
ఈ 2020లో చెవి కుట్లు పెరిగే అవకాశం ఉంది. కొన్నాళ్లుగా నెటిజన్లు శోధించిన అంశాల్లో సౌందర్యానికి సంబంధించి చెవికి ఎన్ని పుడకలు, రింగులు లేదా ఎలాంటి ఆభరణాలు వచ్చాయనే అంశాన్ని అధికంగా శోధించినట్టు గూగుల్, పింటరెస్ట్.. వంటివి ఒక వార్తను విడుదల చేశాయి. ఈ శోధనను గమనించిన ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలు ఈ తరహా ఆభరణాలకు మరింత ప్రాచుర్యం కల్పించడానికి సింగిల్ స్టడ్స్, హూప్స్‌ను డిజైన్ చేస్తున్నాయి. వీటిలో నక్షత్రరాశి రూపాన్ని పోలే ఆభరణాలు ఎక్కువ. ఇలా చెవులకు ఆభరణాలను అలంకరించడానికి ఎక్కువ కుట్లు వేయడం ఆక్యుప్రెజర్‌లో భాగంగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్టు యువత గుర్తిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రత్యేకమైన చెవి ఆక్యుప్రెజర్ పాయింట్ల వద్ద స్టడ్స్ అమర్చుకోవడం వల్ల మైగ్రేన్, ఆందోళన, కొద్దిపాటి ఉదర సమస్యలు తగ్గవచ్చనే భావన వల్ల వీటికి డిమాండ్ పెరిగినట్టు తెలుస్తోంది. గిరిజన జాతుల్లో చెవి చుట్టూత కుట్లు, వాటికి ఆభరణాల వాడకం మనకు తెలిసిందే. బహుశా ఆ స్టైల్ ఇప్పటి తరానికి బాగా నచ్చుతున్నట్టుగా ఉంది.