మెడలో స్టెతస్‌ హోప్‌

మెడలో స్టెతస్‌ హోప్‌


డాక్టర్లు ఊళ్లల్లో పని చెయ్యాలంటే... ఆర్డర్లు వెయ్యాలని ప్రభుత్వాలు అనుకుంటాయి! కానీ మన డాక్టర్లలో ఉన్న సేవానిరతికి అవకాశం ఇస్తే.. స్ఫూర్తిని కలిగిస్తే.. ఎంత చెయ్యగలరో షైనీని చూసి తెలుసుకోవచ్చు. రోగికి సేవ చెయ్యడం ధర్మం అయితే... ప్రాణాలకు తెగించి సేవలు అందించే డాక్టర్లకు\మెడలో ఏ మెడల్‌ వెయ్యాలి? స్టెతస్కోప్‌ కాదు.. స్టెతస్‌ హోప్‌ వెయ్యాలి. హోప్‌ ఆఫ్‌ స్టెతస్కోప్‌ వెయ్యాలి!



సూడాన్‌.. సహారా ఎడారిలోని ఓ రెఫ్యూజీ క్యాంప్‌! రాత్రి మూడు గంటలు... విపరీతమైన చలి! చీమచిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం! సాయుధులైన కొంతమంది ఆ క్యాంప్‌లోని డాక్టర్లను, వాళ్ల వైద్యపరికరాలను దోచుకోవడానికి వచ్చారనే వార్త కార్చిచ్చులా వ్యాపించింది. ఎక్కడివాళ్లక్కడ తమ టెంట్‌కు జిప్‌ లాగేసుకొని ముసుగుపెట్టారు. ఓ లేడీ డాక్టర్‌ కూడా గబగబా తన టెంట్‌ జిప్‌ని లాక్‌ చేయబోయింది. కాని అది పనిచేయలేదు. ఎవరైనా చిన్న చాకుతో ఆ టెంట్‌ను కత్తిరించి లోపలున్న తన మీద ఈజీగా దాడీ చేసేయొచ్చు. ఆ ఆలోచనరాగానే లోపలి నుంచి భయం.. బయట నుంచి చలి ఆమెకు వణుకు పుట్టించాయి. ఎడారి అవతల ప్రపంచంలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు వార్తల రూపంలో అరిచే రేడియో కూడా ఆ రాత్రి మూగబోయింది. ఆ శబ్దంతో దుండగులు తేలిగ్గా క్యాంప్‌ జాడను తెలుసుకుంటారనే జాగ్రత్తతో. పేరుకు టెంట్‌లో ఉంది కాని ఆమె దృష్టి అంతా ఆ చీకటి పరిసరాల మీదే ఉంది.



మెడలదాకా దుప్పటి కప్పుకొని టెంట్‌ పల్చని గోడలవైపే చూస్తోంది. ఏవో గుసగుసలు వినిపించాయి. అలర్ట్‌ అయిపోయింది ఆ డాక్టర్‌. ఇంతలోకే ముగ్గురు మనుషుల నీడలు ఆ టెంట్‌ గోడల మీద అంతకంతకూ పెద్దవవుతూ కనిపించసాగాయి. బిగుసుకుపోయింది. ఆ ముగ్గురిలో ఒకడి దగ్గర గన్‌ ఉన్నట్లుంది. దాని నీడ స్పష్టంగా కనిపిస్తోంది... తనవైపే గురిపెట్టినట్టు దగ్గరగా. భయంతో గట్టిగా కళ్లుమూసుకుంది! ఎన్ని క్షణాలు గడిచాయో తెలియదు.. కాని ఆ గుసగుసలు దూరమై  అస్పష్టంగా వినిపించసాగాయి. అప్పుడు కళ్లు తెరిచింది. టెంట్‌ గోడల మీద నీడలు లేవు. గట్టిగా నిట్టూర్చి ఎడమవైపు నుంచి కుడివైపు తిరిగి ఒత్తిగిలి పడుకుంది.



ఆమె పేరు షైనీ కాకి. నిత్యం అంతర్యుద్ధాలు, యుద్ధాలతో అట్టుడుకుతూ, అంటువ్యాధులు, పోషకాహారలేమి, కరువుతో కలవరపడుతున్న నైజీరియా, సూడాన్, సొమాలియా, యెమెన్‌లలో వైద్యసేవలందిస్తున్న యంగ్‌ అండ్‌ డైనమిక్‌ డాక్టర్‌. శిబిరాల్లోని బాధితులు, శరణార్థుల  నాడీ పట్టుకొని ఆ దేశాల ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తోంది. వైద్యవిద్యను ఒక దీక్షగా  .. ప్రాక్టీస్‌ను ఓ సర్వీస్‌గా నమ్మే షైనీ ‘‘మెడిసిన్స్‌ సాన్స్‌ ఫ్రాంటియర్స్‌ (ఎమ్‌ఎస్‌ఎఫ్‌)’’ అంటే డాక్టర్స్‌ వితవుట్‌ బార్డర్స్‌ అనే సంస్థలో చేరింది. ఎల్లలు లేని వైద్య సేవే ఈ ఆర్గనైజేషన్‌ లక్ష్యం. ఎమ్‌ఎస్‌ఎఫ్‌ వలంటీర్‌గా ఒక మిషన్‌ తర్వాత ఇంకో మిషన్‌లోకి మారుతూ మూడేళ్లపాటు ఆ ప్రస్థానాన్ని కొనసాగించింది.



ఎవరీ డాక్టర్‌ షైనీ?

ఆంధ్రా అమ్మాయి. విజయవాడలో పుట్టిపెరిగిన డాక్టర్‌ ఆమె. 2009లో వెల్లూర్‌లోని సీఎమ్‌సీ కాలేజ్‌ నుంచి ఎంబీబీఎస్‌ పట్టా పుచ్చుకుంది. మిగిలిన వాళ్లలా సొంతంగా నర్సింగ్‌ హోమ్‌ పెట్టుకోవాలని, లేదంటే ఏదైనా కార్పోరేట్‌ హాస్పిటల్‌లో చేరి తన మెడిసిన్‌ డిగ్రీకి అయిన ఖర్చుని రాబట్టుకోవాలని అనుకోలేదు. ఆమె తల్లిదండ్రులకూ ఆ అంచనా లేదు. అందుకే ఎంబీబీఎస్‌ అయిపోగానే గ్రామీణప్రాంతాల్లో ప్రాక్టీస్‌ చేయాలనే కూతురి అభిప్రాయాన్ని గౌరవించారు. ఆ ప్రోత్సాహంతో ఆమె ఉత్తరప్రదేశ్, అలహాబాద్‌లోని లెప్రసీ ఆసుపత్రిలో డాక్టర్‌ కొలువు చూసుకుంది. చుట్టుపక్కల గ్రామాల్లో వైద్యం మొదలుపెట్టింది.    



శాపం కాదు రోగం

కుష్టువ్యాధి అధికంగా ఉన్న ఊళ్లు తిరుగుతుంటే ఆ ప్రాంతాలు ఎంత అంధకారంలో ఉన్నాయో అర్థమైంది షైనీకి. ఆ గ్రామాల్లోని వాళ్లు కుష్టుని గతజన్మ పాపంగా, దేవుడి శాపంగా భావించి చికిత్సకు దూరంగా ఆ రోగాన్ని భరించడం ఆమెను విస్మయపరిచింది. వ్యాధి లక్షణాలు బయటపడుతున్నా.. పుళ్లు ముదిరి వేళ్లు ఊడుతున్నా .. ఆ బాధను భరిస్తూ ఇళ్లల్లోనే ఉండేవారు తప్ప హాస్పిటల్‌కు వచ్చేవారు కాదు. పైగా ఇరుగుపొరుగుకు తెలిస్తే వెలివేస్తారనే భయంతో కదల్లేని పరిస్థితి వచ్చినా పక్కింటి వారి సహాయం కోరేవారు కాదు. అది శాపం కాదు రోగమని.. ముదిరితే ప్రమాదమని చెప్పినా అర్థం చేసుకునే ఇంగితం కనిపించలేదు. మొండిగా వైద్యం చేస్తే ఒప్పుకునే స్థితిలో లేరు. అప్పుడనిపించింది షైనీకి.. వీళ్లకు ముందు కావాల్సింది మందులు కాదు మాటలు... చికిత్స కాదు, చైతన్యం అని. తోటి డాక్టర్లను కలుపుకొని ఓ టీమ్‌గా ఏర్పడి ఊళ్లోని జనాలకు చేతన కల్పించే కార్యక్రమం మొదలుపెట్టింది.



వ్యక్తిగత, పరిసరాల శుభ్రత, అది లేకపోతే కలిగే అనారోగ్యం, దాని ప్రభావం అన్నీ విడమర్చి చెప్పసాగింది. ఆ తర్వాత కుష్టువ్యాధి గురించీ అవగాహన కలిగించడం మొదలుపెట్టింది. అదొక వ్యాధి అని,  కేవలం ట్రీట్‌మెంట్‌ ద్వారే నయమవుతుందని చెవినిల్లు కట్టుకొని పోరింది. నయమైన కేస్‌ స్టడీస్‌ని ఉదాహరణలుగా చూపించింది. ఆమె  శ్రమ వృథా కాలేదు. జనాల్లో మార్పు రాసాగింది. నెమ్మదిగా ఆసుపత్రికి రావడం ప్రారంభించారు. అలా ప్రతిగ్రామం తిరిగి ప్రజలను మేలుకొలిపి.. కుష్టువ్యాధిని పూర్తిగా నయం చేసింది. ఇప్పటికీ అలహాబాద్‌ చుట్టుపక్కల ఊళ్లలోని ప్రజలు డాక్టర్‌ షైనీని తమ వరంగా తలుస్తారు.



డాక్టర్స్‌ వితవుట్‌ బార్డర్స్‌...

 2013లో షైనీ కజిన్‌ ఒకరు కారు ప్రమాదంలో మరణించారు. దాంతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. మూడు నెలలు మనిషే కాలేదు. తన గదికే పరిమితమైంది. ఆ క్రమంలోనే ఓ వార్‌ మూవీ చూసిందామె. అందులో ఎమ్‌ఎస్‌ఎఫ్‌ (డాక్టర్స్‌ విత్‌ అవుట్‌ బార్డర్స్‌) తరపున ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చిన డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి క్షతగాత్రులకు స్వచ్ఛందంగా వైద్యం చేయడం ఆమెను ఆకర్షించింది. ఆలోచింపచేసింది. అప్పటిదాకా ఆవరించి ఉన్న డిప్రెషన్‌ వదిలిపోయి మనసు దూదిపింజ అయింది. వెంటనే ఎమ్‌ఎస్‌ఎఫ్‌కి దరఖాస్తు చేసుకుంది. షైనీకి నిరీక్షించే అవకాశం ఇవ్వకుండా రెండు రోజుల్లోనే ఎమ్‌ఎస్‌ఎఫ్‌ నుంచి ఇంటర్వ్యూ కాల్‌ వచ్చింది. ఆన్‌లైన్‌లోనే ఆ ప్రక్రియా పూర్తి అయింది. డాక్టర్స్‌ విత్‌ అవుట్‌ బార్డర్స్‌లో చేర్చుకుంటున్నట్టు షైనీకి మెయిల్‌ పంపారు. అలా హద్దుల్లేని సేవకోసం స్టెత్‌ పట్టుకుంది డాక్టర్‌ షైనీ కాకి.



ఫస్ట్‌ మిషన్‌

ఎమ్‌ఎస్‌ఎఫ్‌ మిషన్‌లో భాగంగా ఆమె మొదట ఇథియోపియా, సొమాలియా సరిహద్దులోని అంతర్యుద్ధ ప్రాంతానికి వెళ్లింది. శాంతి అనే పదం వినపించని, కనిపించని ప్రదేశం అది. పెద్దా, చిన్నా అంతా ఆయుధాలతో సంచరించే స్థలం డాక్టర్‌ అయినా, లాయర్‌ అయినా హోదాతో ప్రమేయం లేకుండా కొత్తవాళ్లు ఎవరు ఎదురైనా తుపాకులతోనే పలకరిస్తారు. ఆ వాతావరణాన్ని చూసి హడలిపోయింది షైనీ. తమకు అక్కడి రాజకీయాలతో ఏమాత్రం సంబంధంలేదని చెప్పినా వాళ్లు నిర్థారించుకున్నాకే వీళ్లు విధులు చేపట్టాలి. ఇథియోపియా సైన్యం, సొమాలియా పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో గాయపడ్డ సామాన్య జనానికి  వైద్యం అందించడానికే వచ్చారని సాక్ష్యాలు చూశాక కాని వాళ్లను వైద్యశిబిరాల్లోకి పంపించలేదు. ఎమర్జెన్సీ రూమ్‌లో ఆమెకు డ్యూటీ పడింది. క్షతగాత్రులు, హెచ్‌ఐవీ, టీబీ, చిన్నపిల్లల వార్డ్స్‌ అన్నీ అక్కడే. ఆమె పని చేస్తున్నంతసేపు ఆమె వెంటే ఉండేవారు సాయుధులైన స్థానికులు.



సహారాలో ఆసరాగా..

 సౌత్‌ సుడాన్‌లో ఆమె సెకండ్‌ మిషన్‌. అక్కడి రెఫ్యూజీ క్యాంపుల్లో పోషకాహార లేమితో బాధపడుతున్న పిల్లలు, పిల్లతల్లులను చూసి చలించిపోయింది షైనీ. ‘‘బలమైన ఆహారం లేక పాలుపడని తల్లులు గుండెలవిసేలా ఏడుస్తుంటే దుఃఖం ఆపుకోలేకపోయేదాన్ని. బాత్రూమ్‌లోకి వెళ్లి వెక్కివెక్కి ఏడ్చేదాన్ని. ఇక్కడికి వచ్చాక కూడా ఆ దృశ్యాలు వెంటాడుతున్నాయి. ఒక్కోసారి నిద్రే పట్టదు’’ అని బాధపడుతుంది. అక్కడి సివిల్‌ వార్, దాని పర్యవసానాల వల్ల ప్రజల జీవనస్థితిగతులు అస్తవ్యస్థమయ్యాయి. ‘‘డ్రింకింగ్‌ వాటర్‌ ఉండదు, సరైన తిండి దొరకదు, వైద్యం అయితే అందని పండే. ఎక్కడపడితే అక్కడ మురికితో కంపుకొడుతుంటుంది. దాంతో అంటురోగాలు. ఆ క్యాంప్‌లో నేను కలరా పేషంట్స్‌ను ట్రీట్‌చేసేదాన్ని’’ అంటూ అక్కడి పరిస్థితితులను వివరిస్తుంది డాక్టర్‌ షైనీ. సుడాన్‌ నుంచి  నైజీరియా వెళ్లింది. అక్కడా పోషకాహారలేమే ప్రధాన సమస్య. మాల్‌న్యూట్రిషన్‌తో  వందల మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. అలా మరణం అంచువరకు వెళ్లిన చాలామంది పిల్లలకు వైద్యంచేసి వాళ్ల ప్రాణాలు నిలిపింది ఈ డాక్టరమ్మ. తన ట్రీట్‌మెంట్‌తో ఆ సహారాదేశాల్లోని ఎంతోమందికి ఆసరాగా నిలిచింది మన ఆడబిడ్డ.



వెనక్కి రావాలనిపించింది..

సుడాన్‌లో చాలా చిత్రమైన పరిస్థితులు. వాతావరణపరంగా విపరీతమైన వేడి ఒక సమస్య అయితే అక్కడి రాజకీయ అస్థిరత, దాడులు ఇంకో సమస్య. రెఫ్యూజీ క్యాంపుల్లో పని చేస్తున్న ఎమ్‌ఎస్‌ఎఫ్‌ డాక్టర్లను సైతం  కిడ్నాప్‌ చేసిన సందర్భాలు ఎన్నోట. ‘‘అలాంటివి విన్నప్పుడు భయమేసేది. అక్కడి ఎండను చూసినప్పుడు మా ఇల్లు, ఇంట్లో కంఫర్ట్స్‌ గుర్తొచ్చేవి. ఒక్క క్షణం ఆ ఎండకు ఎక్స్‌పోజ్‌ అయినా చర్మం ఎర్రగా కందిపోయి మంట పుడుతుంది. ఉప్పునీళ్లు తప్ప మంచినీటి జాడే ఉండదు. ఇవన్నీ భరించలేక ఇండియాకు రావాలనిపించేది. కాని వెంటనే నా కళ్లముందున్న పేషంట్స్, డాక్టర్‌గా నేను చేయాల్సిన డ్యూటీని గుర్తుచేసేవారు. అంతే! హోమ్‌సిక్‌ పోయి ఆ చాలెంజెస్‌ను ఎదుర్కొనే శక్తి వచ్చేది’’ అని చెప్తుంది షైనీ. ఇవన్నీ ఒకెత్తయితే వర్క్‌ చాలెంజెస్‌ మరో ఎత్తు అంటుంది ఆమె. ‘‘క్యాంప్స్‌లోని లోకల్‌ స్టాఫ్‌ ముఖ్యంగా మగవాళ్లు నేను ఏదైనా చెప్తే వినేవారు కాదు. ట్రీట్‌మెంట్‌కి సంబంధించి సూచనలు, సలహాలు, ఈవెన్‌ ఆర్డర్స్‌ వేసినా నిర్లక్ష్యంగా ఉండేవారు. కారణం.. వాళ్లందరికన్నా నేను చిన్నదాన్నవడం, స్త్రీని కావడం! మేల్‌ డామినేషన్‌ ఎక్కువ. ఒక అమ్మాయి చెప్తే మేం వినాలా? అని అనుకునేవాళ్లు.



అదీకాక.. అక్కడున్న ప్రతివాళ్లు మన వెనక మన గురించి కామెంట్‌ చేసేవాళ్లు. టీజ్‌ చేసేవాళ్లు. ఒకసారైతే అక్కడి ఆరోగ్యశాఖ సిబ్బందితో నాకు చాలా ప్రాబ్లం అయింది. వాళ్ల మీద కంప్లయింట్‌ ఇచ్చాను కూడా. కాని ఏమీ జరగలేదు. అప్పుడనిపించింది.. వదిలేసి వెళ్లిపోదామని. మళ్లీ వెంటనే నా డ్యూటీ ఆపింది నన్ను. నాకు నా పేషంట్‌ ముఖ్యం, స్టాఫ్‌ కాదు కదా.. నా పేషెంట్‌కి లాయల్‌గా ఉండాలి.. అక్కడి సిబ్బంది కాదు కదా.. అనుకొని ఏది ఏమైనా సరే నా అసైన్‌మెంట్‌ అయిపోయే వరకు ఉండాలని డిసైడ్‌ చేసుకున్నా’ అంటూ  నాటి చేదు జ్ఞాపకాలను షేర్‌   చేసుకుంటుంది షైనీ.



ఏం నేర్చుకుంది?

‘‘ఆడవాళ్లకు చాలా అడ్డంకులుంటాయి. అలాగని జీవితం ఎలా వెళ్తే అలా సర్దుకుపోవాల్సిన అవసరం లేదు. మనకూ లక్ష్యాలుండాలి. వాటిని సాధించాలి. చాలెంజెస్‌ను ఎదుర్కోవాలి. నల్లేరు మీద ఎవరైనా నడుస్తారు. యుద్ధంలో సాగడమే కదా సాహసం.  మన ప్రధాన శత్రువు భయమే. దాన్ని జయించాలి. మన గొంతును ప్రపంచానికి వినిపించాలి. మనల్ని అణచివేయాలనుకునే  అధికారానికి తలవంచాల్సిన పనిలేదు. మనం చేసేది కరెక్ట్‌ అయినప్పుడు పర్యవసానాలకు బెదరొద్దు. మనమే కాదు మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రోగ్రెసివ్‌గా మార్చాలి’’ అని తన జీవితం నేర్పిన పాఠాన్ని తోటి మహిళలకు స్ఫూర్తిగా చూపించాలనుకుంటోంది డాక్టర్‌ షైనీ కాకి.



60 దేశాల్లో 25 వేల సిబ్బందితో..

మెడిసిన్స్‌ సాన్స్‌ ఫ్రాంటియర్స్‌ (ఎమ్‌ఎస్‌ఎఫ్‌) లేదా డాక్టర్స్‌ వితవుట్‌ బార్డర్స్‌ ఒక అంతర్జాతీయ సంస్థ. యుద్ధాలు, అంతర్యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, అంటువ్యాధులు ఉన్న దేశాల్లో అత్యవసర వైద్యసహాయం అందిస్తుంది. ప్రస్తుతం 60 దేశాల్లో మూడువేల మంది డాక్టర్లు, నర్సులు, మంచినీరు, శానిటేషన్‌ ఎక్స్‌పర్ట్స్, అడ్మినిస్ట్రేటర్స్, ఇతర ప్రొఫెషనల్స్‌తోపాటు ఆయాదేశాల్లో 25వేల మంది స్టాఫ్‌ను అపాయింట్‌ చేసుకుని విస్తృతమైన సేవలందిస్తోంది ఎమ్‌ఎస్‌ఎఫ్‌.  

- శరాది

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top