బాపు క్లోజప్పులపై ఆ ప్రభావం!


ఆకాశం కారుస్తున్న కన్నీటితో భాగ్యనగరం అప్పటికే తడిసి ముద్దవుతోంది. అల్పపీడన ప్రభావమే కాదు, ఉరుము లేని పిడుగులా ఆదివారం సాయంత్రం అంతకు కొద్ది సేపటి క్రితమే హఠాత్తుగా మీద పడ్డ బాపు అస్తమయ వార్తతో తెలుగు జాతి విషాదంలో మునిగిపోయింది. బాపు - రమణలకు ఆత్మీయుడూ, వారి చివరి మజిలీలో సన్నిహిత సహయాత్రికుడూ అయిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు గుండెలు పిండే బాధ గొంతుకు అడ్డం పడుతోంది. మబ్బులు కమ్మేసిన ఆ సుదీర్ఘ... కాళరాత్రి... త్రివిక్రమ్ తన గుండె గది తలుపులు తెరిచారు. జాతి రత్నాన్ని పోగొట్టుకున్న తీరని బాధలోనూ ఓపిక కూడదీసుకొని, మాట రాని మౌనాన్ని అతి కష్టం మీద ఛేదించారు. కనీసం కలసి ఫోటో తీయించుకోవాలన్న ఆలోచనైనా రానందుకు చింతిస్తూనే, బాపు-రమణల మీద తన భక్తిని మనసు జ్ఞాపకాల చిత్రాలలో నుంచి వెలికి తీశారు. ముగిసిన ఓ శకానికి త్రివిక్రమ్ అర్పించిన  అక్షర నివాళి... ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం...

ఏదైనా అనుకొంటే, వెంటనే చేసేయాలి. అంతేతప్ప ఆలస్యం అస్సలు కూడదు. ఇవాళ కాలం నేర్పిన కొత్త పాఠం ఇది. బాపు గారికి అనారోగ్యంగా ఉందని తెలిసినప్పటి నుంచి స్వయంగా వెళ్ళి కలవాలని అనుకుంటూ వచ్చా. తీరా వెళ్ళి కలవక ముందే ఆయన కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితం ఈ దుర్వార్త తెలియగానే, ఒక్కసారిగా డీలా పడిపోయా. బాపు లాంటి గొప్పవ్యక్తి ఇక లేరు అనగానే నాకు ఏడుపొచ్చేసింది. (గొంతు జీరబోగా...) ఆరు నెలలుగా బాపు గారు ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కీమోథెరపీ చేయించుకుంటున్నారు. దాంతో బలహీనపడ్డారు. ఇవాళ ఆయన మరణంతో తెలుగు చలనచిత్ర, చిత్రకళా రంగాలకు సంబంధించి ఒక శకం ముగిసింది. పుట్టిన ప్రతి ఒక్కరికీ మరణం సహజమని తెలిసినప్పటికీ బాపు - రమణల లాంటి వ్యక్తులు వంద ఏళ్ళు కాదు... నూట పాతికేళ్ళు బతకాలనీ, ఆ చేతి వేళ్ళు ఇంకా రాయాలనీ, మరిన్ని బొమ్మలు గీయాలనీ మన లాంటి అభిమానులం కోరుకుంటాం. ఎందుకంటే, వాళ్ళు మనకిచ్చిన తీపి జ్ఞాపకాలు అలాంటివి.

 

వాళ్ళున్నది మా ఇంటి పైనే!బాపు - రమణలతో నా తొలి పరిచయం వాళ్ళ ‘రాధాగోపాళం’ చిత్రం కన్నా చాలా ముందు నుంచే! అప్పటికి నేను దర్శకుడిగా ‘అతడు’ చిత్ర సన్నాహాల్లో ఉన్నాను. వాళ్ళు ‘శ్రీభాగవతం’ సీరియల్ తీస్తున్నారు. ‘రాధాగోపాళం’ టైమ్‌లో వాళ్ళకు సన్నిహితుడినయ్యా. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో హైదరాబాద్‌లో మా అపార్ట్‌మెంట్స్‌లోనే నాలుగో అంతస్తులో అద్దె ఇంట్లో బాపు - రమణలు ఉన్నారు. వాళ్ళ షూటింగయ్యాక సాయంత్రాల్లో వారానికి రెండుసార్లయినా కబుర్లాడుకొనేవాళ్ళం. వాళ్ళు ఏదైనా చెబుతుంటే, చెవి ఒగ్గి వినేవాణ్ణి. అలా ఎన్నో సంగతులు తెలుసుకున్నా, నేర్చుకున్నా. అందరూ రమణ గారు బాగా మాట్లాడతారు, బాపు గారు పెద్దగా మాట్లాడరని అంటారు. కానీ, నా విషయంలో అది నిజం కాదు. విచిత్రంగా బాపు గారు, నేను ఎక్కువ మాట్లాడుకొనేవాళ్ళం. ఇప్పుడాలోచిస్తే, అలా కుదరడం చిత్రమనిపిస్తుంటుంది.

 

బాపు క్లోజప్పులపై ఆ ప్రభావం!నాకూ, ఆయనకూ ఉమ్మడి చర్చనీయాంశం - సినిమా. అలా కూర్చొని ఎన్నేసి గంటలు మాట్లాడుకొనేవాళ్ళమో! ఎక్కువగా అంతర్జాతీయ సినిమా గురించే మా సంభాషణ సాగేది. సినిమాల్లో, సంగీతంలో ఆయన అభిరుచి లోతైనది. ప్రాథమికంగా యూరోపియన్ సినిమా, ఇరానియన్ సినిమా బాగా ఇష్టం. ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ది వెస్ట్’, ‘ఫర్ ఎ ఫ్యూ డాలర్స్ మోర్’ లాంటి చిత్రాలు తీసిన సెర్జియో లియోన్ ఆయనకు బాగా ఇష్టమైన దర్శకుడు. క్లోజప్ షాట్లు, బోల్డ్ క్లోజప్‌ల విషయంలో అతని ప్రభావం తన మీద ఉందేమో అనేవారు. కానీ, నన్నడిగితే ఆ దర్శకుడు ఎక్కువగా యాక్షన్‌లో అలాంటివి చేశారు. బాపు గారు ప్రాథమికంగా రొమాన్స్ సన్నివేశాల్లో ఆ పద్ధతి వాడారు. అదీ చాలా కళాత్మకంగా ఉంటుంది.

 

మూకీ చిత్ర యుగానికి చెందిన అమెరికన్ నటుడు జార్జ్ కూపర్ సినిమాలంటే ఆయనకు తెగ ఇష్టం. అలాగే, పాశ్చాత్య సంగీతజ్ఞుడు ఎనియో మొరికోన్ చేసిన నేపథ్య సంగీతం గురించి, ఆయన చేసిన ఆల్బమ్స్ గురించి ఎప్పుడూ చెబుతుండేవారు. ‘అవి వినండి. ఆ సంగీతంలో మీకు ఎన్నో కథలు దొరుకుతాయి’ అనేవారు. ఎందరో ఫిల్మ్ మేకర్లు, సంగీత దర్శకులు, సినిమాటోగ్రాఫర్ల పేర్లు ఆయన నోట్లో నానుతుండేవి. డెరైక్షన్‌కు సంబంధించిన రచనలు, గొప్ప సినిమాల స్క్రీన్‌ప్లేలు - ఇలా బాపు గారు నాకు చాలా పుస్తకాలిచ్చారు. చిన్న చిన్న కాగితాల మీద నోట్స్ లాంటి ఉత్తరాలు రాసేవారు. పచ్చళ్ళు పంపేవారు.

