పరి పరిశోధన | Periodical research | Sakshi
Sakshi News home page

పరి పరిశోధన

Feb 14 2018 1:56 AM | Updated on Feb 14 2018 1:56 AM

Periodical research - Sakshi

కొత్త ఫిల్టర్‌తో మంచినీళ్లు + లిథియం!
సముద్రపు నీటి నుంచి లవణాలన్నింటినీ వేరు చేస్తే.. భూమ్మీద ఎవరికీ తాగు/సాగు నీటి కొరత అస్సలు ఉండదు. దురదృష్టం ఏమిటంటే ఈ పనిచేసేందుకు ఇప్పటివరకూ సమర్థమైన పద్ధతి ఏదీ లేకపోవడం. ఇజ్రాయెల్‌తోపాటు అనేక దేశాలు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా అమెరికా తయారు చేసిన ఓ సరికొత్త ఫిల్టర్‌ పుణ్యమా అని సమస్య పరిష్కారంలో గణనీయమైన పురోగతి సాధించాము.

ఎందుకంటే ఈ ఫిల్టర్‌ ఒకవైపు నిర్లవణీకరణ (ఉప్పునీటిని మంచినీటిగా మార్చడం) చేస్తూనే.. ఇంకోవైపు భూమ్మీద అతితక్కువ మోతాదులో ఉందనుకుంటున్న లిథియంను ఉత్పత్తి చేయగలదు! లిథియం స్మార్ట్‌ఫోన్లతోపాటు అన్ని రకాల గాడ్జెట్లలో వాడే బ్యాటరీల తయారీకి కీలకమన్న సంగతి తెలిసిందే. మెటల్‌ ఆర్గానిక్‌ ఫ్రేమ్‌వర్క్స్‌ (ఎంఓఎఫ్‌) అనే ప్రత్యేక పదార్థం ద్వారా ఇది సాధ్యమైందని మోనాష్, సీఎస్‌ఐఆర్‌వో, టెక్సస్‌ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు అంటున్నారు.

కేవలం ఒకగ్రాము ఎంఓఎఫ్‌ పదార్థాన్ని పూర్తిస్థాయిలో విస్తరిస్తే.. ఒక ఫుట్‌బాల్‌ మైదానం అంత ఉంటుందని.. ఇంతటి ఎక్కువ ఉపరితల వైశాల్యమున్న పదార్థాలతో నిర్లవణీకరణ ఎక్కువ సమర్థంగా జరుగుతుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త హాంటింగ్‌ వాంగ్‌ తెలిపారు. సముద్రపు నీరులో ఉండే లిథియం అయాన్లను కూడా వీటితో వేరు చేసి వాడుకోవచ్చునని చెప్పారు. ఎంఓఎఫ్‌ ఫిల్టర్లు అతితక్కువ విద్యుత్తును వాడుకోవడమే కాకుండా.. ఎక్కువ మోతాదులో మంచినీటిని అందిస్తాయి కాబట్టి.. ఈ కొత్త పద్ధతి ద్వారా చాలా చౌకగా మంచినీరును సిద్ధం చేసుకోవచ్చు.

ఇది స్మార్ట్‌ స్తెతస్కోప్‌...
జ్వరం చేస్తే.. శరీర ఉష్ణోగ్రత ఎంతుందో తెలుసుకునేందుకు థర్మామీటర్‌ను ఇంట్లోనే పెట్టుకోవచ్చు. మరి గుండె కొట్టుకునే వేగం మొదలుకొని... ఊపిరితిత్తుల్లో ఉండే సాధారణ సమస్యల వివరాలు తెలియాలంటే? ఏముందీ.. ఫొటోలో కనిపిస్తున్న స్తెతోమీ వాడితే సరిపోతుంది అంటున్నారు పోలాండ్‌కు చెందిన ఆడమ్‌ మికీవిజ్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. తరచూ ఊపిరితిత్తుల పనితీరుపై సమాచారం తెలుసకోవాల్సిన ఉబ్బస రోగగ్రస్తులకు ఉపయోగపడేలా దీన్ని తాము తయారు చేశామని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఒక అప్లికేషన్‌ ఆధారంగా పనిచేసే ఈ వైర్‌లెస్‌ స్తెతోమీ.. శరీరంపై పరికరాన్ని ఏ ప్రాంతంలో ఉంచాలో కూడా అదే సూచిస్తుంది. ఆ తరువాత గుండెకొట్టుకునే వేగంతోపాటు శరీర ఉష్ణోగ్రత, ఊపిరితీసుకునేటప్పుడు వచ్చే శబ్దాలను కూడా రికార్డు చేస్తుంది. వేర్వేరు ఆరోగ్య సమస్యలున్న వారి వివరాలు, శబ్దాలతో వీటిని పోల్చి చూస్తుంది. వివరాలు స్తెతోమీ వెనుకవైపున ఉన్న స్క్రీన్‌పై కనిపిస్తాయి.

అత్యవసరంగా వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితి ఉంటే.. ఆ విషయాన్ని కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతోపాటు రోగి తాలూకూ వివరాలన్నింటినీ స్మార్ట్‌ఫోన్‌కు పంపి.. భవిష్యత్తు అవసరాల కోసం స్టోర్‌ చేస్తుంది కూడా. ఇప్పటికే తాము స్తెతోమీని ఆసుపత్రుల్లో పరీక్షించి చూశామని... తగినన్ని నిధులు సమకూరిన తరువాత వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేస్తామని అంటున్నారు శాస్త్రవేత్తలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement