పాజిటివ్‌గా ఉంటే ఈ వ్యాధులు దూరం.. | Study Finds Positivity Puts Less Strain On Your Organs | Sakshi
Sakshi News home page

పాజిటివ్‌గా ఉంటే ఈ వ్యాధులు దూరం..

Sep 11 2018 11:47 AM | Updated on Sep 11 2018 11:47 AM

 Study Finds Positivity Puts Less Strain On Your Organs - Sakshi

హాయిగా బతికేస్తే వ్యాధులు దూరం..

లండన్‌ : జీవితాన్ని ఆస్వాదిస్తూ సానుకూల దృక్పథంతో సాగిపోయే వారికి గుండె జబ్బులు, స్ర్టోక్‌ ముప్పు తక్కువని తాజా అథ్యయనంలో వెల్లడైంది. ఆశావహ దృక్పథం ఒత్తిడి హార్మోన్లను, పల్స్‌ రేట్‌, బీపీలను తగ్గిస్తూ నేరుగా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చికాగోకు చెందిన నార్త్‌వెస్ర్టన్‌ యూనివర్సిటీ, హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ పరిశోధకులు చేపట్టిన అథ్యయనం పేర్కొంది. నిత్యం పాజిటివ్‌గా ఆలోచించేవారు సరైన ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తారని, వారు పొగతాగడం, మద్యం తీసుకోవడం అరుదని అథ్యయనంలో గుర్తించారు.

మానసిక దృఢత్వానికి గుండె ఆరోగ్యానికి నేరుగా సంబంధం ఉందని ఈ అథ్యయనంలో స్పష్టంగా వెల్లడైందని పరిశోధకులు పేర్కొన్నారు. మానసిక పరిస్థితితో గుండె జబ్బులకు ప్రత్యక్ష సంబంధం ఉందని అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురితమైన అథ్యయనం వెల్లడించింది. అత్యధిక సానుకూల దృక్పథం ఉన్న వారిలో గుండె జబ్బులతో మరణించే ముప్పు 38 శాతం వరకూ తక్కువగా ఉన్నట్టు అథ్యయనం పేర్కొంది. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరామనే భావన కలిగిన వారిలో స్ర్టోక్‌ ముప్పు తక్కువగా ఉన్నట్టు గుర్తించామని పరిశోధకులు చెప్పారు.

రోగుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కౌన్సెలింగ్‌ నిర్వహించడం, యోగ వంటి రిలాక్సేషన్‌ పద్ధతులను అనుసరించడంపై వైద్యులు దృష్టిసారించాలని కోరారు. అంతా మంచే జరుగుతుందనే ఆశావహ దృక్పథం ఉన్నవారిలో అడ్రినల్‌, కార్టిసోల్‌ వంటి ఒత్తిడి హార్మోన్లు అదుపులో ఉండటం ద్వారా రక్తపోటు పెరిగి గుండెపై భారం పడే పరిస్ధితి ఉండదని పరిశోధకులు పేర్కొన్నారు. ఒత్తిడి తక్కువగా ఉండే వారిలో కొలెస్ర్టాల్‌ లెవెల్స్‌ తక్కువగా ఉంటూ శరీరంలో వాపును నియంత్రిస్తుందని, వ్యాధి నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుందని గుర్తించారు. ఆశావహంగా ఉండే వారి రక్తంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement