సది పెట్టాము సల్లంగ చూడమ్మా

Special Dishes In Telangana Culture - Sakshi

బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి. సల్లంగా చూసే తల్లి. సకల శుభాలనిచ్చే తల్లి. ఆ తల్లికి ప్రీతైన సద్దులు పెట్టడం భక్తుల ఆనవాయితీ. సద్ది పెడదాము. శరణు కోరుదాము.

పెరుగు సద్ది
కావలసినవి:
అన్నం – 1 గ్లాసు; పెరుగు – 1 గ్లాసు; పాలు – 1/2 గ్లాసు; ఎండు మిరపకాయలు – 3; మినప్పప్పు – 1 టీ స్పూను; సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; ఆవాలు, జీలకర్ర – టీ స్పూను చొప్పున; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – 2 రెమ్మలు; నూనె – 3 టీ స్పూన్లు; నెయ్యి – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత.

తయారీ:
►అన్నం మెత్తగా వండి మెదిపి పెట్టుకోవాలి
►పెరుగు, తగినంత ఉప్పు వేసి కలపాలి
►ఒక చిన్న గిన్నెలో నూనె, నెయ్యి కలిపి వేడి చేసి ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేయాలి
►తర్వాత మినప్పప్పు, సెనగపప్పు వేసి కాస్త వేగాక కరివేపాకు వేసి దింపి, కలిపి ఉంచుకున్న పెరుగన్నంలో కలపాలి
►ఇందులో గోరువెచ్చని పాలు వేసి కలిపి మూతపెట్టి పది నిమిషాల తర్వాత వడ్డించాలి
►పాలు కలపడం వల్ల అన్నం పులుపెక్కకుండా కమ్మగా ఉంటుంది.

మలీద
కావలసినవి: గోధుమ పిండి – 1 కప్పు; ఉప్పు – చిటికెడు; బెల్లం తురుము – 1/2 కప్పు; ఏలకుల పొడి – 1/2 టీ స్పూను; నెయ్యి – 4 టీ స్పూన్లు.

తయారీ:
►గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు వేసి కలిపి తగినన్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలిపి మూతపెట్టి ఉంచాలి
►తర్వాత ఉండలు చేసుకుని చపాతీలు చేసి కొద్దిగా నూనె వేసి కాల్చుకోవాలి
►వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని బెల్లం తురుము కలిపి మెత్తగా దంచుకోవాలి లేదా మిక్సీలో వేసి తిప్పాలి
►బయటకు తీసి నెయ్యి, ఏలకుల పొడితో పాటు, ఇష్టముంటే నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్‌ వేసి కలిపి నచ్చిన సైజులో ఉండలు కట్టుకోవాలి
►ఆరిన తర్వాత డబ్బాల్లో నిల్వ చేసుకోవాలి.

కొబ్బరి సద్ది
కావలసినవి: బియ్యం  – 100 గ్రా.; పచ్చి కొబ్బరి పొడి – 100 గ్రా.; ఎండు మిరపకాయలు – 3; జీలకర్ర – 1/4 టీ స్పూను; ఆవాలు –  1/4 టీ స్పూను; మినప్పప్పు– 1 టీ స్పూను; సెనగపప్పు – 1 టీ స్పూను; ఇంగువ  – చిటికెడు; ఉప్పు – తగినంత; పల్లీలు – 50 గ్రా.; కరివేపాకు –  2 రెమ్మలు; నూనె  –  5 టీ స్పూన్లు.

తయారీ:
►అన్నం కాస్త బిరుసుగా వండి వెడల్పాటి పళ్ళెంలో వేసి తగినంత ఉప్పు కలిపి చల్లారనివ్వాలి
►ఒక గిన్నెలో నూనె వేడి చేసి పల్లీలు వేసి కాస్త వేగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు వేసి కొద్దిగా వేగాక, కొబ్బరి పొడి వేసి కొద్దిసేపు వేయించాలి
►ఈ పోపునంతా అన్నంలో వేసి కలిపి పది నిమిషాలు మూతపెట్టి ఉంచాక తినాలి (పోపు, కొబ్బరి... దోరగా వేగాలి, ఎర్రబడకూడదు).

