భక్తపరాధీనుడు

The sri lord venkateswara  is spiritual - Sakshi

ఆత్మీయం

ఏడుకొండలవాడు, ఆశ్రిత వత్సలుడు, కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి మూలవిరాట్టును గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు. ఎందుకో తెలుసా? దీని వెనుక ఓ వృత్తాంతం ఉంది. స్వామి అలంకరణ కోసం పుష్పనందన వనాన్ని పెంచాలని రామానుజాచార్యులవారు తన శిష్యుడు అనంతాళ్వార్‌ను ఆదేశించారు. ఈ పనిలో అనంతాళ్వార్‌ సతీమణి కూడా పాలుపంచుకుంది. గర్భవతిగా ఉన్న ఆమె తవ్విన మట్టిని గంపలో తీసుకెళుతూ అలసి కింద పడిపోతుంది. దీన్ని గుర్తించిన శ్రీనివాసుడు బాలుని రూపంలో ఆమెకు సాయపడతాడు. దైవకార్యంలో ఇతరులెవరూ జోక్యం చేసుకోకూడదంటూ ఆ బాలుడిని అనంతాళ్వార్‌ కొడతాడు. గడ్డంపై దెబ్బ తగలడంతో బాలుడు అదృశ్యమైపోతాడు.

తర్వాత అనంతాళ్వార్‌ ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించు కుంటాడు. గడ్డంపై నుండి రక్తం కారడం చూసిన అనంతాళ్వార్, ఆ బాలుడు శ్రీహరేనని గ్రహించి, రక్తం కారకుండా పచ్చకర్పూరం పెడతాడు. అందుకే నేటికీ మూలవిరాట్‌ గడ్డం కింద పచ్చకర్పూరం పెడుతున్నారు. భగవంతుడు భక్తుల కోసం పడరాని పాట్లు పడ్డాడు. పడుతుంటాడు. తన్నులు, తాపులు తిన్నాడు. భక్తి ప్రేమపాశానికి బద్ధుడై పూదోటలో బందీగా ఉన్నాడు. పప్పు రుబ్బాడు. పిండి విసిరాడు. ఎన్నో చేశాడు. భక్తులు చేయవలసిందల్లా భగవంతుణ్ని మనస్పూర్తిగా ప్రేమించడమే.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top