కళ అంటే కాసుల్ని మాత్రమే కాదు కలల్ని ఒడిసిపట్టేది కూడా. సినిమా అంటే వ్యాపారం కావచ్చు కానీ వ్యాపారం మాత్రమే కారాదు. దీన్ని గుర్తించిన సినీ రూపకర్తలకు డబ్బులకు మించిన ఆత్మసంతృప్తిని ఆనందాన్ని కొన్ని సినిమాలు అరుదుగానైనా అందిస్తాయి. బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ అండ్ టీమ్ ఇప్పుడు అచ్చంగా అలాంటి ఆనందాన్నే అనుభవిస్తున్నారు. అవును . ప్రస్తుతం మహిళా క్రికెట్ విజయ విహారంలో ఊగిపోతున్న భారతావని సంబరంలో సగర్వంగా పాలు పంచుకోవడానికి వారికి సరైన కారణం ఉంది మరి.
అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan), సయామి ఖేర్ నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘ఘూమర్’(Ghoomer Movie) ఈ నవంబర్ 7న తిరిగి థియేటర్లలోకి రానుంది. మాములూగా అయితే ఇది కేవలం ఓ సినిమా రీ రిలీజ్ మాత్రమే. కానీ భారత మహిళా క్రికెట్ జట్టు తొలి ఐసిసి ప్రపంచ కప్ దక్కించుకున్న సందర్భంలో ఈ విజయానికి ఈ సినిమా ఓ కళాత్మక అభినందన కూడా. ఈ విషయాన్ని సినిమా టీమ్ సగర్వంగా ప్రకటించింది.
గత బుధవారం ప్రొడక్షన్ బ్యానర్ హోప్ ప్రొడక్షన్ ్స తమ ఇన్ స్ట్రాగామ్‌లో టీమ్ ఇండియా విజయం సాధించిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని అభినందన సందేశాన్ని అందిస్తూ ఒక నోట్ రాసింది. ‘‘ అభిరుచి, పట్టుదల నమ్మకపు శక్తి.ఘూమర్ రిటర్న్స్ తో భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజేతలకు అభినందనలు అందిస్తున్నాం’’ అని అభిషేక్ సయామి నటించిన చిత్రం పోస్టర్‌తో పాటు పంచుకుంది.
గత 2023లో విడుదలైన సినిమా ఘూమర్. తన అంతర్జాతీయ అరంగేట్రానికి ముందు ప్రమాదంలో కుడి చేయి కోల్పోయిన ఔత్సాహిక క్రికెటర్ అనినా (సయామి)అనే మహిళా క్రికెటర్ పోరాటం చుట్టూ తిరుగుతుంది. వృత్తి పరంగా అవమానానికి గురైన మాజీ క్రికెటర్ పాడీ (అభిషేక్) ఆమెకు ఎడమచేతి వాటం బౌలర్‌గా మారడానికి శిక్షణ ఇస్తాడు, ఆమె భారత మహిళా క్రికెట్ జట్టులోకి తిరిగి రావడానికి సహాయపడటానికి ’ఘూమర్’ అనే కొత్త బౌలింగ్ టెక్నిక్‌ను కనిపెట్టడం ద్వారా ఆమెకు కొత్త ఆశను కలలను ఆయన అందిస్తాడు. ఈ చిత్రం హంగేరియన్ షూటర్ కరోలీ టకాక్స్ జీవిత కథ నుంచి ప్రేరణ పొందింది, ఆయన తన కుడి చేతికి తీవ్రంగా గాయమైన తర్వాత కూడా పట్టుదల సడలకుండా తన ఎడమ చేతితో రెండు ఒలింపిక్ బంగారు పతకాలను గెలుచుకున్నాడు.
ఈ సందర్భంగా దర్శకుడు ఆర్. బాల్కి తమ చిత్రం తిరిగి విడుదల కావడం పట్ల తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. ‘ఘూమర్ మహిళల క్రికెట్ కు మహిళా క్రికెటర్ల స్థితిస్థాపకతకు ఒక పురస్కారం. ఘూమర్‌ను చిత్రీకరించిన అదే స్టేడియంలోనే వారు ఘన విజయాన్ని సాధించారు’’ అని బాల్కీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విజయాలను కీర్తించేవారు ఎందరో. కానీ స్ఫూర్తిని అందించే వారు కొందరే. అలాంటివారికి ఆ విజయాలు ఎప్పుడూ రుణపడి ఉంటాయి. వ్యాపార లెక్కలకు అతీతంగా ఇలాంటి స్ఫూర్దిదాయక సినిమాలు మరిన్ని రావాలని ఆశిద్ధాం.


