సెర్వాంటేజ్‌

Todays Great Writer Is Cervantage - Sakshi

గ్రేట్‌ రైటర్‌

స్పానిష్‌ భాషలో అత్యంత గొప్ప రచయిత మిగెల్‌ డె సెర్వాంటేజ్‌ (1547–1616). ఆయన ప్రభావం ఎంత గొప్పదంటే, స్పానిష్‌ను సెర్వాంటేజ్‌ భాష అనుకునేంత. స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌ దగ్గరలో జన్మించాడు సెర్వాంటేజ్‌. వాళ్ల నాన్న క్షురక వైద్యుడు. ఆ కాలంలో క్షురకులు చిన్న చిన్న వైద్యాలు కూడా చేసేవాళ్లు. ఆ కాలపు అందరు యువకుల్లాగే గొప్ప భవిష్యత్‌ వెతుక్కుంటూ రోమ్‌ వెళ్లాడు సెర్వాంటేజ్‌. గుమస్తాగా, సైనికుడిగా పనిచేశాడు. ఓ సందర్భంలో సముద్ర దొంగలకు చిక్కి ఐదేళ్లపాటు నిర్బంధం అనుభవించాడు. అనేక యుద్ధాల్లో పాల్గొన్నాడు. ఎడమచేయిని కోల్పోయాడు. (రాయడం ద్వారా) కుడిచేతికి కీర్తిని మిగల్చడం కోసం ఎడమచేతిని నష్టపోయానని సరదాగా చెప్పుకున్నాడు. ఈ అనుభవాలన్నీ ఆయన రచనా వ్యాసంగానికి ముడిసరుకు అయ్యాయి.

స్పెయిన్‌కు తిరిగి వచ్చిన తర్వాత, మధ్య తరగతి జీవితం బతికాడు. 1605లో రాసిన డాన్‌ కిహోటి ఆయనకు ప్రసిద్ధిని తెచ్చిపెట్టింది. ఆ వ్యంగ్య నవల తర్వాత్తర్వాత సుమారు 140 భాషల్లోకి అనువాదమైంది. అత్యంత ఎక్కువ భాషల్లోకి అనువాదమైన పుస్తకాల్లో ఇదీ ఒకటి. నాటకాలూ, కథలూ, ఇతర నవలలూ రాశాడు. జీవితంలోని అబద్ధాన్ని నిరసించడమూ, మనస్తత్వానికి పట్టం కట్టడమూ ఆయన రచనల్లో కనబడుతుంది. సెర్వాంటేజ్‌ ‘కుక్కల సంభాషణ’ కథంటే సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌కు చాలా ఇష్టం. దాన్ని మూలంలో చదవడానికి ఫ్రాయిడ్‌ స్పానిష్‌ నేర్చుకున్నాడు. సెర్వాంటేజ్, ఆ కాలపు మరో గొప్ప రచయిత షేక్‌స్పియర్‌ ఇద్దరూ 1616లో ఒకేరోజు సమాధి కావడం విశేషం. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top