కుమారి 21 ఎఫ్‌తో...

special story to Dubbing artist Lipsika - Sakshi

విలక్షణమైన పేరుతో అందరికీ పరిచితులయ్యారుపాటల రియాలిటీ షోలో రన్నరప్‌ అయ్యారు డబ్బింగ్‌ ఆర్టిస్టుగా సుమారు 40 చిత్రాల ద్వారా పాపులర్‌ అయ్యారుయూట్యూబ్‌లో సొంత వీడియోలతో సోషల్‌ మీడియాలో అట్రాక్షన్‌ అయ్యారుకుమారి 21 ఎఫ్‌ చిత్రంతో తన గొంతుతో ప్రేక్షకులకు సుపరిచితురాలైన లిప్సిక తన కెరీర్‌ అనుభవాలను సాక్షితో పంచుకున్నారు... 

ఒక నటి తెర మీద బాగా కనపడాలంటే డబ్బింగ్‌ ప్రధానం. వాళ్లు ఎంత బాగా నటించినా, డబ్బింగ్‌ బాగుండకపోతే ‘ఆ నటి అస్సలు బాగా నటించలేదు’ అనేస్తారు. ఎందరో డబ్బింగ్‌ ఆర్టిస్టులు నటుల నటనకు జీవం పోస్తున్నారు. ఎంబీఏ (హెచ్‌ఆర్‌) పూర్తి చేసిన లిప్సిక గాయనిగా తన కళా జీవితం ప్రారంభించి, హెబ్బాపటేల్, మెహరీన్‌ వంటి కొత్త కథానాయికలకు డబ్బింగ్‌ చెబుతూ, మంచి డబ్బింగ్‌ ఆర్టిస్టుగా దూసుకుపోతున్నారు. తన అనుభవాలను సాక్షితో పంచుకున్నారు...

‘‘నా నాలుగో ఏట నుంచే సంగీతం పాడేదాన్ని. చాలాకాలం వరకు నాకు పాటల మీద అంత ఆసక్తి ఉండేది కాదు. ఇంట్లోవారి బలవంతం మీద పాటలు నేర్చుకునేదాన్ని. ‘పాడుతా తీయగా’ లో  క్వార్టర్‌ ఫైనల్స్‌కి వచ్చాక నాకోసం నేను పాడటం మొదలుపెట్టాను. ఆ కార్యక్రమం ద్వారా సినిమాలలో అవకాశాలు వచ్చాయి. 2010 నుంచి సినిమాలలో పాడుతున్నాను. స్టేజ్‌ షోల కోసం అనేక దేశాలు తిరిగి వచ్చాను’’ అంటున్న లిప్సిక తల్లి విద్యుల్లత డిగ్రీ కాలేజీలో ఫ్రెంచ్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. తండ్రి జగన్మోహన్‌ ఒక మ్యూజిక్‌ అకాడమీ నడుపుతున్నారు. ఆయన గిటార్, పియానో, కీబోర్డు, గాత్రం అన్నీ నేర్పిస్తారు. ఉద్యోగరీత్యా ఐఐపీఎంకి పని చేస్తున్నారు. ‘‘మా ఇంట్లో అందరూ సంగీతానికి సంబంధించినవారే’’ అంటున్న లిప్సికకు డబ్బింగ్‌ చెప్పాలనే కోరికే లేదు. వాళ్ల ఇంట్లో కూడా ఆ ఆలోచన లేదు. ‘చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకున్నావు కదా! అందువల్ల సంగీతంలోనే నిలబడు’ అని తల్లిదండ్రులు అనడంతో, కొంతకాలం పాటలు మాత్రమే పాడారు లిప్సిక. ‘‘అనుకోకుండా ఒకరోజు ‘మేం వయసుకు వచ్చాం’ చిత్రానికి డబ్బింగ్‌ చెప్పమని ఫోన్‌ వచ్చింది. ఇంట్లో వద్దంటారని తెలుసు. అతి కష్టం మీద అమ్మ వాళ్లని ఒప్పించాను. అలా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా నా తొలి అడుగు పడింది. ఐదారు సినిమాలకు చెప్పాక, ‘కుమారి 21 ఎఫ్‌’ లో హెబ్బాపటేల్‌కి చెప్పిన డబ్బింగ్‌తో ఇంక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఒక డబ్బింగ్‌ ఆర్టిస్టుగా నాకు హిట్‌ ఇచ్చిన సినిమా ఇదే’’ అంటున్న లిప్సిక,  ఈ చిత్రానికి డబ్బింగ్‌ చెప్పడానికి చాలా కష్టపడినప్పటికీ తనకు ఆ చిత్రమంటే చాలా ఇష్టమనీ, ఆ సినిమాతోనే తనకు గుర్తింపు వచ్చిందని చెబుతారు. ‘‘ఇప్పటి వరకు సుమారు 40 చిత్రాలకు డబ్బింగ్‌ ఇచ్చాను. ఒక్క సీరియల్‌కి కూడా చెప్పలేదు. సినిమా మాడ్యులేషన్‌కి, సీరియల్స్‌ మాడ్యులేషన్‌కి చాలా తేడా ఉంటుంది. అదీకాకుండా సీరియల్స్‌ అంటే కనీసం వెయ్యి ఎపిసోడ్స్‌ చెప్పాలి. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాను. భవిష్యత్తులో నాకు టైమ్‌ కుదిరితే తప్పకుండా సీరియల్స్‌కి కూడా చెబుతాను’’ అంటున్నారు లిప్సిక ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రానికి డబ్బింగ్‌ ఆర్టిస్టుగా నంది బహుమతి అందుకున్నారు. కర్ణాటక సంగీతం, లలిత సంగీతం, సినిమా సంగీతం లయాత్మకంగా పాడుతూ పెద్దల ప్రశంసలు అందుకున్న లిప్సిక, డబ్బింగ్‌ చెప్పడం ప్రారంభించిన కొత్తలో కొద్దిగా ఇబ్బంది పడ్డారు. అసలు డబ్బింగ్‌ ఎలా చెప్పాలో కూడా తెలియకపోవడంతో, ఒక్కో డైలాగుకి ఎక్కువ సమయమే తీసుకున్నారు. ‘‘కొత్తలో బాగా కష్టపడ్డాను. మా డైరెక్టరు నాతో చాలా జాగ్రత్తగా చెప్పించారు. కష్టాలు ఎదురుచూస్తేనే జీవితం అంటే ఏమిటో అర్థమవుతుంది. అందుకే నాకు కష్టాలు ఎదురుచూడటం చాలా ఇష్టం’’ అంటారు లిప్సిక.