నిమ్మ సద్ది
కావలసినవి: బియ్యం – 2 కప్పులు; నిమ్మకాయలు – 2; ఎండు మిరపకాయలు – 2; పచ్చి మిరపకాయలు – 2; కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు – పావు టీ స్పూను; ఆవాలు, జీలకర్ర – టీ స్పూన్‌ చొప్పున; మినప్పప్పు – 1 టీ స్పూన్‌; సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; పల్లీలు – పావు కప్పు; ఇంగువ – చిటికెడు; ఉప్పు – తగినంత; నూనె – 3 టీ స్పూన్లు.

తయారి:
►అన్నం పొడిపొడిగా వండి చల్లారాక, తగినంత ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి
►బాణలిలో నూనె వేడి చేసి పల్లీలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా వేగిన తర్వాత సెనగ పప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి
►ఇందులో నిలువుగా చీల్చిన  పచ్చి మిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి కలిపి దింపేసి నిమ్మ రసం పిండాలి
►మొత్తం కలిపి అన్నంలో వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి
►పది నిమిషాల్లో తినడానికి రెడీగా ఉంటుంది.

నువ్వుల సద్ది
కావలసినవి: బియ్యం – 4 కప్పులు; నువ్వులు – 1/2  కప్పు; ఎండు మిరపకాయలు – 4; పచ్చి మిర్చి – 4; కరివేపాకు – 2 రెబ్బలు; సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; ఆవాలు, జీలకర్ర – 1/2 టీ స్పూను చొప్పున; పసుపు – 1/4 టీ స్పూను; ఇంగువ – చిటికెడు; ఉప్పు – తగినంత; నూనె – 5 టీ స్పూన్లు.

తయారి:
►బియ్యం కడిగి అరగంట నానిన తరవాత కొద్దిగా పలుకుగా (పొడిపొడిగా ఉండేలా) వండి చల్లార్చుకోవాలి
►బాణలిలో ఎండు మిర్చి, నువ్వులు దోరగా వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి
►వెడల్పాటి గిన్నెలో అన్నం తీసుకుని పొడిపొడిగా చేసుకుని చెంచాడు నూనె, పసుపు, తగినంత ఉప్పు, నువ్వుల పొడి వేసి బాగా కలియబెట్టి మూతపెట్టి ఉంచాలి
►మరో గిన్నెలో మిగిలిన నూనె వేడి చేసి ఇంగువ వేయాలి
►ఆవాలు, జీలకర్ర, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేయాలి
►పచ్చి సెనగ పప్పు, కరివేపాకు వేసి దోరగా వేగిన తర్వాత దింపేసి అన్నంలో వేసి కలపాలి
►మొత్తం బాగా కలిపి మూత పెట్టి అరగంట తర్వాత తినొచ్చు

చింతపండు సద్ది
కావలసినవి: బియ్యం – 2 కప్పులు; చింతపండు పులుసు – సగం కప్పు; ఎండు మిర్చి  – 5; జీలకర్ర, ఆవాలు – 1/4 టీ స్పూను; మినప్పప్పు – 1 టీ స్పూను; సెనగ పప్పు – 1 టీ స్పూను; ఇంగువ – చిటికెడు; పసుపు – 1/4 టీ స్పూను; ఉప్పు – తగినంత; కరివేపాకు – 2 రెబ్బలు; నూనె – 5 టీ స్పూన్లు.

తయారి:
►బియ్యం కడిగి తగినన్ని నీళ్లు పోసి అరగంట నానిన తర్వాత కొద్దిగా పలుకుగా వండి చల్లార్చుకోవాలి
►ఒక వెడల్పాటి గిన్నెలో అన్నం చల్లారబెట్టి పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి
►మరో చిన్న గిన్నెలో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి
►అది కరిగిన తర్వాత  ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి చిటపటలాడాక పల్లీలు, మినప్పప్పు, సెనగ పప్పు, కరివేపాకు వేసి వేగిన చింతపండు పులుసు వేసి చిక్కబడేవరకు ఉడికించాలి
►చివరలో కరివేపాకు, కొంచెం బెల్లం వేసి రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి
►కలిపి ఉంచుకున్న  అన్నంలో వేసి బాగా కలియబెట్టి  పది నిమిషాలు ఉంచితే చాలు.
కర్టెసీ: జ్యోతి వలబోజు, హైదరాబాద్‌