 

అటు ఆయన... ఇటు మేము... ఏడ్చేశాం!‘శ్రీరామరాజ్యం’ చిత్రం విడుదల తరువాత అంత గొప్ప చిత్రం చూసి, ఉండబట్టలేక రాత్రి 12 గంటల వేళ ఫోన్ చేశాను. నిర్మాత సాయిబాబు గారు తీసి, బాపు గారికి ఫోన్ అందించారు. సినిమాలో ఏవేం బాగా నచ్చాయో చెబుతూ, నేను, నా శ్రీమతి ఇటుపక్క ఫోన్‌లో నిజంగా ఏడ్చేశాం. అటుపక్కన బాపు గారూ ఫోన్‌లోనే ఏడ్చేశారు. ‘నాదేమీ లేదు. అంతా ఆ రాముడు, ఆ వెంకట్రావ్ (ముళ్ళపూడి వెంకట రమణ గారి అసలు పేరు. ఆయనను వెంకట్రావ్ అనే బాపు పిలిచేవారు)ల దయ’ అని పదే పదే తలుచుకున్నారు. రమణతో ఆయన స్నేహం అది. ఆయనకున్న గొప్ప సంస్కారం అది. నా గొంతు పూడుకుపోయింది. మాట రాలేదు. అది నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. ‘శ్రీరామరాజ్యం’ తప్పకుండా చూడమని హీరో పవన్ కల్యాణ్‌కు చెప్పాను. ఒకరోజు రాత్రి 11 నుంచి ఒకటిన్నర దాకా ప్రసాద్ ల్యాబ్‌లో ప్రత్యేక ప్రదర్శన చూశారు కల్యాణ్. చూసి, చలించిపోయి, నాతో అరగంట మాట్లాడారు. ఆ వెంటనే రాత్రి 2 గంటలకు ప్రెస్ కెమేరాల ముందుకొచ్చి తన అనుభూతిని పంచుకున్నారు.  

 

ఆయనది అంతర్జాతీయ స్థాయిదర్శకుడిగా తొలి సినిమాగా ‘సాక్షి’ లాంటి ఆఫ్-బీట్ సినిమాను ఎవరైనా తీస్తారా? ఆ రోజు నుంచి చివరి దాకా బాపు - రమణలు వెండితెరపై చేసిన సాహసాలు అన్నీ ఇన్నీ కావు. ఏయన్నార్ ఉచ్చస్థితిలో ఉండగా ఆయన పాత్రకు హీరోయిన్ లేకుండా, భార్య పోయి, బిడ్డ ఉన్న పూజారి పాత్రను ‘బుద్ధిమంతుడు’లో చేయించడం మరో సాహసం. ఆ చిత్రంలో గొప్ప ఫిలాసఫీ ఉంది. చివరలో భిన్నమైన ఆలోచనాధోరణులున్న హీరో పాత్రలు రెండూ నెగ్గినట్లు కన్విన్సింగ్‌గా చెప్పడానికి  ధైర్యం కావాలి. సినిమాలన్నీ సాదాసీదాగా, ఒకే పద్ధతిలో లీనియర్‌గా ఉండే రోజుల్లో, అలా అనేక కోణాలున్న సినిమాను, పైకి కనిపించేదే కాకుండా, లోలోపల ఎన్నో భావాలు పొదిగిన సినిమాలు చేయడం కష్టం. ఆ సాహసం ఆయన చేశారు. అలాగే, పూర్తి కామెడీ సినిమాలు లేని ఆ రోజుల్లోనే ‘బంగారు పిచిక’ తీశారు. ఆయన సాహసించిన నలభై ఏళ్ళ తరువాత ఇప్పుడు ఆ ట్రెండ్ చిత్రాలు జోరందుకున్నాయి.

 

‘ముత్యాల ముగ్గు’ చూస్తే, అప్పటి దాకా వచ్చిన తెలుగు చిత్రాలకు పూర్తి భిన్నంగా, ఆఫ్-బీట్‌గా నేపథ్య సంగీతం ఉంటుంది. భార్యాభర్తలిద్దరి దాంపత్య ఘట్టాన్ని కేవలం మాండలిన్ బిట్‌తో నడిపితే, వారిద్దరూ విడిపోయే సీన్‌ను రీరికార్డింగ్ లేకుండా చేశారు. బాపు షాట్ కంపోజిషన్, మేకింగ్, విజువలైజేషన్, నేపథ్య సంగీతం - అన్నీ అంతర్జాతీయ స్థాయివే. నా దృష్టిలో ఆయన తెలుగు గడ్డకే పరిమితమైపోయిన అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ మేకర్. అంతర్జాతీయ సినిమాలు చూసిన వ్యక్తిగా ఇది  ఘంటాపథంగా చెబుతున్నా. ఒక్క మాటలో రేపటి సినిమాను... నిన్ననే ఆలోచించి... ఇవాళే తీసేసిన... దిగ్దర్శకుడు బాపు గారు. కాలాని కన్నా ముందస్తు ఆలోచనలున్న క్రియేటర్.

 

ఇప్పటికీ నాకు ఎప్పుడు మనసు బాగా లేకపోయినా, బాపుగారి ‘బుద్ధిమంతుడు’, ‘అందాల రాముడు’ చూస్తా. తక్షణమే పాజిటివ్ ఎనర్జీనిచ్చే చిత్రాలవి. ఇక, ‘మన ఊరి పాండవులు’లో బాలూ మహేంద్ర, బాపుల విజువల్ జీనియస్ చూడవచ్చు. అభిరుచి గల మంచి సినిమాకూ, కమర్షియల్ హిట్టయ్యే సినిమాకూ మధ్య బంధం వేసి, ఆ రెంటినీ కలగలిపిన అద్భుతమైన వ్యక్తులు బాపు-రమణ. వాళ్ళకు తెలిసిందల్లా హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తూ పోవడమే. హిట్టయితే ఆ డబ్బులు సినిమాలోనే పెట్టారు. ఫ్లాపైతే, ఆ అప్పులు తీర్చడానికి మరో సినిమా తీశారు. వాళ్ళు సంపాదించిన దాని కన్నా పోగొట్టుకున్నదే ఎక్కువ. చిరస్మరణీయమైన సినిమాలు మిగిల్చారు. చేస్తున్న పనిని ఆస్వాదిస్తూ, దానినే దైవంగా చేసుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది.

 

ఆయనలా పని చేస్తేనా...నన్నడిగితే బాపు చాలా గొప్ప థింకర్ కూడా! ఆయన భావవ్యక్తీకరణలో, గీసిన బొమ్మలో, తీసిన సినిమాలో అది స్పష్టంగా తెలుస్తుంటుంది. ఆయన తన శక్తిని మాటలతో వృథా చేసేవారు కాదు. చేస్తున్న పనిలోనే దాన్ని క్రమబద్ధీకరించి, వినియోగించేవారు. అలాగే, ఒక వ్యక్తిగా, కళాకారుడిగా బాపు గారు ఎంతో క్రమశిక్షణ ఉన్న వ్యక్తి. ఆయన చేసినంత కఠోర పరిశ్రమ ఎవరూ చేయలేరు. లేకపోతే, పుస్తకాల ముఖచిత్రాలు, కార్టూన్లు, కథలకు బొమ్మలు, క్యారికేచర్లు - ఇలా ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఏకంగా ఒకటిన్నర లక్షల పైగా బొమ్మలు వేయడం సాధ్యమా చెప్పండి. ఇంకా యాడ్ ఏజెన్సీల్లో క్రియేటివ్ హెడ్‌గా వేసినవి, స్క్రిప్టు స్టోరీబోర్డుకు వేసుకున్న బొమ్మల లాంటివి లెక్కలోకి తీసుకోకుండానే అన్ని బొమ్మలయ్యాయంటే ఆశ్చర్యం. బొమ్మలేయడాన్ని పనిగా అనుకోలేదు. ఎవరో రాసిన నవలకు ముఖచిత్రం వేయడం కూడా ఆ వంకతో తాను ఆ కథ చదవవచ్చనే! అది చదివి, దాని మీద తన అభిప్రాయాన్నీ, సమీక్షనూ మాటలతో కాదు, బొమ్మతో చెప్పేసేవారు. అది ఆయన గొప్పతనం.

