గిర్‌జన శివంగి

Special story to raseela - Sakshi

చిరుతో, సింహమో గ్రామాల్లోకి వచ్చినప్పుడు రసీలాకు ఫోన్‌ వెళుతుంది.అప్పుడామెకు రెండు పనులు పడతాయి. ఆ మృగం నుంచి మనుషులనుకాపాడ్డం. మనుషుల నుంచి ఆ మృగాన్ని కాపాడ్డం. గిర్‌ ఫారెస్ట్‌లో రెస్క్యూ టీమ్‌ గార్డ్‌ రిసీలా. ఒక ఆడపిల్ల అంత పెద్ద అభయారణ్యంలో ఎలా డ్యూటీ చేయగలుగుతోంది. అదీ.. ఓ తల్లిలా, అడవితల్లిలా?! చదవండి.

2013 గుజరాత్‌లోని జూనాగడ్‌ జిల్లాలోని జలొందర్‌ అనే పల్లె గోలగోలగా లేచింది. దానికి కారణం ఊళ్లో చిరుతపులి ప్రవేశించింది. అది అటు వెళ్లి ఇటు వెళ్లి ఏకంగా బావిలో పడింది. ఆ బావి నుంచి దానిని ఎలా బయటకు తీయాలో తెలియదు. బయటకు తీస్తే ఏమవుతుందో తెలియదు. వెంటనే ఫోన్‌ గిర్‌ అభయారణ్యంలోని రెస్క్యూ టీమ్‌కు వెళ్లింది. ఆ ఫోన్‌ అందుకున్నది రసిలా వాధేర్‌. ఇలాంటి సందర్భాలు తరచూ వస్తాయనే ఆ రెస్క్యూ టీమ్‌ ఇరవై నాలుగ్గంటలూ పని చేస్తుంటుంది. రసిలా వెంటనే తన నలుగురు జవాన్లతో చిరుత ఉన్న ప్రాంతానికి వెళ్లింది. అసలే చిన్న గ్రామం. పైగా అంత అవగాహన లేని జనం. వారిని కంట్రోల్‌ చేయాలి. చిరుతలోకి మత్తు తూటాను దింపాలి. ఆ తర్వాత దానిని పట్టుకోవాలి. ఏ మాత్రం తేడా జరిగినా జనం చిరుతను చంపేస్తారు. మనిషి ప్రాణం గొప్పదే కాని చిరుత ప్రాణం కూడా గొప్పదే అని రెస్క్యూ టీమ్‌ నేర్చుకునే మొదటి పాఠం. అందుకే రసిలా చిరుత ప్రాణం పోకుండా దానికి మత్తు అందేలా చేసి బోనులో వేసుకొని తిరిగి గిర్‌ అభయారణ్యంలో వదిలిపెట్టింది. అందరూ రసిలాను అభినందించారు. రసిలాకు దక్కిన అభినందనలు లెక్కపెట్టుకుంటే అవి వెయ్యిగా తేలుతాయి. అవును 2007లో గిర్‌ అభయారణ్యం రెస్క్యూ టీమ్‌లో మొదటి మహిళా గార్డ్‌గా చేరినప్పటి నుంచి ఆమె ఇప్పటివరకూ విజయవంతంగా వేయి సందర్భాలలో ప్రాణులను రక్షించింది. వాటిని తిరిగి ప్రాణాలతో అడవిలో వదిలిపెట్టింది. ఆ ప్రాణులలో సింహాలు ఉన్నాయి. చిరుతలు ఉన్నాయి. అడవి దున్నలు ఉన్నాయి. కొండ చిలువలు ఉన్నాయి.  దాదాపు 1400 చదరపు కిలోమీటర్లు ఉంటుంది గిర్‌ అభయారణ్యం. నిత్యం ఏదో ఒక జంతువుకు ఏదో ఒక సంకటం ఎదురవుతూనే ఉంటుంది. వాటిని కనిపెట్టుకొని ఉండేది విమెన్‌ రెస్క్యూ టీమ్‌. ఆ టీమ్‌కు హెడ్‌ రసిలా.

బతుకే సాహసం
రసిలాది జూనాగడ్‌లోని భండోరి అనే చిన్న గ్రామం. తండ్రి చిన్న వయసులోనే చనిపోయాడు. ఇద్దరు సంతానంలో రసిలా పెద్దది. ఆమె తర్వాత తమ్ముడు. తల్లి కూలి పని చేసి ఇద్దరు పిల్లలను చదివించుకుంది. డిగ్రీ పూర్తి చేస్తున్నప్పుడే తల్లిపడే కష్టం చూసి ‘ఈ చదువేదో పూర్తయిన వెంటనే ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి’ అని నిశ్చయించుకుంది రసిలా. 21 ఏళ్లు వచ్చినా ఏ ఉద్యోగమూ దొరకలేదు. అప్పుడు, అంటే 2007లో గుజరాత్‌ ప్రభుత్వం గిర్‌ అభయారణ్యంలో రెస్క్యూ టీమ్‌లో మొదటిసారిగా స్త్రీలకు కూడా అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించింది. అసలే అడవి. దానికి తోడు సింహాలు. నిత్యం ప్రమాదాలు. మగవాళ్లే భయపడే ఆ పనికి ఆడవాళ్లు ఎవరు వస్తారు? కాని రసిలా ఆ ప్రకటన చూసి వెంటనే స్పందించింది. జీవించి ఉండటమే పెద్ద సాహసమైన కుటుంబ పరిస్థితుల్లో పులులతో సింహాలతో మనుగడ సాధించడం పెద్ద సాహసం కాదు అని అప్లికేషన్‌ పెట్టింది. దేహ దారుఢ్య పరీక్ష, రిటన్‌ టెస్టూ, ఇంటర్వ్యూ పాసయ్యి 2008లో రెస్క్యూ టీమ్‌లో మొదటి మహిళా గార్డ్‌ అయ్యింది.

ఆరంభంలో అన్నీ అడ్డంకులే
రసిలా ఉద్యోగంలో చేరనైతే చేరింది గాని ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న మగవాళ్లు ఆమెను చిన్న పిల్లలాగా ఆడపిల్లలాగా ట్రీట్‌ చేయడం మొదలుపెట్టారు. నీకెందుకు... అడ్మినిస్ట్రేషన్‌ పని చూసుకో... ఆఫీసులో కూర్చుని ఉండు... అడవిలోకి వెళ్లడం రిస్క్‌ అన్నట్టుగా వ్యవహరించేవారు. కాని రసిలా తన సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం కోసం ఎదురు చూసేది. గిర్‌ అభయారణ్యంలో ఉన్న సింహాలు ఒక్కోసారి దారితప్పి ఊళ్లల్లోకి ప్రవేశించడం మామూలే. అవి గాయపడి ఉన్నట్టయితే ఇంకా తిక్కగా వ్యవహరిస్తాయి. ఒకసారి భావనగర్‌ జిల్లాలోని దెదాకడీ ప్రాంతంలో ఒక ఆడ సింహం గాయపడి తిరుగుతున్నట్టుగా రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందింది. ఆ సింహం చాలా వెర్రెత్తి ఉందని, శక్తి లేకపోయినా గాయపరచడానికి ప్రయత్నిస్తోందని గ్రామస్తులు చెప్పారు. ఆ టైమ్‌కు రసిలా డ్యూటీలో ఉంది. తోటి సభ్యులను తీసుకొని తానే ఆపరేషన్‌లోకి దిగింది. ఆ రాత్రంతా ఎంతో ఓపికతో సింహాన్ని గుర్తించి, దానికి మత్తు ఇచ్చి పట్టుకుంది. అప్పుడు అధికారులకు రసిలా మీద నమ్మకం కుదిరింది. ఎక్కడి నుంచి ఫోన్‌ వచ్చినా రసిలాను పంపడం మొదలెట్టారు. రెస్క్యూ టీమ్‌కు గౌరవం ఎప్పుడు వస్తుందంటే ప్రమాదంలో ఉన్న ప్రాణిని ప్రాణాలతో పట్టుకున్నప్పుడే. అవి చనిపోకుండా, గ్రామస్తులు చంపకుండా కాపాడి తీసుకురావడంలోనే రెస్క్యూ టీమ్‌ సక్సెస్‌ ఉంది. ఆ విధంగా చూస్తే నా సక్సెస్‌ రేట్‌ వంద శాతం అంటుంది రసిలా. అందుకే అధికారులు ఆమె ఒక నక్షత్రం ఉన్న యూనిఫామ్‌తో ఉద్యోగంలో చేరితే ఇప్పుడు ఆమె భుజాల మీద మూడు నక్షత్రాలు ఉన్న యూనిఫామ్‌కు ప్రమోట్‌ చేశారు. 

