అమ్మ కల

Waseema Shaikh Got Good Rank In MPSC From Nanded - Sakshi

స్ఫూర్తిమంతం

ముంబయి, మలాడ్‌లోని ఆటో డ్రైవర్‌ జయకుమార్‌ కూతురు ప్రేమా జయకుమార్‌ సీఏలో టాపర్‌. కేరళలోని మరో వ్యవసాయ కూలీ కుమార్తె సివిల్స్‌ లో వందలోపు ర్యాంకు సాధించింది... ఇలా ఎన్నో విజయాలను పేదింటి ఆడపిల్లలు సొంతం చేసుకున్నారు. వాసిమా షేక్‌ విజయం కూడా అలాంటిదే. కానీ ఇంకా వైవిధ్యమైంది. మరికొంత అందమైనది కూడా. ఆమె పుస్తకాలు కొనుక్కోడానికి డబ్బు కోసం వాళ్లన్న ఇమ్రాన్‌ చదువు మానేసి ఆటో నడిపాడు. వాసిమ్‌ ఎమ్‌పీఎస్‌సీ (మహారాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌)లో మంచి ర్యాంకు సాధించింది. తాను ఉద్యోగంలో చేరి వాళ్లన్నను చదివిస్తోంది.

కూతురి విజయం
వాసిమా షేక్‌ సొంతూరు మహారాష్ట్ర, నాందేడ్‌ జిల్లా, జోషి సంఘ్వి. వాసిమా తల్లి వ్యవసాయ కూలీ. తండ్రి మానసిక వ్యాధిగ్రస్తుడు. కుటుంబంలో మొత్తం ఎనిమిది మంది. పని చేసేది మాత్రం ఇద్దరే. వాసిమా తల్లి పొలంలో పని చేస్తే, అన్న ఆటో నడిపేవాడు. వాసిమా చూసిన సమాజంలో మగవాళ్లు మద్యం తాగి ఇంటికి వచ్చి ఆడవాళ్ల మీద చెయ్యి చేసుకోవడం, నిరక్షరాస్యత, ఆడపిల్లలకు బాల్య వివాహాలు, ఆర్థిక ఇబ్బందులు సర్వసాధారణం. ఆడపిల్లకు చదువు చెప్పించడం అంటే డబ్బు దండగ పని అనీ, పెళ్లి చేసి పంపించేస్తే ఒక పని అయిపోతుందనే అభిప్రాయం బలంగా వేళ్లూనుకుని పోయిన సమాజంలో ఒక విప్లవ వీచిక వాసిమా తల్లి. ఆమెకు అప్పట్లోనే బాగా చదువుకుని గవర్నమెంట్‌ ఉద్యోగంలో చేరాలని ఉండేది. ఆమె కల నిజం కాలేకపోయింది. నాలుగో తరగతితో చదువాపేయాల్సి వచ్చింది.

కలల రెక్కలను విరిచి బాల్య వివాహంతో అత్తింట్లో అడుగుపెట్టింది. తన పిల్లలను బాగా చదివించి ప్రభుత్వ ఉద్యోగులను చేయాలని గట్టిగా నిర్ణయించుకుందామె. వాసిమా టెన్త్‌ క్లాస్‌లో ‘లోహా’తాలూకాతో ఫస్ట్‌ వచ్చింది. వాసిమా తల్లి కలలు మళ్లీ రెక్కలు విచ్చుకున్నాయి. వాసిమా చదువును కూడా హరించి వేయడానికి బంధువులు రాబందుల్లా పొడుచుకు తింటుంటే వాళ్లను ఖాతరు చేయడం మానేసిందామె. జూనియర్‌ కాలేజ్‌ కోసం ఉస్మాన్‌ నగర్‌కు కాలి నడకన వెళ్లింది వాసిమా. ఆ తర్వాత ‘యశ్వంత్‌ రావ్‌ చవాన్‌ మహారాష్ట్ర ఓపెన్‌యూనివర్సిటీ’ నుంచి  2015లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. ఎమ్‌పీఎస్‌సీ పరీక్షలకు తనను తాను సిద్ధం చేసుకుంది.

ఆమె చదువుకు కరెంటు లేదు, కోచింగ్‌ లేదు. రాత పరీక్షలో గట్టెక్కింది. కానీ ఇంటర్వూ్యలో విజయం రెండు మార్కుల దూరంలో ఉండిపోయింది. రెండవ ప్రయత్నంలో 2019లో నాగపూర్‌లో సేల్స్‌ టాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధుల్లో చేరింది. తాను ఇంటికి సహాయంగా ఉంటానని భరోసా ఇచ్చి అన్నను తిరిగి కాలేజ్‌లో చేరమని చెప్పింది. తాజా ప్రయత్నంలో వాసిమా డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగానికి అర్హత సాధించింది. వాసిమా స్ఫూర్తితో ఆమె ఇద్దరు చెల్లెళ్లు కూడా ఎమ్‌పీఎస్‌సీకి సిద్ధమవుతున్నారు. 2015లో వాసిమా పెళ్లి హైదర్‌ సాహిబ్‌తో జరిగింది, అతడు కూడా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. వాసిమా విజయానికి అతడు సంతోషం వ్యక్తం చేశాడు. అమ్మ కలను వాసిమా సాకారం చేసింది. మిగిలిన బిడ్డలు కూడా ఆ కలను సంపూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top