యంగెస్ట్ హెడ్‌మాస్టర్..! | The youngest Principal.. Ali | Sakshi
Sakshi News home page

యంగెస్ట్ హెడ్‌మాస్టర్..!

Sep 17 2013 11:58 PM | Updated on Sep 1 2017 10:48 PM

యంగెస్ట్ హెడ్‌మాస్టర్..!

యంగెస్ట్ హెడ్‌మాస్టర్..!

నేను ఉన్నత స్థాయికి చేరాక... నా చుట్టూ ఉన్న సమాజాన్ని ఉద్ధరిస్తాను అని చెప్పుకునే వాళ్లు ఉండవచ్చు... నేను వంద కోట్ల రూపాయలు సంపాదించాక

నేను ఉన్నత స్థాయికి చేరాక... నా చుట్టూ ఉన్న సమాజాన్ని ఉద్ధరిస్తాను అని చెప్పుకునే వాళ్లు ఉండవచ్చు... నేను వంద కోట్ల రూపాయలు సంపాదించాక... ప్రపంచానికి కొత్త వన్నెలు తీసుకు వస్తాను అనే వాళ్లూ ఉండవచ్చు. అయితే తను ఉన్న స్థితి నుంచే తన చుట్టూ ఉన్న వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించే వారు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ఒకరు బాబర్ అలీ. 16 ఏళ్ల వయసుకే ఆదర్శవంతుడిగా ఎదిగిన అలీ కథ ఇది...
 
 ఇతడు నివసించేది ఒక మురికివాడ.. చదువుకోవడానికి సరైన సదుపాయాలు లేవు. సదుపాయాల కన్నా ముందు సరైన స్కూల్ లేదు. ఈ పరిస్థితుల్లో బాబర్ తన చదువు మీద శ్రద్ధ పెట్టి బాగా చదువుకొని ఉంటే  ఉన్నతస్థాయికి చేరగలిగేవాడు. అయితే తను ఉన్నతస్థాయికి చేరడం గొప్ప అని భావించలేదు. తను ఉన్న ప్రాంతంలో కొన్ని వందల మంది చిన్నారులు స్కూల్ మొహం తెలియకుండా ఉన్నారనే బాధ అలీని మెలిపెట్టసాగింది. వారందరి కోసం ఒక పరిష్కార మార్గాన్ని కనిపెట్టాడు. 
 
 స్కూల్ నుంచి వచ్చాక టీచర్ అయ్యాడు..
 ప్రైమరీ స్కూల్, హైస్కూల్‌కు వెళ్లే విద్యార్థులు ఇంటికి రాగానే ఆటల మీద పడిపోతారు. తమ స్నేహితులతో కలిసి ఉల్లాసంగా గడపడానికి ప్రాధాన్యతనిస్తారు. అయితే అందరికీ భిన్నంగా అలీ... తాను ఉండే ప్రాంతంలోని కొంత ఖాళీస్థలంలో చదువురాని, చదువు మధ్యలో మానేసిన పిల్లలను చేరదీసి వారికి చదువు చెప్పడం ప్రారంభించాడు. సాయంత్రం నాలుగు గంటలకు బాబర్ అలీ క్లాస్‌లు ప్రారంభం అవుతాయి. ఆరుగంటల వరకూ కొనసాగుతాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు.. అలీ చదువు చెప్పనారంభించిన కొన్నిరోజుల్లోనే విద్యార్థుల సంఖ్య 800కు చేరింది!
 
 అంతమంది ఎక్కడి నుంచి...?
 బాబర్ అలీ స్కూల్‌లో చదివే ఎనిమిది వందల మంది విద్యార్థులూ డ్రాప్ ఔట్సే! కొన్ని రోజులపాటు స్కూల్‌కు వెళ్లి మానేసి గాలి తిరుగుడు తిరిగేవాళ్లు, ఇంట్లో పరిస్థితుల వల్ల బాలకార్మికులుగా మారిన వాళ్లు, పెద్ద పెద్ద వాళ్ల ఇళ్లల్లో పాచిపనిచేసి వచ్చే అమ్మాయిలు.. వీరే అలీ విద్యార్థులు. వారిని పనులు మానుకుని తనతో పాటు స్కూల్‌కు రమ్మని పిలుపునివ్వలేదు అలీ. అది జరిగే పని కాదని అతడికీ తెలుసు. వారికి కనీస విజ్ఞానాన్ని పంచడాన్ని తన బాధ్యతగా తీసుకున్నాడు. తన చుట్టూ ఉన్న సమాజంలో తనకు చేతనైనంత స్థాయిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. 
 
 బీబీసీ కూడా గుర్తించింది...
 ఈవెనింగ్‌స్కూల్‌ను ప్రారంభించిన కొత్తలోనే స్థానికుల నుంచి అలీకి అభినందనలు అందాయి. చేస్తున్న మంచి పనికి అనేకమంది సహకారాన్ని అందించారు. కొన్ని రోజుల్లోనే అలీ పేరు గొప్ప స్థాయికి చేరింది. 2009లో ‘బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ)’ అలీని ‘యంగెస్ట్ హెడ్‌మాస్టర్ ఇన్ ద వరల్ట్’గా గుర్తించి ప్రత్యేక అవార్డును ఇచ్చింది. అదే సంవత్సరం సీఎన్‌ఎన్ -ఐబీఎన్ అలీని ‘రియల్ హీరోస్’ అవార్డ్‌తో సత్కరించింది.  ఆమీర్‌ఖాన్ ‘సత్యమేవ జయతే’లో కూడా అలీ గురించి ప్రస్తావించారు. ఆరేడేళ్లుగా అలీ స్కూల్ రన్ అవుతోంది. అనేకమందికి చదువును బోధిస్తూ, విజ్ఞానాన్ని పంచుతూ సాగుతోంది. బాలకార్మికులుగా మారిన వారికి చదువు చెప్పడం ద్వారా తన స్థాయిలో చిన్నపాటి మార్పునైనా తీసుకురావాలని ప్రయత్నిస్తున్న బాబర్ అలీ కచ్చితంగా ఆదర్శప్రాయుడే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement