చలం చందనం

Special Story On Chalam Funeral By Puranam Subramanyam Sharma - Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం 

చలం అంత్యక్రియలకు సంబంధించిన ఈ విశేషాలు పురాణం సుబ్రహ్మణ్య శర్మ 1982లో రాసిన ‘అరుణాచలంలో చలం’ పుస్తకంలో ఉన్నాయి.  1979లో చలానికి 84–85 ఏళ్ల వయసులో ఆరోగ్యం క్షీణించింది. నా చావువార్తను బయటి ప్రపంచానికి తెలియనివ్వొద్దు, నాకీ పాడేగీడె కట్టి తీసుకెళ్లద్దు, నా శవం దగ్గర భజనలూ అవీ చేయొద్దు, నేనీ ఈజీ చైర్లో ఎట్లావున్నానో అట్లా సైలెంటుగా తీసుకెళ్లండి అని కూతురు సౌరిస్‌కు సూచించారు చలం. ఎవరికీ చెప్పొద్దనడం ధర్మం కాదని సౌరిస్‌ అప్పుడే ఆ మాట కొట్టేసింది.

చనిపోయిన తర్వాత రమణాశ్రమంలో కొందరు పాడె కడతామనీ, మేము మోసుకెళ్తామనీ  అడిగినప్పటికీ సౌరిస్‌ ఒప్పుకోలేదు. ఈజీ చైర్లోనే పట్టుకెళ్లారు. మీద బట్ట కప్పలేదు. స్నానం చేయించి తెల్లటి బుష్‌ షర్టూ, తెల్లటి లుంగీ కట్టారు. పూవులు ఆయన వద్దనలేదు కాబట్టి బుట్టల కొద్దీ తెచ్చారు. సుధ నుంచీ, వాల్మీకి రామాయణం నుంచీ శ్లోకాలను పద్యాలను గానం చేశారు. తిరువణ్ణామలై రమణస్థాన్‌కు ముప్పాతిక మైళ్ల దూరంలో ఉన్న అరుణగిరి కొండలు, యమలింగాల దేవాలయం నడుమ సామూహిక మార్నింగ్‌ వాక్‌లా అంత్యక్రియలు జరిగాయి. 

చలానికి చాలా ప్రియమైన చెల్లెలి పిల్లల్లో ఒకరు వక్కలంక నరసింహారావు చితికి నిప్పు పెట్టారు మంచి గంధపు చెక్కతో. సౌరిస్‌– ‘‘మీ ప్రేమ కొద్దీ మీరు వేసుకోండి చితిమీద’’ అని అందరికీ చందనపు చెక్కలు యిప్పించింది. అంతా గంధపు చెక్కలను చితిమీద వేసారు.

ఈ చందనపు చెక్కల గురించి ఓ కథ వుంది. చలం చనిపోవడానికి ‘ఏడాది ఆర్నెల్ల క్రితం’ చలాన్ని చూడ్డానికి రాయలసీమ నుంచి ఒక ఆసామీ వచ్చాడు. 

ఆయన వస్తూ ఓ చందనపు చెక్కను తెచ్చి ‘‘ఇది మీకోసం తెచ్చానండీ’’ అని చలానికి బహూకరించాడు. ఆయన రచయిత కాడు, పెద్ద భక్తుడు కాదు. చలం గురించి విని ఓమారు చూసి పోదామని వచ్చాడు. ఉత్తి చేతులతో రావడం ఎందుకని చందనపు కర్ర తెచ్చి సమర్పించుకున్నాడు ప్రేమతో. ‘‘ఈశ్వరుడు నాకు అంత్యకాలం వచ్చిందని చందనం పంపించాడు’’ అని చలం చమత్కరించాడట. ఆ చందనం నిజంగా అలానే ఉపయోగపడింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top