లేనట్లే... ఉన్నాడు!

లేనట్లే...  ఉన్నాడు!


నేను   నా దైవంసందేహం మంచిది.. ప్రశ్నలు జీవితానికి నిర్దేశం. కనబడేవన్నీ సత్యాలు కానప్పుడు కనపడనివి అసత్యాలు కాగలవా? దైవాన్ని అనుభూతి చెందుతాం..  కనిపించకపోయినా.. గిరిబాబుకు దేవుడి ఉనికి మీద ఎన్నో సందేహాలు. దేవుడికి ఎక్కుపెట్టిన ఎన్నో ప్రశ్నలు. లేనట్లే.. అనిపించినా.. ఉన్నాడనే సమాధానం.హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని సీనియర్‌ నటుడు గిరిబాబు ఇంటికి వెళ్లినప్పుడు ఆయన  విశ్రాంతిగా కూర్చొని టీవీలో సినిమా చూస్తూ కనిపించారు. ఒకప్పుడు తను విలన్‌గా నటించిన ‘కల్పన’ సినిమా అది! డెభ్లై ఐదేళ్ల వయసులో గత కాలపు స్మృతులను నెమరువేసుకుంటున్న గిరిబాబు ‘నేను–నా దైవం’ గురించి విస్తృతంగా చర్చించారు. దేవుడున్నాడా? లేడా? అని జీవితమంతా ఎదురైన సందేహాలను ఇలా వివరించారు.నాటి సినిమాలు ఇప్పుడు చూసుకుంటూ  హాయిగా గడుపుతున్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుడిని ఏవిధంగా తలుచుకుంటున్నారు?

గిరిబాబు: దేవుడున్నాడు.. అని బాగున్నప్పుడు అనిపిస్తుంది. బాగోలేనప్పుడు దేవుడే ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది? అని కూడా అనిపిస్తుంది. ఈ జీవితం ఇలా ఉంది అంతే! నేను నిత్యపూజలేవీ చేయను. మా ఇంట్లో కూడా చేయరు. అలాగని నేనేమీ నాస్తికుడిని కాదు. నాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ప్రతి పండగకు నా పిల్లలు, వారి పిల్లలు అందరం కలుస్తాం. ఏ దేవుడికి సంబంధించిన పండగైతే ఆ పూజ చేసుకొని, కలిసి భోజనం చేస్తాం. సంతోషంగా, సంతృప్తిగా ఉంటుంది. బయటకెళ్లినప్పుడు గుడిముందుగా వెళితే మాత్రం దండం పెట్టుకుంటాను.అంటే సంతోషం దేవుడితో ముడి పడి ఉందంటారా?

సంతోషంగా ఉండేలా ప్రయత్నించడం మన చేతుల్లోనే ఉంది. కానీ, అప్పుడు దేవుడు దయతలిచాడు అనిపిస్తుంది. మరణం మన చేతుల్లో లేదు. అప్పుడు దేవుడున్నాడా? అనే సందేహం కలుగుతుంది. నా మనవరాలు (కూతురి కూతురు) పెళ్లి తిరుపతిలో ఘనంగా చేశాం. కొత్తజంటతో కలిసి అందరం వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాం. చాలా సంతోషంగా ఉన్నాం. మరుసటి రోజు ఇంటికి వచ్చాం. మా అల్లుడు, మేమంతా సోఫాల్లో సేదతీరుతున్నాం. ఉన్నట్టుండి మా అల్లుడు ఆ సోఫాలోనే వాలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళితే ప్రాణం పోయిందన్నారు. ‘దేవుడా మేం చేసిన తప్పేంటి? ఎందుకిలా చేశావ్‌! రాత్రి వరకు నీ సన్నిధానంలోనే ఉన్నాంగా! ఒక్కరోజులో ఈ తేడా ఏంటి? పెళ్లికళతో ఉన్న ఇల్లు ఒక్కసారిగా ఇలా అయిపోయిందేంటి? నువ్వున్నావా? లేవా?!’ అనే సందేహం కలిగింది.దేవుడున్నాడు అనిపించిన సందర్భాలు?