ఆమె పేరు గురించి లిప్సిక ‘‘అమ్మకి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ అంటే చాలా ఇష్టం. ఆయన రాసిన ‘లిపిక’ కథ అమ్మకు మరీ ఇష్టం. ఆ పేరే నాకు పెట్టాలనుకుంది. ‘స’ అక్షరం చేరిస్తే అదృష్టం కలిసి వస్తుందని ఎవరో చెప్పడంతో, లిప్సిక అని పెట్టారు. ఎక్కడకు వెళ్లినా, అందరూ నా పేరు గురించి అడుగుతుంటారు. అసలు నాకు గుర్తింపు కూడా నా పేరు వల్లే వచ్చిందేమో’’ అంటున్న లిప్సిక ఇప్పటివరకు 40 సినిమాలకు డబ్బింగ్‌ చెప్పారు. ఇటీవల విడుదలైన చలో, జవాన్, మరి కొన్ని చిన్న సినిమాలలో పాటలు పాడారు. యూట్యూబ్‌ వీడియోలు చేస్తున్నారు. ట్రాక్‌లు పాడుతున్నారు. అనేక షోలలో పాల్గొంటున్నారు.

డబ్బింగ్‌ చెప్పిన కొన్ని చిత్రాలు
కుమారి 21 ఎఫ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్‌మ్యాన్, జవాన్, చల్‌ మోహన రంగా, లై 

డైలాగులు
నా పేరు కుమారి, నా ఏజ్‌ 21 
(కుమారి 21 ఎఫ్‌ చిత్రం)
చెప్పానా! నేను చెప్పానా! నీకు చెప్పానా! 
(కృష్ణగాడి వీర ప్రేమగాథ)

డబ్బింగ్‌ చెప్పిన తారలు
హెబ్బా పటేల్, మెహరీన్, సురభి, 
లావణ్య త్రిపాఠి, మేఘా ఆకాశ్, 
ఇంకా కొందరు కొత్త తారలకు 
– ఇంటర్వ్యూ: వైజయంతి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top