పరోపకారార్థం ఇదం శరీరం

Submitting is a paraphrase - Sakshi

కలాం కలలు

ఫ్లారెన్స్‌ నైటింగేల్‌ ఒక సాధారణ నర్సు. దీపం చేత పట్టుకుని వ్యాథిగ్రస్థులు, యుద్ధంలో క్షతగాత్రులయిన వాళ్ళ కోసం రోజుకు 20 గంటలపాటు విరామం లేకుండా సేవ చేసింది. రోగులను ఆమె ఎంతగా ఆత్మీయంగా చూసుకునేదంటే, ఆమె అటుగా వెడుతుంటే అక్కడ పడిన ఆమె నీడను ఆదరణ భావంతో ముద్దాడేవారు. ఆమె సేవ అంతగా మెప్పించేది. ఆ క్రమంలో ఆమె మంచంపట్టింది. ఆ స్థితిలోకూడా ఆమె ‘నోట్స్‌ ఆన్‌ నర్సింగ్‌’ పేరిట ఒక పుస్తకం రాసింది. అది ప్రపంచమంతటా ఆదరణ పొందింది. ఆస్పత్రుల నిర్వహణలో ఈరోజుకూ దానిని ప్రామాణికంగా భావిస్తారు. ఎప్పటి నైటింగేల్‌..!!! ఇప్పటికీ ఆమెను తలచుకుంటున్నాం.

మార్గరెట్‌ ఎలిజబెత్‌ ఎక్కడో పుట్టింది. స్వామీ వివేకానంద ప్రసంగాలకు పరవశించిపోయింది. స్వామి ఆహ్వానంపై భారతదేశానికి వచ్చి ఇక్కడి భాషలు నేర్చుకుంది. చాలా కష్టాలకోర్చి పాఠశాలలు పెట్టి స్త్రీలనెందరినో విద్యావంతులను చేసింది. ‘‘నిన్ను నీవు సమాజానికి నివేదన చేసుకున్నావు. అందుకని నీకు నివేదిత అని పేరు పెడుతున్నా. నిన్ను భారతదేశం సోదరీ, అని గౌరవిస్తుంది’’ అన్నాడు వివేకానందుడు. అలా ఆమె ‘సిస్టర్‌ నివేదిత’ అయింది. చాలా పుస్తకాలు కూడా రాసింది. వాటిమీద లక్షల రూపాయలు రాయల్టీ వస్తాయని తెలిసి కూడా వాటిని రామకష్ణ మిషన్‌కు రాసిచ్చింది. ఎక్కడి ఎలిజబెత్‌ !! కాటన్‌ ఎక్కడి వాడు !! చివరకు అన్నార్తులకు లేదనకుండా ఏళ్ళ తరబడి తల్లిలా ఆకలి తీర్చిన మన డొక్కా సీతమ్మ.... వీళ్ళందరూ ఎవరు !!!....‘‘కులం, మతం, జాతి, ప్రాంతం, భాషవంటి పట్టింపులు’’  ఏవీ లేకుండా ఉపకారం చేయడమే పరమ ధర్మంగా భావించి, అలా జీవించి చరితార్థులయ్యారు. 

అరబిందో జీవితాన్ని చూడండి...స్వాతంత్ర్య సంగ్రామం నాటి రోజుల్లో... ‘ప్రజలను ప్రేరేపిస్తున్నారు’ అనే నేరంకింద ఆయనతోపాటు ఆయన సహచరులను జైళ్ళల్లో పెట్టారు. అవెలా ఉండావో తెలుసా....పడుకోవడానికి, కూర్చోవడానికి కూడా వీలు లేకుండా గదుల్లో గోతులు తవ్వి ఉంచేవారు. నీళ్ళు తాగడానికి అల్యూమినియం పాత్రలు పెడితే ఎండలకు అవి బాగా వేడెక్కి ఉండేవి. దాహం తీరదు. ఒక పింగాణీ పళ్ళెం, ఒక చిన్న పింగాణీ చిప్ప ఇచ్చేవారు. నీళ్ళు ముంచుకుని తాగాలన్నా, కూర వేసుకోవాలన్నా, చేతులు కడుక్కోవాలన్నా, స్నానం, శౌచం అన్నీ వాటితోనే. తారుపూసిన డబ్బాలు కూడా ఇచ్చేవారు. మలమూత్రాలు వాటిలో విసర్జించాలి. రోజుమొత్తం మీద ఒకసారో రెండు సార్లో ఎవరో ఒక వ్యక్తి వచ్చి అవి తీసేస్తాడు. ఆ పక్కరోజు అతనొచ్చేదాకా వాటిలో ఉన్నవి అంతే. ఇదంతా ఒకే గదిలో. ఒక రోజు, వారం కాదు, సంవత్సరాల తరబడి ఆ గదుల్లో అలా మగ్గిన మహనీయులు తీసుకొచ్చి ఇచ్చిన స్వాతంతా్ర్యన్ని  అనుభవిస్తున్నాం. ఇది అనుక్షణం గుర్తుంటే మనకు లంచం, అవినీతి, బంధుప్రీతి వంటి అవలక్షణాలు అబ్బవు. అందుకే జనగణమన పాడేటప్పడు మనం తప్పక గుర్తుంచుకోవలసింది వీరి త్యాగాలను. అలాగే  సర్వసుఖాలను వదులుకుని దేశ సరిహద్దులను తమ కంటికి రెప్పలా కాపాడుతున్న మన సైనికులను కూడా. వీటిని మీరందరూ గుర్తించి మెలగాలన్న ఆర్తితో ఈ జాతి వైభవాన్ని రక్షించే బాధ్యతను కలాం ఈ దేశ విద్యార్థులమీద, యువతీయువకులమీద పెట్టారు.  దానికి అవసరమైన శక్తి వారికి చేకూరాలని నేను  భగవంతుడిని వేడుకుంటున్నాను.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top