పాటకు నన్ను అంటు కట్టారు

Special Story on Social Meda Star Singer Baby - Sakshi

గురు కోటి

బేబీ గురువు సంగీత దర్శకుడు కోటి

చీరలకు గంజి పెట్టి, ఆరేస్తూ, మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటూ, మనసు హాయిగా ఉండటం కోసం కూనిరాగాలు తీస్తున్న బేబీని సెల్‌ఫోనులో బంధించి, సోషల్‌ మీడియాలో ఉంచితే, ఆ వీడియో బేబీని త్రసీమకు పరిచయం చేసింది.  సింగర్‌ రఘు కుంచె ఆ పల్లెకోయిల మీద లక్ష్మీభూపాలతో ఒక పాట రాయించి, ఆ పాటను చిత్రీకరించి యూట్యూబ్‌లో ఉంచారు. ఆ పాటకు పాతిక లక్షలకు పైగా వ్యూస్‌ చ్చాయి. ఇప్పుడు ‘పలాస’ చిత్రంతో తొలిసారిగా నేపథ్యగాయనిగా గళం విప్పిన ఈ పల్లె కోయిల పసల బేబీ మదిలోని రాగాలివి.

‘పలాస’ సినిమా కోసం బాలు గారితో గొంతు కలిపే అవకాశం రావడం నాకు దొరికిన అదృష్టం. పెద్ద పండుగ. ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ అదృష్టం దక్కుతుంది. ఈ పాట ముందర నాతో విడిగా పాడించారు. నేను పాడుతున్నప్పుడు నాతో బాలుగారు పాడుతున్న విషయం నాకు తెలియదు. ట్రాక్‌ కోసం నేను రఘుగారు కలిసి పాడాం. బాలుగారితో నేను పాడుతున్నానని చెప్పడానికి రఘు గారు సంశయించారు. పాట పూర్తయిపోయింది. ఆయన దగ్గరకువెళ్లి ఈ పాట వినిపించగానే, నా గొంతు విని ‘ఎవరు పాడారు?’ అని ఆయన అడిగారట. రఘుగారు నా పేరు చెప్పారట. ప్రొఫెషనల్‌గా పాడానని బాలుగారు దీవించారట. పల్లెపాటల అమ్మాయితో పాడటం తనకు సంతోషంగా ఉందని కూడా బాలుగారు అన్నారట. చదువు, సంధ్య, సంగీత జ్ఞానం లేని నాకు బాలుగారితో పాడే వరం లభించింది. ఇందుకు ముందుగా నేను కోటి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

శత ‘కోటి’ వందనాలు
‘మట్టిమనిషినండి నేను’.. అనే పాటనే లక్ష్మీభూపాలగారితో రాయించి, రఘు కుంచెగారు ట్యూన్‌ చేసి, నా మీద షూటింగ్‌ చేసి నాతో పాడించి, నన్ను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయనకు శతకోటి దనాలు. పాటకు నన్ను అంటు కట్టారు. నన్నొక మొక్కలా నాటి, నీళ్లు పోసినందుకు ఆయన ఋణం తీర్చుకోలేను. ఇటీవలే ‘రాణు మోండల్‌’ అనే బెంగాలీ యాచకురాలు  రైల్వే ప్లాట్‌ ఫామ్‌ మీద పాడిన షోర్‌ చిత్రంలోని ‘ఏక్‌ ప్యార్‌ క నగ్మా హై’ పాటతో ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్నారు. నాకూ అవకాశాలు వస్తే్త మరింత బాగా పాడి, మరింతమందికి చేరువ కావాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఒక విషయం. కోటిగారు నన్ను హైదరాబాద్‌ రప్పించి, పెద్దపెద్దవాళ్లందరికీ నన్ను పరిచయం చేశారు. అంతవరకు నాకు హైదరాబాద్‌ అంటేనే తెలియదు. ఇక్కడితో ఆగకుండా నన్ను దుబాయ్‌ కూడా తీసుకువెళ్లారు. విమానం ఎలా ఎక్కాలో కూడా నాకు తెలియదు. అక్కడ కదిలే మెట్లు ఎక్కుతున్నప్పుడు నేను పడిపోతుంటే, ఆయన చెయ్యి ఇచ్చి నాకు అండగా నిలిచారు. పల్లెటూరి వాళ్లం కదా! మాకు అభిమానాలు ఎక్కువ ఉంటాయి. ఎవరైనా మాట్లాడకపోయినా కూడా చాలా బాధ పడతాం. కోటిగారు నాకు ఎన్నో పాటలు పంపుతున్నారు, నేను పాడి వాటిని ఆయనకు పంపితే, ఆయన తప్పులు సరిచేస్తున్నారు. ఇప్పుడు మరింత  బాగా పాడేందుకు ప్రయత్నిస్తున్నాను. 

రాసుకుని సాధన చేస్తున్నాను
ఎవరు ఏ పాట అడిగితే ఆ పాట బాగా సాధన  చేసి వేదికల మీద పాడుతున్నాను. కోటిగారి సలహా మీద తెలుగు బాగా చదవగలుగుతున్నాను. ప్రతి పాట రాసుకుని చదువుతూ పాడుతున్నాను. నేను వందేళ్లు బతక్కపోయినా పరవాలేదు,  ఒక మంచి పాట పాడి నాలోని గాయకురాలిని చిరస్మరణీయం చేయాలన్నదే నా కోరిక. ‘తీపి రాగాల తోటి మా ఊరు దాటి మీ కోసమొచ్చాను. యాతమేసి తోడాను నాలో ఉన్న రాగాలను’ నన్ను సినిమా పరిశ్రమ అక్కున చేర్చుకుని, నా చేత ఇంకా ఇంకా తోడించమని అర్థిస్తున్నాను.


అందరూ ప్రోత్సహించాలి...

బేబీ గాత్రంలో పలికే గమకాల వల్ల ఆవిడ ఏ పాట పాడినా చక్కగా ఉంటోంది. అది దేవుడు ఇచ్చిన వరం. రఘు కుంచె పాడించిన మొదటి పాట బాగా హిట్‌ అయింది. ఆవిడను సినీ పరిశ్రమలోని సంగీత దర్శకులు పాడించి, ప్రోత్సహించి పెద్ద స్థాయికి తీసుకురావాలన్నదే నా కోరిక. ఆవిడ చదువుకోలేదు, చిన్నతనం నుంచి పాటలు పాడిన జ్ఞానమే ఆవిడను ఈ స్థాయికి తీసుకు వచ్చింది. ఆవిడకు నేను అక్షరాభ్యాసం చేశాను. ఒక టీచర్‌ ని పెట్టి అక్షరాలు నేర్పిస్తున్నాను. నాన్నగారి (సాలూరి రాజేశ్వరరావు) పాటల లింకులు పంపిస్తుంటే అన్నీ బాగా నేర్చుకుని పాడుతున్నారు. దోషాలు ఉంటే సరిచేస్తున్నాను. బాగా సాధన చేసి వేదికల మీద పాడుతున్నారు.  
– కోటి, సంగీత దర్శకులు

– వైజయంతి పురాణపండ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top