వరాల స్వామి

 special  story to  Sri Vishnu Adiwarahamurti temple

పుణ్య తీర్థం

దశావతారాల్లో ఆదివరాహావతారం సుప్రసిద్ధమైనది. జలప్రళయంలో చిక్కుకున్న భూమండలాన్ని శ్రీ మహావిష్ణువు ఆదివరాహమూర్తిగా అవతరించి, తన కోరలపై భూగోళాన్ని నిలిపినట్లు పురాణ  కథనం.  తిరుమలలో తొలిపూజలు ఆదివరాహమూర్తికేనన్న విషయం అందరికీ తెలిసిందే. క్షేత్రపాలకుడైన ఆదివరాహమూర్తిని దర్శించుకుని, అర్చనలు చేసుకున్న తర్వాతనే కలియుగదైవాన్ని దర్శించుకోవాలని, లేదంటే తనను దర్శించుకున్న ఫలితం దక్కదని సాక్షాత్తూ శ్రీనివాసుడే ఆదివరాహమూర్తికి ఒప్పంద పత్రం రాసి ఇచ్చిన ఉదంతమూ మనకు వేంకటేశ్వర మహాత్మ్యంలో కనిపిస్తుంది. అయితే ఆదివరాహమూర్తి ఆలయాలు కేవలం రెండే ఉన్నాయి. తిరుమల తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని కరీనంగర్‌ జిల్లా కమాన్‌పూర్‌ మండలంలో మరో ఆది వరాహమూర్తి ఆలయం ఉంది. అరుదైన ఈ ఆలయ విశేషాలు...

స్థలపురాణం ప్రకారం 600 సంవత్సరాల క్రితం ఒక మహర్షి ఆది వరాహమూర్తి దర్శనం కోసం తపస్సు చేశాడు. ఆయన కలలో ఆది వరాహస్వామి ప్రత్యక్షం అయి, దర్శనమిచ్చాడు. మహర్షి కోరిక మేరకు ఒక చిన్న బండరాతిపైన శ్రీ మహావిష్ణువు ఆది వరాహమూర్తిగా వెలిశాడు. అయితే, ఈ విషయం ఎవరికీ తెలియక పోవడంతో క్రమేణా విగ్రహం మరుగున పడింది. ఇటీవల అంటే దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం తవ్వకాలలో స్వామి వారి విగ్రహం బయట పడడంతో ఆ మూర్తిని అక్కడే ప్రతిష్ఠించి, ఆదివరాహమూర్తిగా పూజించడం ప్రాంభించారు. ఇక్కడ స్వామి వారిని భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్న వారి కోరికలు తీరుతుండడంతో అందరూ కూడా స్వామిని వరాల స్వామిగా కొలుస్తున్నారు. గతంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సింగరేణి సంస్థ ఆలయానికి సమీపంలో బుల్‌డోజర్లతో భూమిని చదును చేస్తుండగా బుల్‌డోజర్‌ ముందుకు కదలనంటూ మొరాయించింది. ఎందుకిలా జరిగిందంటూ అక్కడ పరిశీలించగా ఒక బండరాయి మీద స్వామివారి పాదముద్రలు ప్రత్యక్షమయ్యాయి. అక్కడినుంచి ఆలయం వరకూ స్వామివారు నడచి వస్తున్నట్లుగా పాదముద్రలు కనిపించడంతో మరింత భక్తిశ్రద్ధలతో పూజించడం ప్రారంభించారు భక్తులు.

ఒక భక్తుడు తాను కోరుకున్న కోరికలు నెరవేరితే మందిరం నిర్మిస్తానని గత పది సంవత్సరాల క్రితం స్వామివారికి మొక్కుకున్నాడు. స్వామివారి కరుణతో అతను అనుకున్న పనులన్నీ సవ్యంగా జరగడంతో మందిర నిర్మాణానికి పూనుకున్నాడా భక్తుడు. ఇంతలో ఆ భక్తుని కలలో స్వామివారు కనిపించి, తనకు ఏ విధమైన మందిరంగానీ, గోపురం గానీ నిర్మించవద్దని, తాను భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఎల్లవేళలా వారికి తన దర్శనభాగ్యం కల్పిస్తూ, అక్కడే ఉంటానని చెప్పడంతో మందిర నిర్మాణాన్ని మానుకున్నాడు భక్తుడు.

ఇంతింతై వటుడింతై...
జిల్లాకు తూర్పుదిశగా ఒక బండరాతి మీద చిన్న ఎలుక పరిమాణంలో తొలుత భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు, తర్వాత క్రమేణా పెరగడం ప్రారంభించి, రెండు అడుగుల కన్నా పెద్దగా పెరిగారు. ఈ బండపై కొలువు తీరిన విగ్రహంపై రోమాలు కూడా కనిపించడం విశేషం. స్వామివారికి నిత్యం పూజలు, అభిషేకాలు, అర్చనల జరుగుతుంటాయి.  

ఎలా వెళ్లాలి?
కరీంనగర్‌ నుంచి గోదావరిఖనికి వెళ్లే బస్సులు కమాన్‌పూర్‌ మీదుగానే వెళ్తాయి. కమాన్‌పూర్‌ వెళ్తే, స్వామి వారి ఆలయానికి కాలనడకన చేరుకోవచ్చు. లేదంటే ఆటోలు ఉన్నాయి. గోదావరి ఖని నుంచి పెద్దపల్లికి వెళ్లే బస్సులు కమాన్‌ పూర్‌ మీదుగానే వెళ్తాయి.  కమాన్‌పూర్‌కి దగ్గరగా ఉన్న రైల్వేస్టేషన్‌ పెద్దపల్లి. అక్కడినుంచి కమాన్‌పూర్‌కు బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి.
- డి.వి.ఆర్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top