ప్రతి పది మంది పురుషుల్లో ఒకరింతే..

Study Says One In Ten Men Has Problems Fathering A Child - Sakshi

న్యూయార్క్‌ : పురుషుల్లో సంతాన సాఫల్య సమస్యలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. ప్రతి పది మంది పురుషుల్లో ఒకరు తండ్రి అయ్యేందుకు సమస్యలు ఎదుర్కొంటున్నారని తాజా అథ్యయనం బాంబు పేల్చింది. తక్కువ వీర్యకణాల సంఖ్యతో పెద్దసంఖ్యలో పురుషులు సంతాన లేమితో సతమతమవుతున్నారని పేర్కొంది. ఈ లక్షణం పురుషుల్లో తర్వాతి దశల్లో క్యాన్సర్‌ రిస్క్‌కూ దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

హార్వర్డ్‌ యూనివర్సిటీ చేపట్టిన సర్వేలో రెడ్‌, ప్రాసెస్డ్‌ మాంసాహారం, తీపి పానీయాలు, కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారాన్ని అధికంగా తీసుకునే పురుషుల్లో సగటు వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్నట్టు తేలింది. వీరిలో వీర్యకణాల సంఖ్య సగటు 25.6 మిలియన్లు తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. సహజంగా సంతానోత్పత్తికి వీర్యకణాల సంఖ్య 39 మిలియన్లు ఉండాలని వారు తెలిపారు. మరోవైపు చాలామంది పురుషులు తల్లిగర్భంలో ఉన్నప్పుడే ఈ లోపంతో పుడుతున్నారని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

తల్లి గర్భంలో ఉన్నప్పుడు తొలి నెలల్లోనే శిశువులు తండ్రులుగా మారే అవకాశాలు దెబ్బతింటున్నాయని, వారి పునరుత్పత్తి అవయవాలు ప్రతికూల ప్రభావానికి లోనవుతున్నాయనేందుకు ఆధారాలు లభించాయని చెబుతున్నారు. ఇది వీర్యకణాలు తగ్గడానికే పరిమితం కాదని, వారు వయసు పెరిగేకొద్దీ హృద్రోగాలు, క్యాన్సర్‌ వంటి తీవ్ర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top