నాన్‌–వెజ్‌

నాటు కోడి ఫ్రై
కావలసినవి:నాటుకోడి – అర కేజీ; అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లు; నూనె – 3 టీ స్పూన్లు; ఉల్లి తరుగు–పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 6; మిరియాల పొడి – అర టీ స్పూను; జాజికాయ–చిన్న ముక్క; గరం మసాలా – టీ స్పూను; జీలకర్ర పొడి – టీ స్పూను; ధనియాల పొడి – 2 టీ స్పూన్లు; కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత, జీడిపప్పులు – 50 గ్రా.; టొమాటో తరుగు – కప్పు; పుదీనా – ఒక కట్ట; కొత్తిమీర – చిన్న కట్ట; నిమ్మ రసం–ఒక టీ స్పూను; కరివేపాకు–రెండు రెమ్మలు; జీలకర్ర – అర టీ స్పూను.

తయారీ:
►నాటుకోడి ముక్కలను శుభ్రం చేసి నీళ్లతో కడగాలి
►స్టౌ మీద కుకర్‌ ఉంచి, కొద్దిగా నూనె వేసి కాగాక జీలకర్ర, గరం మసాలా, కరివేపాకు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, టొమాటో తరుగు, జీడి పప్పులు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి
►చికెన్‌ ముక్కలను కూడా వేసి వేయించాలి.
►ఉప్పు, మిరప కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి బాగా కలపాలి
►ఉడికించిన ముక్కలకు మసాలా అంతా బాగా పట్టేలా బాగా కలియబెట్టాలి
►చివరగా నిమ్మ రసం, కొత్తిమీర, పుదీనా తరుగుతో అలంకరించి దింపి, వేడి వేడిగా అందించాలి.

పాయా షోర్వా
కావలసినవి: పాయా – 4; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 6; టొమాటో తరుగు – అర కప్పు; పసుపు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – 2 టీ స్పూన్లు; బిర్యానీ ఆకు – 1; గరం మసాలా – టేబుల్‌ స్పూను; జీలకర్ర పొడి – టీæ స్పూను; ధనియాల పొడి – టీ స్పూను; నూనె – 3 టీ స్పూన్లు; అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లు; మిరియాల పొడి – టీ స్పూను; గరం మసాలా – అర టీ స్పూను; పుట్నాల పప్పు – 50 గ్రా.; ఎండు కొబ్బరి తురుము – అర కప్పు; కొత్తిమీర – చిన్న కట్ట; నిమ్మ రసం – ఒక టీ స్పూను; పుదీనాఆకులు – ఒక కట్ట.

తయారీ:
►పాయా ముక్కలను ఉప్పు, నిమ్మ రసంతో శుభ్రంగా కడగాలి
►కొద్దిగా ఉప్పు, పసుపు చేసి బాగా కలిపి, మూత పెట్టి కొద్దిసేపు పక్కన ఉంచాలి
►మిక్సీలో పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి తురుము వేసి మెత్తగా ముద్దలా చేసి పక్కన ఉంచాలి
►స్టౌ మీద కుకర్‌ ఉంచి వేడయ్యాక నూనె వేసి కాగిన తరవాత, గరం మసాలా, బిర్యానీ ఆకు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద ఒకదాని తరవాత ఒకటి వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి
►జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు, మిరియాల పొడి వేసి మరోమారు కలియబెట్టాలి
►టొమాటో తరుగు వేసి బాగా కలిపిన తరవాత, మిక్సీ పట్టిన కొబ్బరి మిశ్రమం జత చేయాలి
►ఊరబెట్టిన పాయాను జత చేసి బాగా కలియబెట్టి, తగినన్ని నీళ్లు పోయాలి
►సుమారు అరగంట సేపు ఉడికించిన తరవాత దింపేసి తరిగిన పుదీనా ఆకులతో అలంకరించాలి.

రొయ్యల పులావ్‌
కావలసినవి: రొయ్యలు – పావు కేజీ; బాస్మతి బియ్యం – అర కేజీ; నెయ్యి – 100 గ్రా.; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 5; గరం మసాలా – ఒక టీ  స్పూను; పెరుగు – అర కప్పు; టొమాటో తరుగు – ఒక కప్పు;  కారం – ఒక టీ స్పూను; ఉప్పు– తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – చిన్న కట్ట; పుదీనా – చిన్న కట్ట; బిర్యానీ ఆకు – 1; షాజీరా – అర టీ స్పూను; జీడిపప్పులు – 50 గ్రా.; కిస్‌మిస్‌ – 50 గ్రా.; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టేబుల్‌ స్పూను.

తయారీ:
►బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు గంట సేపు నానబెట్టాలి
►రొయ్యలను శుభ్రం చేసి, ఉప్పు, నిమ్మరసంతో కడగాలి
►మిక్సీలో ఉల్లి తరుగు, పచ్చి మిర్చి వేసి మెత్తగా ముద్ద చేసి పక్కన ఉంచాలి
►టొమాటోలను మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కనుంచాలి
►స్టౌ మీద కుకర్‌ ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కాగాక, జీడిపప్పులు, కిస్‌మిస్‌ వేసి దోరగా వేయించి ఒక పాత్రలోకి తీసుకోవాలి
►మిగిలిన నేతిలో... షాజీరా, బిర్యానీ ఆకు, గరం మసాలా, ఉల్లి + పచ్చి మిర్చి ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలియబెట్టాలి
►రొయ్యలను జత చేసి బాగా కలిపి మిరప కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, టొమాటో ముద్ద వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు జత చేయాలి
►నీళ్లు బాగా మరిగాక నానబెట్టి ఉంచుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి కలియబెట్టాలి
►మూడు వంతులు ఉడికిన తరవాత, మంట బాగా తగ్గించి ఉడికిన తరవాత దింపేసి, ఒక బౌల్‌లోకి తీసుకుని, జీడిపప్పు, కిస్‌మిస్, కొత్తిమీర, పుదీనా ఆకులతో అలంకరించాలి.

తెలంగాణ చేపల పులుసు
కావలసినవి: చేపముక్కలు – అర కేజీ; ఉల్లి తరుగు – అర కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 6; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – ఒక కట్ట; నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; జీలకర్ర – అర టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; మిరప కారం – 3 టీ స్పూన్లు; పసుపు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; వేయించిన మెంతులు – ఒక టేబుల్‌ స్పూను; చింతపండు గుజ్జు – ఒక కప్పు; నిమ్మ రసం – ఒక టీ స్పూను; అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – ఒక టేబుల్‌ స్పూను.

తయారీ:
►చేప ముక్కలను బాగు చేసి కడిగి పక్కన ఉంచాలి
►ఉప్పు, పసుపు,  కారం జత చేసి, కలిపి మూత ఉంచాలి
►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి కాగాక, ఊర బెట్టిన చేపముక్కలను వేసి వేయించి పక్కన ఉంచాలి
►స్టౌ మీద ఒక పాత్రలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడించాలి
►కరివేపాకు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి వేయించాలి
►అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
►జీలకర్ర పొడి, మెంతుల పొడి, మిరప కారం, పసుపు, ఉప్పు జత చేసి బాగా కలియబెట్టాలి
►టొమాటో తరుగు వేసి ఒకసారి కలిపిన తరవాత చింత పండు పులుసు, తగినన్ని నీళ్లు పోయాలి
►చేప ముక్కలను వేసి కలిపి, పైన మూత ఉంచాలి
►ముక్కలను ఉడికిన తరవాత మంట తీసేయాలి
►పైన సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లి మూత ఉంచాలి
►వేడి వేడి అన్నంలోకి వడ్డించాలి.

తవ్వ గ్రిల్డ్‌ చికెన్‌
కావలసినవి: బోన్‌లెస్‌ చికెన్‌ – అర కేజీ (పెద్ద ముక్కలు); నూనె – కొద్దిగా; ఉప్పు – తగినంత; పసుపు – అర టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; మిరియాల పొడి – ఒకటిన్నర టీ స్పూన్లు; అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టేబుల్‌ స్పూన్లు; ఏలకుల పొడి – కొద్దిగా; పచ్చి మిర్చి ముద్ద – ఒక టేబుల్‌ స్పూను; ఆవ నూనె – 2 టీ స్పూన్లు; వాము – అర టీ స్పూను; చాట్‌ మసాలా – కొద్దిగా; చీజ్‌ తురుము – కొద్దిగా; సతాయ్‌ స్టిక్స్‌ – ఒక ప్యాకెట్‌; ఉల్లి తరుగు – అర కప్పు; టొమాటో తరుగు – ఒక కప్పు; క్యాప్సికమ్‌ తరుగు – ఒక కప్పు; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; నిమ్మ రసం – ఒక టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా.

తయారీ:
►చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కనుంచాలి
►ఒక పెద్ద పాత్రలో చికెన్‌ ముక్కలు, టొమాటో తరుగు, ఉల్లి తరుగు, క్యాప్సికమ్‌ తరుగు వేసి బాగా కలపాలి
►ఉప్పు, పచ్చి మిర్చి ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు జత చేసి మరోమారు కలిపి మూత పెట్టి సుమారు అర గంట సేపు పక్కన ఉంచాక, మూత తీసి కారం, మిరియాల పొడి, ఏలకుల పొడి, ఇంగువ, ►జీలకర్ర పొడి, నిమ్మ రసం, చీజ్‌ తురుము, ఆవ నూనె, కొత్తిమీర వేసి బాగా కలియబెట్టి పక్కన ఉంచాలి
►సతాయ్‌ స్టిక్స్‌ తీసుకుని చికెన్‌ ముక్కలను ఒకదాని తరవాత ఒకటి గుచ్చాలి
►స్టౌ మీద తవ్వ ఉంచి వేడి చేయాలి
►కొద్దిగా నూనె వేసి బాగా కాగాక చికెన్‌ ముక్కలను ఒకదాని పక్కన ఒకటి అమర్చాలి
►బాగా మెత్తబడే వరకు కాలనివ్వాలి (గ్రిల్‌ మీద ఉంచినప్పుడు మంట సిమ్‌లో మాత్రమే ఉండాలి)
►బాగా కాలిన తరవాత వాటిని ప్లేట్‌లోకి తీసుకుని, అమర్చాలి
►కొత్తిమీరతో అలంకరించి అందించాలి.

చింత చిగురు మాంసం కూర
కావలసినవి: మటన్‌ – అర కేజీ; చింత చిగురు – 150 గ్రా.; ఉల్లి  తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 5; కరివేపాకు – రెండు రెమ్మలు; అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – 2 టేబుల్‌ స్పూన్లు; ఎండు మిర్చి – 5; నూనె – 50 మి. లీ.; జీలకర్ర – ఒక టీ స్పూను; కారం – 3 టీ స్పూన్లు; పసుపు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – తగినంత; నీళ్లు – సరిపడా.

తయారీ:
►మటన్‌ను శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి
►చింత చిగురును శుభ్రంగా కడిగి, సన్నగా తరగాలి
►స్టౌ మీద కుకర్‌ ఉంచి వేడయ్యాక నూనె వేసి కాగాక, జీలకర్ర, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, ఎండు మిర్చి, కరివేపాకు ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించాలి
►అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి మరోమారు వేయించాలి
►సిద్ధంగా ఉంచిన మటన్‌ జత చేసి బాగా కలియబెట్టాలి
►పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం వేసి గరిటెతో కలపాలి
►టొమాటో తరుగు వేసి బాగా కలిపి, చింత చిగురు కూడా జత చేసి బాగా కలిపి, తగినన్ని నీళ్లు పోసి కుకర్‌ మూత ఉంచి ఆరేడు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి
►చివరగా సిద్ధంగా ఉంచిన కొత్తిమీరను పైన అలంకరించాలి
►అన్నంలోకి, రోటీలలోకి ఈ కూర రుచిగా ఉంటుంది.

– కర్టెసీ: స్వజన్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజమ్‌ అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్, భువనేశ్వర్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top