మా అమ్మనాన్నలకు ఒక్కణ్ణే కొడుకును. గారాబంగా పెంచారు. కాలేజీ చదువులకు రాగానే పెళ్లి చేశారు. కాలేజీ రోజుల్లో విపరీతంగా నాటకాల్లో పాల్గొనేవాడిని. సినిమా ప్రకటనలు చూసి నా ఫొటోలను ఆ సంస్థలకు పంపుతుండేవాడిని. అలా దర్శకుడు ఎస్డీ లాల్‌ అబ్బాయి బాగున్నాడని సినిమాకు ఎంపిక చేసి, కబురు పంపారు. కొన్ని రీళ్లు తీసి డబ్బు లేక ఆ సినిమా తీయలేకపోయారు. కానీ, ఆరు నెలల తర్వాత ప్రొడ్యూసర్‌ అట్లూరి పూర్ణచంద్రరావు ‘జగమే మాయ’ సినిమాకు నా గురించి చెప్పారు. అక్కణ్ణుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఏ మాత్రం ప్రయాస పడకుండానే సినిమా అవకాశాలు విపరీతంగా వచ్చాయి. అప్పుడు చాలాసార్లు అనుకునే వాడిని దేవుడు వీరిద్దరి రూపంలో నాకీ అవకాశాన్నీ, నిలదొక్కునే స్థైర్యాన్నీ ఇచ్చాడని.‘ప్రేమకథ’ సినిమా షూటింగ్‌కి యూనిట్‌ సభ్యులతో కలిసి రైలులో ప్రయాణిస్తున్నాం. రైలు ప్రమాదం జరిగింది. నా వెంట వచ్చిన కెమరామన్లు, ఇంకొంతమంది ఆ దుర్ఘటనలో మరణించారు. నేను బతికాను. అప్పుడనిపించింది దేవుడున్నాడు అని. అయితే, ఆ చనిపోయినవారి వైపున దేవుడు ఎందుకు లేడు? అనే సందేహమూ వచ్చింది. ఇంకోసారి సంక్రాంతి పండగకు మా కుటుంబ సభ్యులమంతా కలిసి మా ఊరు బయల్దేరాం. దారిలో మా కారును లారీ ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో కొద్దిపాటి గాయాలతో మేమంతా బతికాం. అప్పుడూ అనిపించింది దేవుడున్నాడని.చావు బతుకులే దైవాన్ని పరిచయం చేస్తాయంటారా?

తల్లి గర్భంలో అంతా చీకటే. అయినా అక్కడ కాళ్లూ చేతులు ఆడిస్తుంటుంది శిశువు. గర్భంలోని నుంచి బయటకు అంటే వెలుగులోకి వచ్చినందుకు నవ్వాలి కానీ, కెవ్వుమని ఏడ్చేస్తుంది ఎందుకు? పెద్ద సందేహం. బహుశా పుడుతూనే తను చావుకు దగ్గర అవుతానేమో అని ఏడుస్తుందేమో! అనే ఆలోచన. ఈ సృష్టిలో మనకన్నా ముందు పశుపక్ష్యాదులున్నాయి. గింజలు తినో, గడ్డి తినో పెరుగుతాయి అవి. కానీ, వాటిని చంపి తినే పులి లాంటి జంతువులూ ఉన్నాయి. వీటిని పుట్టించిన దేవుడే వాటినీ పుట్టిస్తే సాటి జంతువును చంపి తినమని ఎందుకు పెట్టాడు. పాపం ఆ అమాయక జంతువు ఏం పాపం చేసింది? ఇదో సందేహం. రాతియుగంలో మనిషి జంతువులను చంపి తినేవాడు. అప్పుడు వాడికి దేవుడంటే తెలియదు. మెదడు వికాసం పొంది ఆలోచనలు చేయడం ఆరంభిస్తూ ఏదో శక్తి ఉందని గ్రహింపుకొచ్చాడు. ఆ ఆలోచన నుంచే హింసను వదిలేసి మునులు, రుషులు వచ్చారు. జనం పెరుగుతున్న కొద్దీ ఎవరికి వారు ఓ దేవుడిని సృష్టించుకున్నారు. ఆ విధంగా దేవుళ్ల సంఖ్య పెరిగింది. బలి ఇస్తే దైవం అనుగ్రహిస్తుందనే నమ్మకంలో ఇప్పటికీ చాలామంది ఉన్నారు. దేవుడు అమాయకజీవిని చంపమనే ఆలోచన మనిషికి ఎందుకు కల్పించాడు?!దేవుళ్ల సినిమాల్లోనూ నటించిన అనుభవాలు?

