అనుమానం లేదు... డౌట్ ఉంది... | Sakshi
Sakshi News home page

అనుమానం లేదు... డౌట్ ఉంది...

Published Sun, Dec 20 2015 11:27 PM

అనుమానం లేదు...  డౌట్ ఉంది...

సతిబాధ
 
నా ఫోన్ మీద నిఘా. బయట నుంచి వచ్చాక బట్టలకు అంటిన పెర్‌ఫ్యూమ్‌ల మీద నిఘా. కారులో పొడవైన వెంట్రుకలు ఏమైనా దొరుకుతాయేమోనని కూంబింగ్. ఆధార్ కార్డులో అరవై ఏళ్లు పైబడ్డాయని గవర్నమెంట్ ప్రూఫ్ దొరికితే తప్ప పని మనిషిగా అపాయింట్‌మెంట్ లెటర్ హాండోవర్ చేయదు.
 
‘మీకు నీలిమా అంటే ఇష్టం కదండీ’...
‘అవును.’
‘ఎంతిష్టం?’
‘ఇప్పటి వరకూ ఉన్న ఎక్స్‌పీరియన్స్‌ను బట్టి నీలిమాయే బెస్ట్ అనుకుంటున్నాను’...
‘హు. అనుకున్నా. నన్నెప్పుడు పట్టించుకున్నార్లేండి. ఆ నీలిమా వెంటే పడి ఛావండి’....
లేచెళ్లిపోయింది.
ఇప్పుడు తప్పేం మాట్లాడానని? సిటీలో ఏ రెస్టరెంట్‌కు వెళ్లినా మూసీ నుంచి గ్రాస్ తెచ్చి వండి పెడుతున్నారు. నీలిమాలో అయితే కనీసం చికెన్ అడిగితే  కెచిన్‌నో, మటన్ అడిగితే టమన్‌నో సర్వ్ చేస్తున్నారు. అందుకే అది ఇష్టం అని చెప్పాను. కాని కాదట. మా ఆవిడ ప్రస్తావించింది ఆ నీలిమా కాదట. ఫోర్ నాట్ టూ నీలిమా అట. అసలు మా కాంప్లెక్స్‌లో ఫోర్త్ ఫ్లోర్ ఎక్కడ ఉందో నాకు తెలియదు. నాట్ ఒన్ కానీ నాట్ నాట్ టూ కానీ అంతకన్నా తెలియదు. ఇక సదరు నీలిమా అనే ఆ సంప్రదాయబద్ధ స్త్రీమూర్తి అంతకన్నా తెలియదు.మరి నన్ను అనుమానించడం తగునా? నాకు ఈ బాధ ఏంటి మదనా?
       
‘పెళ్లయిన కొత్తలో అడిగింది- మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టమండీ... సౌందర్య?’
‘ఊహూ’.
‘సిమ్రాన్?’
‘అ..హ...హూ’.
‘అలాగైతే వాణీ విశ్వనాథ్ అయి ఉంటుందిలేండి. మలయాళీలు చాలా చక్కగా ఉంటారని ఒకసారి అన్నారుగా’...
‘అ....హా..... హో...నో’...
‘మరెవరూ ఇష్టం లేదా’?
‘సావిత్రి’.
‘ఎవరూ? స్టూడెంట్ నం.1లో గజాలా పక్కన ఉంటుంది. ఆ అమ్మాయేనా’?
‘అయ్యో. పాత సినిమాల్లో ఉంటుందే ఆ సావిత్రే’.

అంతే. ఎప్పుడు టీవీలో పాత సినిమాలొచ్చి సావిత్రి కనిపించినా ఒక డ్రై క్లాత్ తీసుకొని అడ్డం నిలబడి టీవీని తుడవడానికి రెడీ అయిపోతుంది. ఒక్కోసారి సావిత్రి చేయి కనిపిస్తుంది. ఒక్కోసారి సావిత్రి ముక్కు. సమస్త సావిత్రిని చూసే భాగ్యం ఆ రోజు నుంచి నాకు తుర్రుమంది.
       
ఆ రోజు ఉదయం ఫోన్ మోగింది. అప్పటికి సరదాగా వంట చేద్దామని వంట గదిలో ఉన్నా. ‘బెండకాయ చేయనా’ అంటే ‘వద్దు... అవి లేడీస్ ఫింగర్స్... బంగాళదుంప చేయండి’... అంటే తొక్క తీసి తీరిగ్గా తరుగుతూ ఉన్నా. ఫోన్ మోగింది. చేయి ఖాళీ లేక ‘ఎవరో చూడు’ అనంటే ఫోన్ తీసింది. అవతల మా బాస్ పి.ఏ. ఉత్త హడావిడి మేళం. ఫోన్ ఎత్తింది మా మణిమకుటం అని తెలియక-
 ‘ఈవెనింగ్ సిక్స్‌కి’ అని పెట్టేసింది.