 

బాపు గారు అసలు సిసలు కళాకారుడు. ఎంతో జీనియస్. లుంగీ కట్టుకొని, లాల్చీ వేసుకొని, ప్యాడ్, కుంచెలు పెట్టుకొని, కింద కూర్చొని, ఎదురుగా డీవీడీ ప్లేయర్‌లో సినిమా పెట్టుకొనో, పక్కనే సంగీతం వింటూనో బొమ్మలు వేసుకొనేవారు. చేయి నొప్పి పుడితే, కాసేపు ఆపి, సినిమా చూసేవారు. సినిమా బోర్ కొడితే, అది పాజ్ చేసి, బొమ్మలు వేసుకొనేవారు. ఇలా రోజూ 16 గంటలకు పైగా పనిచేయడం, పడుకోవడం! మళ్ళీ పొద్దున్నే లేవగానే అదే పని! ఎవరికో ఏదో నిరూపించడానికి కాక, మనస్ఫూర్తిగా పనిని అంతగా ఆస్వాదిస్తూ, ఆనందంగా చేస్తే శ్రమే తెలియదు. ఆయనలో కనీసం పది శాతమైనా మనం పని చేస్తే చాలు... ఎంచుకున్న రంగంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతాం.

 

పక్కా తెలుగువాడుజీవితమంతా మద్రాసులో గడిపిన బాపుగారు పక్కా తెలుగువాడు. ఆయన కట్టుబొట్టు, ఆహారవ్యవహారాలు, ఇష్ట పడే రుచులు, మాట్లాడే మాట, రాసే రాత, గీసే గీత - అన్నీ తెలుగు వాతావరణానికి ప్రతిబింబాలే. ప్రపంచం మొత్తం తిరిగినా, పల్లెటూరు తెలుగువాడు ఎలా ఉంటాడో అలాగే, సింపుల్‌గా బతికారు. స్టీలు గ్లాసులో కాఫీ తాగడం నుంచి కింద కూర్చొని పని చేసుకోవడం దాకా - తాను ఏ వాతావరణం నుంచి వచ్చాడో ఆ వాతావరణాన్ని వదిలిపెట్టలేదు. అదే ఆయన సృజనలో ప్రతిఫలించింది. ఒక్క ముక్కలో - ఆయన నేల మీదే నిల్చొని, గాలిపటం ఎగరేశారు. దాన్ని ప్రపంచం మొత్తం చూపించారు. అదీ ఆయన ప్రత్యేకత.

 

