
వెటల్.. విజయానికొక ఫార్ములా ఉంది!
ఆ పదేళ్ల కుర్రాడికి ప్రపంచంలో ముగ్గురు మైఖేల్‌లు ఇష్టం. ఒకరు మైఖేల్ జాక్సన్, రెండు మైఖేల్ జోర్డన్, మూడు మైఖేల్ షూమకర్.
ఆ పదేళ్ల కుర్రాడికి ప్రపంచంలో ముగ్గురు మైఖేల్‌లు ఇష్టం. ఒకరు మైఖేల్ జాక్సన్, రెండు మైఖేల్ జోర్డన్, మూడు మైఖేల్ షూమకర్. ఒకరు పాటగాడు (జాక్సన్), మరొకరు ఆటగాడు (జోర్డన్), ఇంకొకరు ఫార్ములావన్ రేసర్(షూమాకర్). వాళ్ల సరికొత్త ఫీట్లను చూస్తూ, వారినే ఆరాధిస్తూ.. వారిలో ఎవరో ఒకరిలా ఎదగాలని అనుకొన్నాడు. వారి ముగ్గురి వ్యక్తిగత ప్రతిభను పరిశీలించి.. తన వ్యక్తిగత ప్రతిభ గురించి ఒక అంచనాకు వచ్చాడు. తను ఏ మైఖేల్‌తో సరిపోలుతానో లెక్కలేసుకొన్నాడు. ఒక అభిప్రాయానికి వచ్చాడు. ఒక మైఖేల్‌ను ఆదర్శంగా తీసుకున్నాడు. ఆ మైఖేల్ స్థాయికి ఎదిగాడు. నాటి ఆ పదేళ్ల కుర్రాడు నేడు సెబాస్టియన్ వెటల్‌గా మైఖేల్ షూమకార్ స్థాయికి ఇంకో మెట్టు దిగువన ఉన్నాడు. ఇటీవలే ఇండియన్ గ్రాండ్‌ఫ్రీ విజేతగా నిలిచిన అతడి కథ గురించి...
జర్మనీ పునరేకీకరణకు ముందు పశ్చిమ జర్మనీగా ఉన్న ప్రాంతంలో పుట్టాడు సెబాస్టియన్ వెటల్. వెటల్ తండ్రి ఫిజియోథెరఫిస్ట్. వెటల్ అక్కలు, తమ్ముడు అందరూ చదవులో మెరిట్‌స్టూడెంట్స్. అయితే వెటల్‌కు మాత్రం చదువు అబ్బలేదు. నిత్యం ఆటలు, పాటలు ధ్యాసగా గడిపేవాడు. ఈ సమయంలోనే అతడు ‘మైఖేల్‌ట్రిప్లెట్స్’కు అభిమానిగా మారిపోయాడు. వాళ్ల స్టైల్, వాళ్ల మ్యానరిజమ్స్ అనుకరించడం మొదలు పెట్టాడు. తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తులైన ముగ్గురు పేర్లూ ఒకే విధంగా ఉండటం కూడా వెటల్‌కు ఆనందాన్ని ఇచ్చేది. తన పేరుకు కూడా ‘మైఖేల్’ అనే పదం ఉండి ఉంటే.. తను నాలుగో మైఖేల్ కాగలననేంత ఆత్మవిశ్వాసం ఉండింది. అయితే ఆ ఆత్మవిశ్వాసం ఊరికే పోలేదు. తన గురించి తాను జడ్జిమెంట్ ఇచ్చుకునే విషయంలో వెటల్ చాలా కచ్చితత్వాన్ని పాటించేవాడు. తన ఫేవరెట్స్ గురించి ఇలా బేరీజు వేసుకునేవాడు...
జాక్సన్‌లా పాడలేను...
మైఖేల్ జాక్సన్‌లా తాను ఎదగాలి అంటే.. అందుకు స్వరం కావాలి. వేలు, లక్షల మందిలో కదలిక తీసుకురాగలిగేలా పాడాలి. అది తనకు సాధ్యం కాదని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో ఒక మైఖేల్‌ను మైనస్ చేసుకొన్నాడు.
జోర్డన్‌కు ప్రత్యామ్నాయం కాలేను..
అమెరికన్ బాస్కెట్ బాల్ ఆటగాడు మైఖేల్‌జోర్డన్. బాస్కెట్ బాల్ కోసమే పుట్టినట్టుగా ఉంటాడు జోర్డన్. ఆ ఆరడుగుల ఆరంగుళాల ఆజానుబాహుడి స్థాయికి చేరడం అంత సులభం కాదు. అసలు తాను హైట్ లేడు. తను బాస్కెట్ బాల్‌కు అన్‌ఫిట్ అని అర్థం చేసుకొన్నాడు.
షూమాకర్‌ను చూశాడు... షూమాకర్ అయ్యాడు!
స్వదేశీ ఫార్ములావన్ రేస్ హీరో మైఖేల్ షూమాకర్. తనదేశంలో ఫార్ములావన్‌కు పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చాడు. తను ఫార్ములా వన్ రేసులు చూసినప్పుడల్లా వేదికలు మారేవి కానీ విజేత మాత్రం షూమకారే. మరి ఈ మైఖేల్‌లా ఎదగడానికి ...ఆకట్టుకునే స్వరం అవసరం లేదు, భారీకాయం, ఎత్తు అవసరం లేదు. ఓర్పు, నేర్పు, చాకచక్యం ఉంటే తను మరో షూమాకర్ కాగలననే నమ్మకానికి వచ్చాడు. ఆ దిశగా కృషి చేశాడు. కొన్ని సంవత్సరాల్లోనే షూమాకర్‌కు ప్రత్యామ్నాయం అయ్యాడు. ప్రపంచంలోని గ్రాండ్ ఫ్రీ రేసులన్నింటినీ గెలిచి ఏడుసార్లు షూమాకర్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించాడు. వెటల్ ఇప్పటి వరకూ నాలుగు సార్లు ఫార్ములావన్‌లో ఛాంపియన్‌షిప్‌ను సాధించాడు.
2010, 2011, 2012, 2013 సంవత్సరాల్లో వేరే ఎవరికీ ఛాన్స్ ఇవ్వకుండా వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు. వెటల్ ఫామ్‌ను చూస్తుంటే ... ఫార్ములావన్‌లో షూమాకర్‌కు ప్రత్యామ్నాయం కాగలడనే విశ్లేషకులు అంటున్నారు. ఈ ఫార్ములావన్ హీరో సాధిస్తున్న విజయాలను చూస్తుంటే.. సెల్ఫ్ జడ్జిమెంట్ విషయంలో తిరుగులేనివాడనిపిస్తుంది. రాణించగల కె రీర్‌ను ఎంచుకోవడం అనే విషయంలో ఆదర్శవంతమైన యువకుడనిపిస్తుంది.
-జీవన్