‘ఈవెనింగ్స్ సిక్స్‌కేమిటి? అది మీ ఆఫీస్ అయిపోయే టైమ్ కదా. ఎంతకాలంగా సాగుతోంది ఈ భాగోతం’ అంది. ‘అయ్యో. అది మీటింగ్ టైమే. మా బాస్ ఆ టైమ్‌లోనే మీటింగ్ పెడతాడు’ అనంటే వింటేగా. చివరకు ఆ రోజు మీటింగ్‌లో కూచున్నాక ఫోన్ ఆన్ చేసి పెట్టి మా ఆవిడకు మీటింగ్‌లో మా బాస్ ఎలా కామెడీగా కొరుక్కు తింటాడో అర్థం చేయిస్తే తప్ప నన్ను వదల్లేదు.
       
ఒకరోజు ఢిల్లీ మిఠాయివాలా దగ్గర కిలో స్వీట్స్ కొని, సౌతిండియా షాపింగ్‌మాల్‌లో తనకిష్టమైన  నిమ్మకాయరంగు వర్క్‌శారీ కొని తీసుకెళ్లి కానుకగా ఇచ్చి రాత్రి భోజనం అయ్యాక సోఫాలో తన అనుమతితో పక్కన కూచుని మంచి మూడ్‌లో ఉందని కన్ఫమ్ చేసుకున్నాక అడిగాను- నా మీద నీకంత డౌట్ ఎందుకు?
’ఊహూ.. చెప్పను’.
‘మా బంగారం కదూ’
‘ఊహూ...’
‘మా జోస్ అలూకాస్ కదూ’
‘మరీ... మరీ... పెళ్లయిన రాత్రి గదిలోకొచ్చాక- నేను పక్కన కూచుంటే- చనువుగా చేయి పట్టుకున్నారు కదా- అందుకు. మీరెంత ముదుర్లయితే ఒక ఆడపిల్ల చేయి అంత చనువుగా పట్టుకోగలరు చెప్పండి.’.... ‘ఓసి నీ అనుమానం కట్టప్ప తోలుకెళ్ల... అసలే ముప్పయ్యేళ్లకు పెళ్లయ్యింది. అందాకా దారిన పోయే ఏ ఆడపిల్ల చెయ్యి చనువుగా పట్టుకున్నా గుడ్లు పీకి వాసన్‌కూ పళ్లు పీకి పార్థాకు పంపిస్తుంది. ఇన్నాళ్లకు పెళ్లాం వచ్చింది కదా కాదనే ధైర్యం ఎవరికుంది అని చేయి పట్టుకుంటే ఇదా నువ్విచ్చే సర్టిఫికెటు. వేసే ఐ.ఎస్.ఐ బ్రాండు’.... ‘ఏమో. ఎవరు చూడొచ్చారు. మీ మగాళ్లను నమ్మకూడదు’ ఇంత డౌట్ ఉన్నాక ఇక ఏ సిప్లా మందులు పని చేస్తాయి కనక?
       
మా ఆవిడ బంగారం. నేనంటే భలే ఇష్టం. నాతోడిదే జీవితం. కాని ఈ డౌట్ ఉంది చూశారూ... దాంతోనే ప్రాబ్లమ్. స్త్రీ కదా సాటి స్త్రీతోనే విరుగుడు సాధిద్దాం అని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకువెళదామంటే... ససేమిరా ససే సక్కుబాయి... లేడీ డాక్టర్ అయితే మీరు లైనేస్తారు... మగడాక్టర్ దగ్గరకు తీసుకెళ్లండి అంది. రాసిన చాలామందులు గులాబీ పూలకుండి మింగుతూ ఉంది. నా ఫోన్ మీద నిఘా. బయట నుంచి వచ్చాక బట్టలకు అంటిన పెర్‌ఫ్యూమ్‌ల మీద నిఘా. కారులో పొడవైన వెంట్రుకలు ఏమైనా దొరుకుతాయేమోనని కూంబింగ్. ఆధార్ కార్డులో అరవై ఏళ్లు పైబడ్డాయని గవర్నమెంట్ ప్రూఫ్ దొరికితే తప్ప పనిమనిషిగా అపాయింట్‌మెంట్ లెటర్ హాండోవర్ చేయదు.

ఇంత డౌట్ చేసేస్తోంది కదా నిజం చేసేద్దామా అని ఒక్కోసారి అనిపిస్తుంది.
బాబోయ్. అంత ధైర్యమా.
డౌట్‌తో చస్తున్నాను. అనుమానంతో చచ్చిపోనూ?
 - భా.బా (భార్యా బాధితుడు)
 
తా.క: దయచేసి నా ఫోన్ నంబర్ ఇవ్వొద్దని మనవి. నా ఏడుపు నాకుంది. సాటి మగవాళ్ల ఏడుపు వినలేను. సారీ...
 హెల్ప్ ప్లీజ్: ఇది అచ్చయిన రోజు పేపర్ మా ఇంటికి రాకుండా చూడగలరా. కొంచెం భయంగా ఉంది.
 
 

Advertisement
 
Advertisement
 
Advertisement