దేవతలు–మహిమలు ఉన్న సినిమాలు చాలానే చేశాను. అయితే, ‘దేవతలారా దీవించండి’ అనే సినిమాలో పామును దేవతగా చూపిస్తాం. కాసేపు పాము మనిషిలా మారుతుంది. తర్వాత మళ్ళీ పాములా కనిపిస్తుంది. పాము పట్ల మనం చూపే దైవభక్తి అంతా ఇంతాకాదు. నాగులచవితి, నాగుల పంచమి అంటూ పూజలు చేస్తాం. పుట్టలో పాలు పోసి భక్తిగా మొక్కుతాం. అయితే, నాకు అర్థంకానిదేంటంటే.. ఈ సృష్టిలో పశుపక్ష్యాదులన్నీ తమ పిల్లల్ని అత్యంత ప్రేమగా సాకుతాయి. మరో జంతువును చంపే పులి కూడా తన పిల్లలను ప్రేమగా చూసుకుంటుంది. మొసలి కూడా ఒడ్డున ఇసుక తవ్వి గుడ్లు పెట్టి, అవి పిల్లలు కాగానే జాగ్రత్తగా నోటకరుచుకు వెళ్లి నీళ్లలో వదిలిపెడుతుంది. కానీ, పాము అలా కాదే.. తన పిల్లలని తనే మింగుతుంది. ఈ సృష్టిలో తన పిల్లల మీద ఎలాంటి అఫెక్షన్‌ లేని ప్రాణి ఏదైనా ఉందంటే అది పామే! అలాంటి పాముకు పూజలేంటి?! పుట్టలో పాలు పోస్తారు. దానికి ఊపిరి ఆడక బయటకు వచ్చేస్తుంది. ఇది చూసి జనం పరవశించి పోతారు. ఏంటో ఇదంతా అనిపిస్తుంది. నాకు తెలిసినంతవరకు బహుశా శివుడి మెడలో ఆభరణంగా పాము ఉంటుంది కాబట్టి ఈ జనం పూజలు చేస్తుండవచ్చా? ఇలాంటి సందేహాలు కలుగుతాయి.

 

ఇలాంటి సందేహాలకు బీజం ఎక్కడ పడింది?

మా ఊళ్లో. మా ఊరు ప్రకాశం జిల్లాలోని రావినూతల. చాలా చిన్నప్పుడు. బడికెళ్లే రోజుల్లో రాత్రి పూట ఆరుబయట పడుకుని ఆకాశంకేసి గంటలు గంటలు చూసేవాడిని. అన్ని చుక్కలు ఆకాశంలో దేవుడు ఎలా పెట్టాడు, ఆ చుక్కలు దాటుకొని వెళ్లిపోతే ఏం వస్తుంది? అంత పెద్ద సముద్రానికి కూడా తీరం ఉంటుంది. మరి ఈ విశ్వం అవతల ఏముంటుంది? ఇలాంటి సందేహాలు ఎడతెరిపి లేకుండా వచ్చేవి. చాలామందికి ఈ ఆలోచన వచ్చే ఉంటుంది. తర్వాత వదిలేస్తారు. కానీ, ఇప్పటికీ ఇది పెద్ద సందేహమే. గ్రహాలు, పాలపుంతలు... ఇలాంటి వాటి గురించి తెలుసుకుంటుంటాను. వేరే గ్రహాలలో జీవరాశి ఉందని చెప్పే వార్తలు చదివి ఆశ్చర్యపోతుం టాను. అలా అయితే అక్కడే దైవం ఉండాలి? ఏదో శక్తి విశ్వమంతా ఉండాలి. అంత పెద్ద ఆకారం రూపం ఎలా ఉంటుందో?!

     

దేవుణ్ణి ఆకాశంలో వెతికే మీకు దైవం గురించి ఎవరు పరిచయం చేశారు?

మా ఇంట్లో పడమర ఇల్లు అని ఉండేది. అది దేవుడి గది! పండగలప్పుడు పూజలు, ప్రసాదాలు హడావిడులు ఉండేవి. అమ్మనాన్నలు దేవుడి గదిని అలంకరించి, నైవేద్యాలు పెట్టి నన్ను బొట్టు పెట్టుకో, దండం పెట్టుకోమనేవారు. వాళ్లు చెప్పినట్టు చేసేవాణ్ణి. మా ఊరి దగ్గరలో సింగరాయకొండ జాతర అద్భుతంగా సాగుతుంది. కొండ కింద ఆంజనేయ స్వామి, కొండమీద లక్ష్మీనరసింహ స్వామి. జాతర అంటే పండగే పండగ. స్నేహితులతో కలిసి ఒళ్లు అలసిపోయేలా తిరిగి ఇళ్లకు చేరుకునేవాళ్లం.

     

ఇంతకీ దేవుడున్నట్లా? లేనట్లా?

మా ఊళ్లో రాజుల కాలం నాటి శైవాలయాలు, వైష్ణవాలయాలు ఉన్నాయి. వాటి పునరుద్ధరణకు ఓ కమిటీ ఏర్పాటు చేశాం. దానికి నేనే అధ్యక్షుడిని. వాటిని బాగుచేయడమే కాకుండా నిత్యం పూజలు జరిగేలా, వార్షిక ఉత్సవాలు జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఇవి కాకుండా సాయిబాబా గుడి కూడా కట్టించాం. మా కుటుంబం అంతా ఊరెళ్లినప్పడల్లా దర్శనం చేసుకుంటాం. కిందటి నెల నా పుట్టినరోజు. వారం రోజుల ముందుగానే ఊరికెళ్లాను. గుళ్లన్నీ దర్శించి వచ్చాను. మా  చుట్టుపక్కల ఊళ్లవాళ్ళూ ఆ గుళ్లకు వచ్చి సంతోషంగా తిరిగివెళ్లడం నాకు నచ్చుతుంటుంది. అందుకోసమే నేను వెళుతుంటానని అనిపిస్తుంది. దైవం అంటే బతికినన్నాళ్లూ ఏదో ఒక రకంగా మన చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండేలా చూడటమే అని బలంగా అనిపిస్తుంది.నా భార్య శ్రీదేవితో నా అనుబంధం గురించి ఒక్కమాటలో చెప్పలేను. అందరినీ చక్కగా చూసుకునేది. ఆమె చేతి వంట అద్భుతంగా ఉండేది. మా నాన్న నాగయ్యకు ఇప్పుడు 107 ఏళ్లు. బిడ్డలా చూసుకునేది. కొడుకులు, కూతుళ్లు, మనవలు, మనవరాళ్లు అందరూ ప్రాణం పెడతారు తనంటే! బంధువుల్లోనూ అంతే! పూజలు, వ్రతాలు, నోములు ఎక్కడా లోపం చేసేది కాదు. ఓ ‘రోజు కాళ్లు నొప్పులు, జ్వరంగా ఉంది’ అంది. ఆసుపత్రికి తీసుకెళ్లాం. డాక్టర్లు అడ్మిట్‌ చేయాలన్నారు. ఒంట్లో ఏదో ఇన్ఫెక్షన్‌ అన్నారు. మూడునెలల ఏడురోజుల పాటు ఆసుపత్రిలో నరకయాతన అనుభవించి కిందటేడాది మమ్మల్ని వదిలి వెళ్లిపోయింది. అప్పుడనిపించింది ‘ఏం తప్పు చేశాను? నన్ను ప్రాణంగా చూసుకునే నా అర్ధాంగిని దేవుడెందుకు తీసుకెళ్లిపోయాడు. అసలు దేవుడున్నాడా? ఉంటే ఇలా జరుగుతుందా?’ పెద్ద సందేహం.  

- నిర్మలారెడ్డి చిల్కమర్రి

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top