కొనసాగింపు
రసిలా ఈ ఉద్యోగంలో చేరి సఫలం అయ్యాక గిర్‌ అభయారణ్యంలో స్త్రీలను ప్రోత్సహించాలని డిపార్ట్‌మెంట్‌కు కూడా అనిపించింది. క్రమంగా నియామకాలు జరిగాయి. ఇప్పుడు గిర్‌ అభయారణ్యంలో 150 మంది మహిళా గార్డులు పని చేస్తున్నారు. రోజూ టీమ్‌లు మారి వీళ్లు మోటర్‌ సైకిళ్ల మీద, జీపులలో అభయారణ్యం అంతా తిరుగుతుంటారు. సాటి జంతువు దాడి వల్ల గాయపడ్డ జంతువులకు, గోతులలో గుంతలలోపడ్డ జంతువులకు లేదా రైలు పట్టాలు దాటుతూ రైలు ఢీ కొట్టిన జంతువులకు, తల్లి దూరమయ్యి బిక్కుబిక్కుమంటున్న పిల్లలకు వీరంతా సేవలు చేస్తుంటారు. గిర్‌ అభయారణ్యంలో 109 సింహాలు, 201 శివంగులు, 213 సింహపు పిల్లలు ఉన్నాయి. వాటికి నిత్యం ఏదో ఒక సహాయం అందాల్సి ఉంటుంది. ఇవి కాకుండా నాలుగు వందల చిరుతలు ఉన్నాయి. మొసళ్లు లెక్కలేనన్ని. జింకలు, కృష్ణ జింకలు, అడవి దున్నలు, దుప్పులు, ముంగీసలు, ఉడుము... ఇవన్నీ గిర్‌ ప్రత్యేకం. లెక్కలేనన్ని పక్షులు ఉన్నాయి. వృక్ష జాతులు ఉన్నాయి. వీటన్నింటినీ తల్లుల వలే కాపాడుకునే దళమే ఈ మహిళా దళం.

వేసవి సవాల్‌
మిగిలిన సీజన్ల కన్నా వేసవి కాలంలో మాకు ఎక్కువ వత్తిడి ఉంటుంది అంటుంది రసిలా. వేసవి కాలంలో గిర్‌లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఐదు ఉపనదులు ఈ అభయారణ్యంలో ఉన్నా అవి వొట్టి పోతుంటాయి. నీటి జాడ కరువైనప్పుడు జంతువుల కదలిక పెరుగుతుంది. వాటి అవసరాలు రెస్క్య టీమ్‌ చూసుకోవాల్సి వస్తుంది. ‘అదొక్కటే కాదు. వేసవిలో టూరిస్ట్‌లు వస్తారు. ప్రతి జీప్‌కు ఒక గార్డ్‌ రక్షణ కోసం ఉండాలి. మా టీమ్‌ సభ్యులే ఆ పని చేస్తారు’ అంటుంది రసిలా. ‘క్రూర మృగాలతో మీకు భయం వేయదా’ అని అడిగితే ‘ఎదుటివారు హాని తలపెడతారు అనిపించినప్పుడే అవి అటాక్‌ చేస్తాయి. లేకపోతే ఏమీ చేయవు’ అంటుంది రసిలా. రసిలాకు రెండు ఇళ్లున్నాయి. ఒకటి నివసించే చోటు. రెండు అడవి. ఈ ఉద్యోగంలో ఉంటూనే రసిలా పెళ్లి చేసుకుంది. తల్లి కూడా అయ్యింది. అయినప్పటికీ ఉద్యోగాన్ని అంతే నిబద్ధతతో చేస్తోంది. ‘అడవిలో ఉండే అదృష్టం అందరికీ రాదు. ఇష్టపడాలే గాని ఇది చాలా ఆనందాన్నిచ్చే పని’ అంటున్న రసిలా చాలామంది ఆడపిల్లలకు మనమూ చేయగలం అనే నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తోంది. ఈసారి విహారానికి గిర్‌ వెళ్లినప్పుడు తప్పకుండా రసిలాను కలవండి. ఆమె ఆటోగ్రాఫ్‌ తీసుకొని ఇరుగూ పొరుగూ ఆడపిల్లలకు చూపించండి. ప్రతి ఆడపిల్లా సాహసంగా జీవించడమే కదా ఇవాళ్టి రోజుల్లో కావలసింది.                         

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top