ప్రతిభకు కట్టంకట్టే ‘వీర్’డు | virs Educational and Training Foundation | Sakshi
Sakshi News home page

ప్రతిభకు కట్టంకట్టే ‘వీర్’డు

Jul 20 2014 10:15 PM | Updated on Jul 11 2019 6:33 PM

ప్రతిభకు కట్టంకట్టే ‘వీర్’డు - Sakshi

ప్రతిభకు కట్టంకట్టే ‘వీర్’డు

‘మనసుంటే మట్టిలోనుంచైనా మాణిక్యాలను వెలికి తీయవచ్చు. మంచి చేయాలనే ఆలోచనకు పట్టుదల తోడైతే మట్టినైనా బంగారంలా మార్చేయవచ్చు’ అంటున్నారు అశోక్‌వీర్.

‘మనసుంటే మట్టిలోనుంచైనా మాణిక్యాలను వెలికి తీయవచ్చు. మంచి చేయాలనే ఆలోచనకు పట్టుదల తోడైతే మట్టినైనా బంగారంలా మార్చేయవచ్చు’ అంటున్నారు అశోక్‌వీర్. ఏడుపదుల వయసుకు చేరువవుతున్న ఆయన నిరుపేద విద్యార్థులు పారిశ్రామిక రంగంలో నిలదొక్కుకునేందుకు, వారికి కావల్సిన సాంకేతిక నైపుణ్యాలను దగ్గరుండి మరీ నేర్పుతున్నారు. అర్ధంతరంగా ఆగిన చదువులకు సాధనను జోడించి వారు సమున్నతంగా నిలిచేందుకు కృషి చేస్తున్నారు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల శివారుప్రాంతమైన బహదూర్‌పల్లి గ్రామానికి వెళితే అశోక్‌వీర్ కలగన్న సంస్థను చూడొచ్చు. అక్కడ విద్యార్థులు ఉచితంగా నేర్చుకుంటున్న నైపుణ్యాలను సమీక్షించవచ్చు.
 
అశోక్‌వీర్ యాభై ఏళ్ల క్రితమే ఇంజినీరింగ్ పూర్తిచేసుకొని, విదేశాలలో ఉద్యోగంలో చేరారు. అప్పటికే ఆయన జీతం ఐదంకెల్లో ఉండేది. ఇంకెవరైనా అయితే విదేశాలలోనే స్థిరపడేవారు. కానీ అశోక్‌వీర్ తన విద్య స్వదేశానికే ఉపయోగపడాలనుకున్నారు. ఆ ఆలోచనతోనే 40 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చేశారు.

చండీగఢ్‌కు చెందిన ఆయన ఇక్కడే ఓ పరిశ్రమలో ప్రొడక్షన్ మేనేజర్‌గా కొన్నాళ్లు విధులు నిర్వహించారు. అప్పుడే తనకున్న అనుభవంతో పదిమందికి ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆ ఉద్యోగాన్నీ వదిలేశారు. సొంతంగా పరిశ్రమను నెలకొల్పాలని నిశ్చయించుకుని, భార్య సుధావీర్‌కు చెప్పారు. సంగీత ఉపాధ్యాయురాలైన ఆమె భర్త లక్ష్యానికి తోడుగా నిలిచారు. రెండు లక్షల రూపాయల పెట్టుబడి, ఐదుగురు పనివారితో కాలమాన్స్ పరిశ్రమను స్థాపించారు. కంపెనీ అభివృద్ధికి పాటుపడుతూ వందల మందికి ఉపాధి కల్పిస్తూ వచ్చారు.

ఈ క్రమంలోనే ఆయన దృష్టి యువత మీదకు మళ్లింది. ‘నా వద్ద డబ్బుంది. దానిలో కొంత సమాజసేవకు ఉపయోపడేలా చేయాలి’ అనుకున్నారు. కోట్లలో సంపాదన ఇవ్వలేని సంతృప్తి, నిరుపేద విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే లభిస్తుందని భావించారు. ఆ ఆలోచన నుంచి పుట్టుకు వచ్చిందే ‘వీఈటిఎఫ్.’ పూర్తి పేరు ‘వీర్స్ ఎడ్యుకేషనల్ అండ్ ట్రైనింగ్ ఫౌండేషన్.
       
ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి ముందు రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలు తిరిగారు. ఎంతో మందిని కలిశారు. ఈ క్రమంలోనే పారిశ్రామిక రంగంలో డిప్లమా, ఐటిఐ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రాక్టికల్ పరిజ్ఞానం ఎంత మాత్రం లేదని గమనించారు. దీనివల్ల అటు పారిశ్రామిక రంగానికి, ఇటు విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని భావించారు. విదేశాలలో ఉన్నట్టు 75 శాతం ప్రాక్టికల్స్, 25 శాతం థియరీ ఉండేలా ‘వీఈటీఎఫ్’ను నెలకొల్పాలని నిశ్చయించుకున్నారు.

ఇందుకు కాలమాన్స్ సీఈఓగా ఉన్న వారి కుమారుడు గౌతమ్‌వీర్ కూడా తండ్రి ఆలోచనకు ఊతమిచ్చారు. దీంతో 2004లో వీఈటీఎఫ్ సంస్థను స్థాపించి, ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసి, పది ఎకరాల సువిశాల స్థలంలో.. పచ్చని చెట్ల మధ్య.. వీఈటీఎఫ్ సంస్థను నడపడం మొదలుపెట్టారు అశోక్‌వీర్. ఇక్కడకూడా తనదైన ప్రత్యేకతను చూపించారు. విద్యార్థులకు వసతి, తగిన వనరులను సమకూర్చి.., స్వయంగా వారే వండుకో వడం, దుస్తులు, గదులు శుభ్రం చేసుకోవ డం.. ఇలా తమ పనులు తాము చేసుకునే లా తీర్చిదిద్దుతున్నారు.

ఇప్పటి వరకు ఈ విధంగానే 150 కి పైగా విద్యార్థులు శిక్షణ పూర్తి చేసుకొని, పేరున్న కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉదయాన్నే యోగా, వ్యక్తిత్వవికాసం, కంప్యూటర్ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ తరగతుల ద్వారా విద్యార్థులలో కమ్యూనికేషన్ స్కిల్స్‌ను వృద్ధి చేస్తున్నారు. దీంతో పాటు ప్లంబింగ్, వెల్డింగ్, కార్పెంటరీ, ఎలక్ట్రికల్స్ విభాగాల్లోనూ ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ శిక్షణలో భాగంగా అశోక్‌వీర్, సుధావీర్ విద్యార్థుల పర్యవేక్షణ దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు.
       
ప్రస్తుత విద్యాసంవ త్సరానికి వచ్చే వారంలో విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు అశోక్‌వీర్ తెలిపారు. ఆసక్తి ఉన్న యువత ఫోన్ నెంబర్: 8978459303, 040-23095068 లలో సంప్రదించవచ్చు.

 - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
  ఫొటోలు: శివ మల్లాల

 
 వీఈటీఎఫ్ ఆదుకుంది...

 మా నాన్న చనిపోవడం, ఆర్థిక లేమి కారణంగా పదవ తర గతితో చదువు ఆపేయాల్సి వచ్చింది. ఏ ఉద్యోగం చేయాలో, కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలో తెలియలేదు. వీఈటీఎఫ్ గురించి తెలిసి, 2004లో ఇక్కడ రాత పరీక్షలో పాసై, ఏడాది పాటు టెక్నికల్‌గా శిక్షణ పొందాను. అప్పటి నుంచి ఇక్కడే ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నాను.
 - కిశోర్, ప్రిన్సిపల్
 
 క్యాంపస్ సెలక్షన్...
 
 నాది విజయవాడ దగ్గర గన్నవరం. స్థోమత లేక పై చదువులకు వెళ్లలేకపోయాను. వీఈటీఎఫ్‌లో మిషన్ పరికరకాల తయారీలో శిక్షణపొందుతున్నాను. మరో నెలలో శిక్షణ పూర్తవుతుంది. ప్రసిద్ధ కంపెనీలు ఇక్కడికే క్యాంపస్ సెలక్షన్స్ జరపడానికి వస్తున్నాయి. పనిలో ప్రావీణ్యత సాధించి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలన్న ఆశయంతో ఉన్నాను.
 - ఇమ్రాన్, విద్యార్థి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement