రీమేకుకింగ్‌

Story About Remaking Movies By Tollywood Stars - Sakshi

మనుషులంతా ఒక్కటే అయినట్టు ప్రేక్షకులంతా కూడా ఒక్కటే. తమిళంలో అయినా తెలుగులో అయినా నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి. అక్కడ అయినా ఇక్కడ అయినా పొయ్యి వెలిగించే వంట చెయ్యాలి. అక్కడ ఉడికిన కథ ఇక్కడా ఉడుకుతుంది. అందుకే ఇప్పుడు రీమేక్‌ల పాకం పండుతోంది. త్వరలో వడ్డిస్తారు. మెస్‌ టికెట్‌ కొనుక్కోండి. రీమేకుక్స్‌ను కలవండి. 

రైతు కుటుంబం
‘చంటి, చినరాయుడు, సుందరకాండ, అబ్బాయిగారు, ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు, సూర్య వంశం, రాజా’... తెలుగులో హిట్‌గా నిలిచిన ఈ చిత్రాలు తమిళ చిత్రాలకు రీమేక్‌. మన తెలుగులో ఎక్కువగా రీమేక్‌ చిత్రాల్లో నటించిన హీరో ఎవరంటే వెంకటేశ్‌ ముందు వరుసలో ఉంటారు. తాజాగా వెంకీ మరో తమిళ చిత్రం ‘అసురన్‌’ తెలుగు రీమేక్‌లో నటించనున్నారు. ధనుష్‌ హీరోగా వెట్రిమారన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. ఊరికి కాస్త దూరంగా కుటుంబంతో కలిసి హాయిగా ఉంటున్న ఓ రైతు భూమిని ఆ గ్రామంలోని ఓ పెద్ద మనిషి సొంతం చేసుకోవాలనుకుంటాడు. ఆ పెద్దమనిషికి రైతు కుటుంబం ఎలా బుద్ధి చెప్పిందన్నదే ‘అసురన్‌’ కథ.

ముగ్గురమ్మాయిల కథ
అమితాబ్‌ బచ్చన్, తాప్సీ నటించిన హిందీ చిత్రం ‘పింక్‌’ సూపర్‌హిట్‌ సాధించింది. అనిరు«ద్‌ రాయ్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని అజిత్‌తో ‘నేర్కొండ పార్వై’గా తమిళంలో రీమేక్‌ చేశారు బోనీ కపూర్‌. ఇప్పుడు ‘పింక్‌’ని ‘దిల్‌’ రాజుతో కలిసి తెలుగులో రీమేక్‌ చేయనున్నారు బోనీ కపూరే. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించనున్నారు. అమితాబ్‌ పాత్రలో పవన్‌కల్యాణ్‌ నటించనున్నారని టాక్‌. ముగ్గురు అమ్మాయిలు ఓ ‘రాక్‌ కాన్సెర్ట్‌’కు వెళతారు. అక్కడ అబ్బాయిలతో కలిసి మద్యం సేవిస్తారు. ఆ తర్వాత ఈ ముగ్గురు అమ్మాయిలకు బెదిరింపులు మొదలవుతాయి. అకస్మాత్తుగా ఈ ముగ్గురిలో ఒకర్ని హత్యాయత్నం నేరారోపణపై పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. ఈ విషయాలన్నింటినీ గమనిస్తుంటాడు ఓ రిటైర్డ్‌ లాయర్‌. ఈ ముగ్గురు అమ్మాయిలకు ఈ అతను ఎలా సహాయం చేశాడు? ఈ అమ్మాయిలపై పోలీసులకు ఫిర్యాదు చేసిందెవరు? అనే అంశాల సమాహారమే ‘పింక్‌’ కథ.

పోలీస్‌ వర్సెస్‌ గ్యాంగ్‌స్టర్‌
విజయ్‌ సేతుపతి, మాధవన్‌ ప్రధాన పాత్రధారులుగా తమిళంలో మంచి విజయం సాధించిన చిత్రం ‘విక్రమ్‌ వేదా’. దర్శక ద్వయం పుష్కర్‌–గాయత్రి  తెరకెక్కించారు. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం తెలుగు రీమేక్‌ తెరకెక్కనుందని సమాచారం. ఒక హీరోగా రవితేజ నటిస్తారు. మరో హీరో ఫైనలైజ్‌ కావాల్సి ఉందని తెలిసింది. ఇక ‘విక్రమ్‌ వేదా’ కథ విషయానికి వస్తే... ఓ ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుకు, గ్యాంగ్‌స్టర్‌కు మధ్య జరిగే మైండ్‌ గేమే ఈ చిత్రం. పోలీసులు ప్లాన్‌ చేసిన ఓ ఎన్‌కౌంటర్‌ వీరిద్దరి జీవితాలను ఎలా ప్రభావితం చేసిందన్నదే కథ.

సొంత పరిశోధన
క్రైమ్‌ డిపార్ట్‌మెంట్‌కు మారాలనుకున్న ఓ యువ ట్రాఫిక్‌ పోలీసాఫీసర్‌ ఓ క్రైమ్‌ కేసుపై ఆసక్తి పెంచుకుని పై అధికారులకు తెలియకుండా పరిశోధన మొదలు పెడతాడు. చివరికి ఈ కేసు గురించి అతనికి తెలిసిన నిజాలు ఏంటి? ఈ యువ పోలీసాఫీసర్‌కు ఓ రిటైర్డ్‌ పోలీసాఫీసర్, ఓ పాత్రికేయుడు ఎలా సహాయం చేశారు? అన్నదే కన్నడ మూవీ ‘కవలుదారి’(2019) కథాంశం. ఇందులో అనంతనాగ్‌ హీరోగా నటించారు. ఈ సినిమా తెలుగు రీమేక్‌లో సుమంత్‌ హీరోగా నటిస్తారు. ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తారు.

ఛాలెంజ్‌
దాదాపు రెండేళ్ల క్రితం విడుదలైన కన్నడ చిత్రం ‘కాలేజ్‌ కుమార్‌’కు మంచి ప్రేక్షకాదరణ దక్కింది. తండ్రీ కొడుకుల చాలెంజే ఈ సినిమా కథ. ప్యూన్‌గా పని చేసే ఓ తండ్రి తన కొడుకుని పెద్ద స్థాయి ఉద్యోగిగా చూడాలనుకుంటాడు. కానీ కొడుకేమో పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తున్నట్లు దొంగ ఆధారాలు చూపిస్తుంటాడు. ఓ రోజు తండ్రికి నిజం తెలుస్తుంది. ఆ సమయంలో ఒకరికొకరు సవాల్‌ విసురుకుంటారు. ఈ సినిమా ‘కాలేజ్‌ కుమార్‌’ టైటిల్‌తోనే తెలుగులో రీమేక్‌ అవుతోంది. మాతృకకు దర్శకత్వం వహించిన హరి సంతోషే తెలుగుకూ దర్శకత్వం వహిస్తున్నారు. రాహుల్‌ విజయ్‌ హీరోగా నటిస్తున్నారు. తండ్రి పాత్రను ప్రభు చేస్తారని తెలిసింది.

ముక్కుసూటితనం
తెలుగులో కృష్ణవంశీ డైరెక్షన్‌ స్టైల్‌కు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. గతంలో ఆయన తెరకెకెక్కించిన ‘నిన్నేపెళ్లాడతా, సిందూరం, అంతఃపురం, ఖడ్గం, చందమామ’ చిత్రాలు సాధించిన విజయాలు అలాంటివి. తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్‌’కి రీమేక్‌ ఇది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించనున్నారు. ముక్కుసూటి మనస్తత్వం ఉన్న ఓ సీనియర్‌ థియేటర్‌ ఆర్టిస్టు జీవితంలోని ఎత్తుపల్లాల సంఘటనల సమాహారమే ‘నట సామ్రాట్‌’. మరాఠీ నటసామ్రాట్‌గా నానా పటేకర్‌ అభినయించారు. తెలుగు రీమేక్‌లో రమ్యకృష్ణ, ప్రకాశ్‌ రాజ్‌ నటించనున్నారు.

ప్రతీకారం
‘కేరాఫ్‌ కంచెరపాలెం’ వంటి భిన్నమైన ప్రయత్నంతో దర్శకుడిగా మంచి మార్కులు వేయించుకున్నారు వెంకటేష్‌ మహా. ఇప్పుడు జాతీయ అవార్డు సాధించిన మలయాళ హిట్‌ ‘మహేషింటే ప్రతీకారం’ చిత్రాన్ని వెంకటేష్‌ మహా తెలుగులో రీమేక్‌ చేస్తున్నారని తెలిసింది. మలయాళంలో ఫాహద్‌ ఫాజల్‌ పోషించిన పాత్రను తెలుగులో సత్యదేవ్‌ చేస్తున్నారు. ఊరందరి ముందు జరిగే ఓ కోట్లాటలో ఓ ఫొటోగ్రాఫర్‌ ఓడిపోతాడు. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు ఆ ఫొటోగ్రాఫర్‌. తాను ఓడిపోయిన వ్యక్తి చేతిలో తిరిగి గెలిచేంత వరకు చెప్పులు వేసుకోనని శపథం చేస్తాడు. ఆ ఫొటోగ్రాఫర్‌ శపథంతో పాటు, ఓ అమ్మాయి మనసును కూడా ఎలా గెల్చుకున్నాడు అన్న అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుంది.
– శివాంజనేయులు ముసిమి

ఆన్‌ ద వే
రాజకీయ వారసత్వ నేపథ్యంలో సాగే మలయాళ హిట్‌ ‘లూసిఫర్‌’ సినిమా తెలుగు రీమేక్స్‌ హక్కులను దక్కించుకున్నారు రామ్‌చరణ్‌. ‘లూసిఫర్‌’లో మోహన్‌లాల్‌ చేసిన పాత్రలో చిరంజీవి నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక బాలీవుడ్‌లో అజయ్‌దేవగన్‌ నటించిన ‘దే దే ప్యార్‌దే’ తెలుగు హక్కులను డి. సురేష్‌బాబు దక్కించుకున్నారు. ఈ సినిమా తెలుగు రీమేక్‌లో వెంకటేశ్‌ నటిస్తారట. పెళ్లైన తర్వాత భార్య ఉండగానే ఓ యువతి ప్రేమ కోసం తాపత్రయపడే మధ్య వయస్కుడి కథే ఈ చిత్రం. బాలీవుడ్‌ యువనటుడు ఆయుష్మాన్‌ ఖురానా నటించిన హిందీ చిత్రం ‘బదాయి హో’ బాక్సాఫీస్‌ వద్ద బంపర్‌ కలెక్షన్స్‌ను రాబట్టింది. తెలుగులో ఈ చిత్రాన్ని బోనీ కపూర్, ‘దిల్‌’ రాజు నిర్మించనున్నారు. ఓ ఉమ్మడి కుటుంబంలో పెళ్లి కావాల్సిన కొడుకు ఉన్న ఓ తల్లి మరో బిడ్డకు జన్మనివ్వబోతోందని తెలుస్తుంది. అప్పుడు ఆ కొడుకుని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి ఏ షరతులు పెట్టింది... అన్నదే ‘బదాయి హో’ కథాంశం. ఇంకా... తమిళంలో విజయ్‌ నటించిన ‘తేరీ’, మలయాళ హిట్‌ ‘ఇష్క్‌’ చిత్రాలు తెలుగులో రీమేక్‌ కానున్నాయని సమాచారం.

చిరంజీవి

రిలీజ్‌కి సిద్ధం
తమిళ హిట్‌ ‘96’ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు తెలుగులో రీమేక్‌ చేశారు. శర్వానంద్, సమంత నటించిన ఈ సినిమా రిలీజ్‌కు ముస్తాబవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. మరో తమిళ చిత్రం ‘కణితన్‌’ తెలుగులో ‘అర్జున్‌ సురవరం’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిఖిల్‌ నటించారు. ఈ నెల 29న ఈ చిత్రం విడుదల కానుంది. హిందీలో కంగనా రనౌత్‌ నటించిన ‘క్వీన్‌’ చిత్రం తెలుగు రీమేక్‌ ‘దటీజ్‌ మహాలక్ష్మీ’లో తమన్నా నటించారు. ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అయింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top