తెల్లజుట్టు సమస్యా.. ఇలా చేయండి!

Tips And Remedies For Get Free From Gray Hair Problem - Sakshi

ఒక వ్యక్తి అందాన్ని ఇనుమడిపంజేసేది శిరోజాలే అంటారు. ఇక ఆడవాళ్లైతే శిరోజాలనే తమ అందానికి గుర్తుగా భావిస్తానరడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటిది ఆధునిక జీవన శైలి, కాలుష్యం కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా జుట్టు రాలడం అనే సమస్య అందరినీ వేధిస్తోంది. అంతేకాదు జుట్టు తక్కువగా ఉన్నా సరే బాగుంటే చాలు అనుకునే వారు తెల్లజుట్టు రావడంతో మరింతగా ఆందోళనకు గురవుతున్నారు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి కాస్త విముక్తి పొందవచ్చు.

బ్లాక్‌ టీ
తెల్లజుట్టు నివారణలో బ్లాక్‌ టీ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఒక కప్పు బ్లాక్‌ టీ తీసుకుని(పాలు కలపకుండా) దానిలో ఒక టీ స్పూన్‌ ఉప్పు కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి మసాజ్‌ చేయాలి. జుట్టు కుదుళ్లకు చేరేలా మర్దనా చేసి.. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

సేజ్‌ ఆకులు
ఎండిన సేజ్‌(జాజికాయ) ఆకులను తీసుకుని మరుగుతున్న నీటిలో కాసేపు ఉడికించాలి. ఆ తర్వాత రెండు గంటల పాటు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. అనంతరం దీనికి నాలుగైదు చుక్కల గ్లిజరిన్‌ కలపాలి. తద్వారా జుట్టు పోషణకు అవసరమైన విటమిన్‌-ఇ అందుతుంది. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మర్దనా చేయాలి. ఇలా చేయడం ద్వారా సహజ పద్ధతిలోనే నల్లని జుట్టు పొందవచ్చు.

హెన్నా
తెల్ల జట్టు సమస్య నుంచి బయటపడేందుకు దాదాపుగా అందరూ పాటించే చిట్కా ఇది. మార్కెట్‌లో దొరికే నాణ్యమైన హెన్నా పౌడర్‌ తీసుకుని.. దానికి పెరుగు, మెంతులు, కాఫీ, తులసి రసం, పుదీనా రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని సుమారు పదిహేను నిమిషాల పాటు నీటిలో మరగబెట్టాలి. 12 నుంచి 15 గంటల పాటు ఒక నానబెట్టిన తర్వాత.. జుట్టుకు పట్టించి మూడు గంటల పాటు అలాగే ఉంచాలి. అనంతరం షాంపూతో కడిగేస్తే సరి. అయితే రాత్రి మొత్తం నానబెట్టి తెల్లవారి హెన్నా పెట్టుకోవడం ద్వారా మళ్లీ మళ్లీ తలస్నానం చేసే ఇబ్బంది ఉండదు.

ఉసిరి
నల్లని శిరోజాలు పెంపొందించడంలో ఉసిరిది ప్రధాన పాత్ర. ఎండిన ఉసిరి కాయలను నీళ్లలో నానబెట్టాలి. ఒక రోజంతా నానిన తర్వాత వీటిని గ్రైండ్‌ చేసుకోవాలి. అనంతరం  ఉసిరిని నానబెట్టిన నీళ్లలో హెన్నా పౌడర్‌, గ్రైండ్‌ చేసిన ఉసిరి మిశ్రమాన్ని కలపాలి. ఆ తర్వాత దీనికి ఐదు చెంచాల నిమ్మకాయ రసం, కాఫీ, పచ్చి గుడ్డు తెల్లని సొన కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు గంటల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నీటితో కడిగేసి.. షాంపూ అప్లై చేసుకోవాలి. వారానికొకసారి ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరి నూనె, అల్లం

కొబ్బరి నూనెలో ఉసిరి ముక్కలను వేడి చేసి కాసేపు మరగబెట్టాలి. ఒక రాత్రంతా ఈ మిశ్రమాన్ని నానబెట్టి... దీనికి కాసింత తేనె కలిపి జుట్టుకు పట్టించి మర్దనా చేయాలి. మెరుగైన ఫలితం కోసం ఉసిరితో పాటు అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top