breaking news
grandhalu
-
గురువాణి: పాతకొత్తల గొడవ మనకెందుకు!!!
అభ్యుదయం అంటే సమాజానికి మేలు చేయడం. మనుషులలో మంచి గుణాలు ఏర్పడితే అది అభ్యుదయానికి కారణమవుతుంది. మేలు జరగడానికి పాతదా కొత్తదా అని కాదు... పాతదంతా మంచీ కాదు, కొత్తదంతా చెడూ కాదు. అలాగే పాతదంతా చెడూ కాదు, కొత్తవన్ని మంచివీ కావు. రామాయణ భారతాల్లో అన్నీ ఉన్నాయండీ అని కొత్త వాఙ్మయం దేనికండీ అనడం మంచిదికాదు. కొత్తగా వచ్చిన గ్రంథాలలో ఎన్నో మంచి విషయాలుంటాయి. ‘‘పురాణమిత్యేవ న సాధు సర్వం/ నా చాపి కావ్యం నవమిత్యవద్యమ్/ సంతః పరీక్ష్యాన్యతరత్ భజంతే/ మూఢఃపరప్రత్యయనేబుద్ధిః’’ అంటారు మాళవికాగ్నిమిత్రంలో మహాకవి కాళిదాసు. అంటే పాతకాలానికి సంబంధించినది కాబట్టి ఇందులో ఏదీ పనికొచ్చేదీ, మంచిదీ ఉండదు – అనకూడదు. పాతవన్నీ చెడ్డవని ఎలా సిద్ధాంతీకరిస్తారు! ఈ రచన ఇప్పుడు కొత్తగా వచ్చింది, వీటిలో మన మేలు కోరేవి ఏం ఉంటాయి, వీటిని మనం ఆదరించక్కరలేదు... అని చెప్పడమూ కుదరదు. వివేకవంతులు ఏం చేస్తారంటే... అందులో ఏదయినా మంచి చెప్పారా.. అని పరిశీలిస్తారు. జీవితాలకు అభ్యున్నతిని కల్పించే మాటలు ఏవయినా వాటిలో ఉన్నాయా... అని చూస్తారు. కానీ ఎవరో ఏదో చెప్పారని తన స్వంత బుద్ధిని ఉపయోగించకుండా, మంచీ చెడూ విచారణ చెయ్యకుండా వాటినే అనుకరిస్తూ, అనుసరిస్తూ నిర్ణయాలు తీసుకోవడం మూఢుల లక్షణం. ..అంటున్నాడు కాళిదాసు. మనకు పనికొచ్చే విషయాలు ఎన్ని ప్రతిపాదింపబడ్డాయి.. అన్నదానిని పరిశీలించడం నిజమైన అభ్యుదయం. దాని విషయానికొస్తే అది పాతదా, కొత్తదా అని కాదు ఆలోచించాల్సింది, అందులో మంచి ఏముంది, ఇందులో మంచి ఏముంది? అని అంతకన్నా దాటి ఇక పరిశీలన చేయవలసిన అవసరం నాబోటివాడికి అక్కర లేదు. నా వరకు నాకు కావలసినది – అది ఎవరు రాసింది అయినా పాత కాలపుదయినా, కొత్తకాలపుదయినా, ఇప్పుడు సమాజంలో ఉన్న వ్యక్తులు రాసినది అయినా, పాతకాలంలో రుషుల వాఙ్మయం అయినా... అందులో అభ్యుదయానికి చెప్పబడిన మంచి విషయాలు ఏమున్నాయి? అనే. వాటిని స్వీకరించి, జీర్ణం చేసుకుని బాగుపడడానికి ప్రయత్నం చేయడం వరకే. పాతకాలంలో కూడా ఆదరణీయం కానివి, అంగీకారయోగ్యం కానివి, సమాజానికి ఉపయుక్తం కానివి ఎన్నో ఉండవచ్చు. అంతమాత్రం చేత పాతకాలంలో ఉన్న వాఙ్మయంలో పనికొచ్చేవి ఏవీ లేవు.. అని చెప్పడం సాధ్యం కాదు. ‘పురాణమిత్యేవ న సాధు సర్వం ...’ ఇది... ఆకాలంలో కాళిదాసు చెప్పిన మాట. ఈ మాట ఇప్పటికి పనికి రాదా!!! ఇది నేర్చుకుంటే అభ్యుదయం కాదా!!! ఇది నేర్చుకున్నవాడి జీవితం ... చేత దీపం పట్టుకుని నడుస్తున్న వాడిలా ఉండదా? పువ్వు పువ్వు లోంచి తేనెబొట్టు స్వీకరించిన తేనెటీగకాడా !!! అందువల్ల మంచి విషయాలు స్వీకరించడం ప్రధానం కావాలి. అవి ప్రాచీన వాఙ్మయం నుంచి కావచ్చు, కొత్తగా వెలువడుతున్న గ్రంథాలనుంచి కావచ్చు. వ్యక్తులందరూ అలా స్వీకరించాలి, మంచి గుణాలు అలవర్చుకోవాలి, ఆ వ్యక్తుల సమూహమే సమాజ అభ్యుదయానికి కారణమవుతుంది. ఎవరో ఏదో చెప్పారని తన స్వంత బుద్ధిని ఉపయోగించకుండా, మంచీ చెడూ విచారణ చెయ్యకుండా వాటినే అనుకరిస్తూ, అనుసరిస్తూ నిర్ణయాలు తీసుకోవడం మూఢుల లక్షణం అంటున్నాడు కాళిదాసు. -
కర్మబోధతో కర్తవ్యాన్ని గుర్తు చేసే విధాత
ఎంత గొప్ప ఆధ్యాత్మిక సత్యాలు బోధించినప్పటికీ కొన్ని గ్రంథాలను చదివేందుకు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగవు. ఒకవేళ సాగినా, అర్థం కావు. అందుకే అందరికీ ఆసక్తిగొలిపేలా నవల రూపంలో రచయిత చేసిన కర్మబోధ, కర్తవ్యబోధ ఇది. ఉత్తములు ఏది న్యాయమా అని ఆలోచిస్తే, అల్పులు ఏది లాభమా అని ఆలోచిస్తూ, తాత్కాలిక ప్రయోజనాల కోసం రకరకాల తప్పుడు పనులు చే స్తూ వాటి ఫలితాలను వివిధ రకాల వ్యాధులు, వైకల్యాల రూపంలో అనుభవిస్తుంటారు. ఈ సత్యాన్ని ఇంచుమించు అన్ని మతాలు బోధించాయి. అలా సంక్రమించిన బాధలను తొలగించుకోవడం కోసం వివిధ రకాల పూజలు చేస్తూ, మొక్కులు చెల్లిస్తూ నానారకాలుగా ప్రయాస పడుతుంటారు అందరూ. అయితే దాని కన్నా పరనింద, పరపీడనకు దూరంగా ఉంటూ, చేతనైనంత మేరకు ఇతరులకు సహాయం చెయ్యడం, సమాజ హితం కోసం పాటుపడటం వంటి సుకర్మల ద్వారానే భగవంతుడి అనుగ్రహానికి సులువుగా నోచుకుంటామన్నది రచయిత విశ్వాసం, గ్రహించిన సత్యం. ఈ యథార్థాన్ని నవలలోని వివిధ రకాల పాత్రలు, సన్నివేశాల ద్వారా మనసులోకి ఎక్కేలా చెప్పించారు. అలాగే దైవానుగ్రహం వున్నవారికే సంపద, ఆరోగ్యం అమరుతాయా? అది లేనివారి గతేమిటి? దేవుడు కొందర్ని ఆరోగ్యంగా, కొర దర్ని రోగాలతో పుట్టిస్తాడెందుకు? కొందరి ఐశ్వర్యాన్ని సమూలంగా తీసేసి, కొందరు బీదవాళ్లకి తరగని సంపదలని ఇస్తూ ఉంటాడెందుకు... వంటి రకరకాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ఈ నవల ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలనుకునేవారికి కరదీపిక వంటిది. విధాత, పుటలు: 269, వెల రూ. 120; ప్రతులకు: మల్లాది వెంకట కృష్ణమూర్తి 1-1-728/ఎ, గాంధీ నగర్, హైదరాబాద్ -500 080; telugubooks@yahoo.com