుళ కళాశాల బియ్యస్సీ మూడో సంవత్సరం విద్యార్థిని హనన్‌ హమీద్‌కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రతిపక్ష నేత రమేశ్‌ చెన్నతల నుంచి భరోసా లభించింది. ‘నువ్వు కేరళ ప్రభుత్వం కుమార్తెవు. నీకేం భయం లేదు’ అని ముఖ్యమంత్రి తనకు ధైర్యం ఇచ్చినట్లు ఆయన్ని కలిసి వచ్చాక హమీద్‌ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో చెప్పారు.

ఎమోజీలలో పోల్కో చుక్కలతో రెండు ముక్కలుగా కనిపించే స్త్రీల బికినీని మరింత మర్యాదపూర్వకమైన వ్యక్తీకరణతో నిండుగా రూపొందించాలని ‘ఎమోజినేషన్‌’ సంస్థ భావిస్తోంది. ఇప్పటికే అందాల పోటీలలో స్విమ్‌సూట్‌ రౌండ్‌లను రద్దు చేయాలన్న ప్రతిపాదనలు, స్త్రీల శరీరాకృతుల విషయంలో మగవాళ్ల ఆలోచనలను సంస్కారవంతం చేయాలన్న సూచనలు వస్తున్న క్రమంలో ఎమోజీలలో కూడా ఈ విధమైన సంస్కరణలు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

బహిరంగ ప్రదేశాలలో కళ్లు మాత్రమే కనిపించేలా ముఖాన్ని చుట్టేస్తూ బుర్ఖాను ధరిస్తే 156 డాలర్ల వరకు (సుమారు 11 వేల రూపాయలు) జరిమానా విధించే కొత్త చట్టం డెన్మార్క్‌లో బుధవారం నుంచి అమల్లోకి వచ్చీ రావడంతోనే.. ఇది ముస్లిం మహిళల హక్కును హరించడమేనని, ఈ చట్టాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని మానవ హక్కుల సంఘాలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు చేపట్టాయి. అయితే డెన్మార్క్‌కు వలస వచ్చిన, వస్తున్న ముస్లిములను సైతం ఇక్కడి సమాజంలో కలుపుకుని పోయేందుకు మాత్రమే చేసిన ఈ చట్టాన్ని సహృదయంతో అర్థం చేసుకోవాలని డెన్మార్క్‌ ప్రభుత్వం కోరుతోంది.

బ్రిటన్‌లోని ఇస్లామిక్‌ వివాహ సంప్రదాయాలు కూడా బ్రిటన్‌ వివాహ చట్టానికి లోబడే ఉంటాయని స్పష్టం చేస్తూ, భర్త నుండి విడాకులు కోరుతున్న ఒక ముస్లిం మహిళకు అనుకూలంగా యు.కె. హైకోర్టు తీర్పు చెప్పింది. పాకిస్తాన్‌ సంతతికి చెందిన నస్రీన్‌ అఖ్తర్, షాబాజ్‌ ఖాన్‌ ఇరవై ఏళ్ల క్రితం వెస్ట్‌ లండన్‌లోని ఒక రెస్టారెంట్‌లో ముస్లిం సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకోగా, ప్రస్తుతం భార్య కోరిక ప్రకారం ఆమెకు విడాకులు ఇచ్చిందుకు నిరాకరిస్తూ.. ‘మన పెళ్లి బ్రిటన్‌ చట్ట ప్రకారం జరగలేదు కాబట్టి విడాకులకు నేను అంగీకరించను’ అని భర్త చెప్పడంతో కోర్టుకు వెళ్లిన భార్యకు.. ఆమె ఆశించిన విధంగా పై తీర్పు లభించింది.

2000 సం.లో వచ్చిన డచ్చి (నెదర్లాండ్స్‌) చిత్రం ‘ఎవ్రీబడీ ఈజ్‌ ఫేమస్‌’ అధారంగా రూపొంది, ఇవాళ రిలీజ్‌ అవుతున్న బాలీవుడ్‌ మూవీ ‘ఫన్నీఖాన్‌’లో.. రాజ్‌కుమార్‌రావ్‌ని ప్రేమిస్తున్న ఓ అందమైన గాయని పాత్రలో ఐశ్వర్యారాయ్‌ నటిస్తున్నారు. సినిమాల్లో పీక్‌లో ఉండగా, పెళ్లి చేసుకుని, తల్లి అయ్యాక మళ్లీ దీర్ఘకాల విరామం తీసుకుని, ఆ తర్వాత మళ్లీ కూతురు ఆరాధ్య ఆలన పాలన కోసం అంటూ ఇంట్లోనే ఉండిపోయిన ఐశ్వర్య ఈ చిత్రంలో ఆమె అభిమానులు ఊహించిన దానికి భిన్నంగా మరింత చలాకీగా కనిపించబోతున్నారని చిత్ర నిర్మాతలు చెప్పడానికైతే చెబుతున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top