అరుదైన వ్యక్తులు, వ్యక్తిత్వాలువ్యక్తులుగా కూడా వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు. అలాంటి వ్యక్తులు సినీ రంగంలో అరుదు. ఎదుటివారి వల్ల వాళ్ళు మోసపోయారే తప్ప, వాళ్ళు ఎవరినీ మోసం చేయలేదు. ప్రతిభతో పాటు అరుదైన వ్యక్తిత్వం వారి సొంతం. ఆ రెండింటి సమ్మేళనం కాబట్టే, జయాపజయాలను పట్టించుకోకుండా, నమ్మిన విలువలకే జీవితాంతం కట్టుబడగలిగారు. చివరి వరకు ఆ స్థాయిని కొనసాగించారు. ఇవాళ సినీ, సాహిత్య, కళా రంగాలతో పాటు సామాన్య తెలుగు సమాజంలోనూ వారికి ఇంత గౌరవ ప్రతిష్ఠలు దక్కడానికి కారణం అదే! స్నేహమంటే బాపు - రమణలంటారు. ‘ఒక రంగంలో సృజనాత్మకంగా అత్యున్నత శిఖరాలకు వెళ్ళిన ఇద్దరు మనుషులు 66 ఏళ్ళ పైగా ఏ గొడవా లేకుండా కలిసి బతికారు, కలిసి నడిచారు, కలసికట్టుగా తమ రంగంలో కృషి చేశార’ని చెబితే చాలు... ఇక వాళ్ళ స్నేహం గురించి మనం ప్రత్యేకించి ఏమీ చెప్పనక్కర లేదు. ఒకసారి నేను ఉండబట్టలేక, ‘మీరిద్దరి మధ్య ఎప్పుడూ అభిప్రాయ భేదాలు రాలేదా’ అని అడిగేశా. ‘ఎందుకు రావు! కథా చర్చల్లోనో, మరొకచోటో ఏదో అభిప్రాయ భేదం వస్తుంది. వాదించుకుంటాం. మళ్ళీ మామూలైపోతాం’ అన్నారు. వాళ్ళెప్పుడూ తమ జీవితాన్ని సంక్లిష్టం చేసుకోలేదు. సాదాసీదాగా గడిపేశారు. వాళ్ళలా సింపుల్‌గా బతకడం మనకేమో కాంప్లికేటెడ్ అయిపోతోంది!

 

అలా బతకడం అంత సులభం కాదు!బాపు - రమణల స్నేహం, సాన్నిహిత్యం ఎంతంటే, రమణ గారు పోయాక బతకడం ఇష్టలేక బాపుగారు వెళ్ళిపోయారని నాకు అనిపిస్తోంది. బాపు గారు గుర్తొచ్చినప్పుడల్లా ఆయనలా హార్డ్‌వర్క్ చేయాలని స్ఫూర్తి కలుగుతుంటుంది. ఇక, రమణ గారి పేరు చెప్పగానే ఆయనంత గొప్పగా రాయాలనుకుంటా. ఎవరెస్ట్ అంటే ఎవరైనా ఎక్కాలనే అనుకుంటారు కదా! నేనూ అంతే! వాళ్ళు ఎప్పుడూ మాట్లాడలేదు, ఉపన్యాసాలివ్వలేదు. నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళలాగా భేషజం లేకుండా మామూలు వాళ్ళలా బతకడం అంత సులభం కాదు. అయినా సరే, అలా ఉండేందుకు ప్రయత్నించడం, వాళ్ళ సినిమాలు చూసి ఆనందించడమే మనమిచ్చే ఘనమైన నివాళి. అంత గొప్పవాళ్ళ జీవితంలోని చివరి రోజుల్లో కొన్ని క్షణాలైనా వారితో కలసి గడపడం నా జీవితకాలపు అదృష్టం. ఆ అదృష్టం మరింత కాలం కొనసాగకుండా, అంతలోనే ఆ మహానుభావులు భౌతికంగా దూరమైనందుకు ఇవాళ ఆగకుండా ఏడుపొచ్చేస్తోంది. ఇంతకాలం జాతి మొత్తాన్నీ నవ్వించిన బాపు గారూ! రమణ గారూ! మీకిది న్యాయమా సార్?

 

- సంభాషణ: రెంటాల జయదేవ

 

బాపు మార్కు సెటైర్లుఆహార విహారాల్లో కూడా బాపు -రమణలది మంచి అభిరుచి. ఏదైనా మితంగా, హితంగా ఉండేది. బాపు గారు చాలా తక్కువ తినేవారు. కాకపోతే, వాటిల్లోకి పప్పు, కూర, పచ్చడి అన్నీ ఉండాలి. అంత చక్కటి రాయల్ టేస్ట్. బాపు గారిలో హాస్యప్రియత్వానికి ఎన్నో ఉదాహరణలు.  నటుడు బ్రహ్మానందం గారి బలవంతంతో వాళ్ళింటికి బాపు గారు ఒకసారి భోజనానికి వెళ్ళారు. ఆయనకు స్వయంగా వడ్డించాలని బ్రహ్మానందం గారి కోరిక. బాపు గారు సరేనన్నారు. ఆయన తింటుంటే, ‘ఇంకొంచెం తినండి’ అంటూ మరింత వడ్డించబోయారు బ్రహ్మానందం. ‘బాగుందని చెప్పాలంటే, ఇంకొంచెం తినాలాండీ!’ అని బాపు వ్యాఖ్యానించారు. ఒకటే నవ్వు. కొత్తల్లో ఒకసారి నేను ‘అతడు’ కథ చెబుతుంటే, రెండు మూడు సీన్లు విన్నాక ఆయన, ‘శ్రీనివాస్ గారూ! షాట్లు చెప్పకండి. కథ చెప్పండి’ అన్నారు. ‘నా బలహీనతను క్షమించి, భరించండి’ అని నేను సిగ్గుపడుతూ అన్నాను. ఇలా మా మధ్య చతురోక్తులు చాలా నడిచేవి.

 

అది ప్రభుత్వం ఆయన మీద వేసిన అతి పెద్ద కార్టూన్!బతికుండగా ఎవరినీ గౌరవించాల్సినంతగా గౌరవించకపోవడమనేది ప్రాథమికంగా మన తెలుగువాళ్ళకున్న దౌర్భాగ్యం. ఇప్పటికి మూడున్నర దశాబ్దాల క్రితమే ‘సీతా కల్యాణం’లో గంగావతరణ ఘట్టం కోసం ఒకే నెగటివ్ మీద ఏకంగా 27 ఎక్స్‌పోజర్లు చేసిన తెలివైన టెక్నీషియన్ బాపు. చుక్క నీళ్ళు లేకుండా కేవలం చాక్‌పీస్ పొడితో, గంగానది ఉత్తుంగ తరంగంలా కిందకు దూకుతున్న అనుభూతి తెరపై కల్పించిన జీనియస్. తెలుగు భాషకు తన రాతతో ఒక ప్రత్యేకమైన ఫాంట్ అందించారు. ఆడపిల్ల అంటే, బాపు బొమ్మలా అందంగా ఉండాలన్న నిర్వచనానికి కారణమయ్యారు. ఇవాళ ‘ప్రీ-విజ్’ అని అందరూ చెబుతున్న స్టోరీ బోర్డ్ కాన్సెప్ట్‌ను ఉత్తరాదిన సత్యజిత్ రే, దక్షిణాదిన బాపు ఏనాడో చేశారు. పిల్లల కోసం బాపు-రమణలు ఉచితంగా వీడియో పాఠాలు తీసి ఇచ్చారు. పత్రికల్లో, ప్రకటన రంగంలో, పుస్తక ప్రచురణ రంగంలో, సినిమాల్లో - ఇలా అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేశారు. ఇక, వ్యక్తిగతంగానూ ఎంతోమందికి ఆదర్శమయ్యారు. అలాంటి వాళ్ళను కూడా ప్రభుత్వం గుర్తించకపోతే, ఇంకేం చేస్తే గుర్తిస్తారో? భారతీయ సినిమాకూ, ప్రపంచ సినిమాకూ, తెలుగు చిత్రకళా రంగానికీ ఇంత సేవ చేసిన వారికి కనీసం ‘పద్మవిభూషణ్’ అన్నా ఇవ్వాలి కదా! కానీ, ఇన్నేళ్ళ తరువాత, రమణ గారు కూడా గతించాక, గత ఏడాది బాపు గారికి ఉత్తి ‘పద్మశ్రీ’ ఇచ్చారు. నా దృష్టిలో బాపు గారిపై ప్రభుత్వం వాళ్ళు చేసిన అతి పెద్ద కార్టూన్ అది!

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top