ఎంత గొప్ప ఆధ్యాత్మిక సత్యాలు బోధించినప్పటికీ కొన్ని గ్రంథాలను చదివేందుకు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగవు. ఒకవేళ సాగినా, అర్థం కావు.
ఎంత గొప్ప ఆధ్యాత్మిక సత్యాలు బోధించినప్పటికీ కొన్ని గ్రంథాలను చదివేందుకు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగవు. ఒకవేళ సాగినా, అర్థం కావు. అందుకే అందరికీ ఆసక్తిగొలిపేలా నవల రూపంలో రచయిత చేసిన కర్మబోధ, కర్తవ్యబోధ ఇది. ఉత్తములు ఏది న్యాయమా అని ఆలోచిస్తే, అల్పులు ఏది లాభమా అని ఆలోచిస్తూ, తాత్కాలిక ప్రయోజనాల కోసం రకరకాల తప్పుడు పనులు చే స్తూ వాటి ఫలితాలను వివిధ రకాల వ్యాధులు, వైకల్యాల రూపంలో అనుభవిస్తుంటారు. ఈ సత్యాన్ని ఇంచుమించు అన్ని మతాలు బోధించాయి. అలా సంక్రమించిన బాధలను తొలగించుకోవడం కోసం వివిధ రకాల పూజలు చేస్తూ, మొక్కులు చెల్లిస్తూ నానారకాలుగా ప్రయాస పడుతుంటారు అందరూ.
అయితే దాని కన్నా పరనింద, పరపీడనకు దూరంగా ఉంటూ, చేతనైనంత మేరకు ఇతరులకు సహాయం చెయ్యడం, సమాజ హితం కోసం పాటుపడటం వంటి సుకర్మల ద్వారానే భగవంతుడి అనుగ్రహానికి సులువుగా నోచుకుంటామన్నది రచయిత విశ్వాసం, గ్రహించిన సత్యం. ఈ యథార్థాన్ని నవలలోని వివిధ రకాల పాత్రలు, సన్నివేశాల ద్వారా మనసులోకి ఎక్కేలా చెప్పించారు. అలాగే దైవానుగ్రహం వున్నవారికే సంపద, ఆరోగ్యం అమరుతాయా? అది లేనివారి గతేమిటి? దేవుడు కొందర్ని ఆరోగ్యంగా, కొర దర్ని రోగాలతో పుట్టిస్తాడెందుకు? కొందరి ఐశ్వర్యాన్ని సమూలంగా తీసేసి, కొందరు బీదవాళ్లకి తరగని సంపదలని ఇస్తూ ఉంటాడెందుకు... వంటి రకరకాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ఈ నవల ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలనుకునేవారికి కరదీపిక వంటిది.
విధాత, పుటలు: 269, వెల రూ. 120; ప్రతులకు: మల్లాది వెంకట కృష్ణమూర్తి 1-1-728/ఎ, గాంధీ నగర్, హైదరాబాద్ -500 080; telugubooks@yahoo.com