ప్రకృతి వైపు మరలండి..

special  chit chat with Dr. Khader Wali - Sakshi

ఇంటర్వ్యూ

పూజించండి.. ఆరాధించండి...

కొర్రలు, అరికలు వంటి సిరిధాన్యాలు, కషాయాలతోనే మధుమేహం, కేన్సర్‌ వంటి జబ్బులను చాలా మందికి నయం చేస్తున్నారని విన్నాం.   
మీరు విన్నది నిజమే. గత 20 ఏళ్లు నేను నమ్ముతున్న మార్గం ద్వారా మంచి ఫలితాలను సాధిస్తున్నాను.  అసలు మంచి ఆహారం తీసుకోవడమే సగం ఆరోగ్యాన్ని పొందడం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండండి అని దేవుడు వైవిధ్యమైన ఆహారాన్ని ప్రతి చోటా సృష్టించాడు. కానీ మనం బియ్యం, గోధుమలతోనే సరిపెట్టుకుంటూ సంక్షోభంలో పడిపోయాం. దీంట్లో నుంచి బయటపడాలంటే, ప్రకృతి వైపు నడవాలి. తినే ఆహారంలో మార్పు చేసుకుంటే  సంపూర్ణ ఆరోగ్య స్థితిని పొందవచ్చు. సిరిధాన్యాలే మనుషులకు అసలైన ఔషధ గుణాలున్న ఆహారం. ఆ చైతన్యం నింపడానికే మైసూరులో ‘కాడు కృషి’ని నెలకొల్పాం. గత 20 ఏళ్లుగా రైతులు, రోగులతో కలిసి పనిచేస్తున్నాం. 

కేన్సర్, మధుమేహం అనువంశికం అనే ప్రచారం ఉంది. 
కేన్సర్,  మధుమేహం.. వారసత్వంగా సంక్రమించేవి కాదు. తీసుకునే ఆహారం, జీవనశైలి సమస్యల వల్లనే అవి వస్తున్నాయి. ఎగ్జిమా, కొన్నిరకాల బుద్ధిమాంద్యాలు మాత్రమే అనువంశిక జబ్బులు. పూర్వం కేన్సర్, మధుమేహం ఎక్కడో ఒకరికి వచ్చేవి. ఇప్పుడు ఎటు చూసినా ఈ రోగులు కనిపిస్తున్నారు. ఆహారం మారిపోవటం అంటే.. వాణిజ్యకరణ చెందిన ఆహారం మనుషులను రోగగ్రస్తులుగా మార్చుతున్నది. 

∙అంటే విదేశీ ఆహారోత్పత్తులే సమస్యా?
మనం విదేశీ ఆహారాన్ని తప్పుపట్టడం లేదు.  వాళ్ల దేశంలో ఆ ఆహార పదార్థాలు మంచివే. అండు కొర్రలను అమెరికన్‌ మిల్లెట్‌ అంటారు. వాళ్లు పూర్వం తింటుండేవాళ్లు. గుమ్మడికాయలు కూడా తినేవాళ్లు. అవి తిన్నన్నాళ్లు వాళ్లకు గుండె జబ్బుల్లేవు. అటువంటి సహజమైన ఆ ఆహారాలను వదిలేసి, జన్యుమార్పిడి ఆహారాలు తింటున్న తర్వాత అక్కడా జబ్బులు పెరిగాయి. మనకు తెలిసినన్ని ధాన్యాలు వాళ్లకు తెలియవు. కొర్రలు మన దగ్గర 108 రకాలుండేవి. ఈ వైవిధ్యతను కాపాడుకునే జ్జానం వాళ్లకు లేదు. కొర్రలను ఇటాలియన్‌ మిల్లెట్‌ అంటారు. పూర్వం వాళ్లు తినేవాళ్లు. ఇప్పుడు విత్తనాలు కూడా లేకుండా నాశనం చేశారు. నేను 20 ఏళ్ల క్రితం అమెరికా నుంచి తిరిగి ఇక్కడకు వచ్చి సిరిధాన్యాల విత్తనాలు సేకరించి, రైతులతో సాగు చేయించకపోతే ఇవి కూడా అంతరించిపోయేవి. 

∙కేన్సర్, మధుమేహం వంటి జబ్బులను సిరిధాన్యాలు, కషాయాలు ఎలా తగ్గించగలుగుతున్నాయి.. ఇందులో శాస్త్రీయత ఏమిటి? 
సిరిధాన్యాలు (కొర్రలు(Foxtail Millet), అండుకొర్రలు (Browntop Millet), సామలు(Little Millet), ఊదలు (Barnyard Millet), అరికలు(Kodo Millet)) ఔషధ గుణాలు కలిగిన, ప్రకృతి ప్రసాదించిన సహజమైన ఆహార ధాన్యాలు. కషాయాలు మన సంప్రదాయ జీవనంలో అంతర్భాగంగా పూర్వం నుంచీ ఉన్నవే. వీటి ద్వారా ఎవరైనా వారి వారి రోగ స్థితిగతులను బట్టి.. 6 నెలల నుంచి 2 ఏళ్లలో ఆరోగ్యవంతంగా మారవచ్చు. చాలా ఏళ్లుగా రకరకాల రోగాలతో బాధపడుతున్న వేలాది మంది అనుభవాల ద్వారా ఇది రూఢీ అయిన విషయం. 

చిరుధాన్యాలలో 5 రకాలను ‘సిరిధాన్యాలు’గా మీరు పిలుస్తున్నారు. వీటికి ఆ ఔషధ గుణాలు ఎలా వచ్చాయి?
ఏదైనా ఒక ఆహారపదార్థం ఎంత ఆరోగ్యకరమైనది, ఎంత ఔషధగుణం కలిగినది అనేది చూడాలంటే.. అందులో పీచుపదార్థం (ఫైబర్‌) ఎంత ఉంది? పిండిపదార్థం (కార్బోహైడ్రేట్లు) ఎంత ఉంది? అనే విషయాలు చూడాలి. వరి బియ్యంలో పీచు 0.2 శాతం. పిండిపదార్థం 79 శాతం. అంటే వీటి నిష్పత్తి 385. ముడిబియ్యం తిన్నా ఈ నిష్పత్తిలో పెద్దగా తేడా ఉండదు. 5 రకాల సిరిధాన్యాల్లో పీచు 8 నుంచి 12.5 శాతం వరకు.. పిండి పదార్థం 60 – 69 శాతం వరకు ఉంది. వీటి నిష్పత్తి 5.5 నుంచి 8.8 మధ్యలో ఉంటుంది. ఇది 10 కన్నా తక్కువగా ఉంటే రోగాలను సైతం తగ్గించే ఔషధ శక్తిగల ఆహారంగా భావించాలి. వీటిని తిన్న తర్వాత గ్లూకోజ్‌ను 6–8 గంటల్లో నెమ్మదిగా సమతుల్యంగా రక్తంలోకి విడుదల చేస్తాయి. అవసరానికి మించి గ్లూకోజ్‌ రక్తంలోకి విడుదల చేయకపోవడం, అనేక సూక్ష్మపోషకాలు, ప్రొటీన్లు కలిగి ఉండటం వీటి విశిష్టత. సిరిధాన్యాలను తిన్న వారికి వ్యాధి తీవ్రతను బట్టి.. మధుమేహం, కేన్సర్, ఊబకాయం వంటి మొండి జబ్బులు కూడా 6 నెలల నుంచి 2 ఏళ్లలోగా వాటంతట అవే తగ్గిపోతాయి. సిరిధాన్యాలు పోషకాలను పుష్కలంగా అందించడమే కాకుండా దేహంలో నుంచి రోగకారకాలను తొలగించి శుద్ధి చేస్తాయి. సిరిధాన్యాల్లో పీచు ఎక్కువ కాబట్టి కనీసం 2 గంటలు నానబెట్టి వండుకొని తినాలి. జొన్నలు, రాగులు, సజ్జలకు తటస్థ ధాన్యాలని పేరు. వీటిల్లో పీచు శాతం 4–6 శాతం. తిన్న 2 గంటల్లోనే గ్లూకోజ్‌ రక్తంలో కలిసిపోతుంది. అందువల్ల ఆరోగ్యసిరినిచ్చే సిరిధాన్యాలే నిజమైన, సహజమైన ఆహారం.  

డాక్టర్లు ఇచ్చిన మందులు మామూలుగానే వాడుకోవచ్చా..?
వాడుకోవచ్చు. అయితే, ఇక్కడ ఒక మినహాయింపు ఉంది. అల్లోపతి వైద్యవిధానాన్ని నేను ప్రోత్సహించను. ఆయుర్వేదం, యునాని, హోమియో పద్ధతుల్లో ఏ రోగానికి చికిత్స పొందుతున్న వారైనా ఆయా మందులు వాడుకుంటూనే ఆహారంలోను, జీవనశైలిలోను మార్చు చేసుకుంటే ఆరోగ్యవంతులు కావచ్చు. 

ప్రశ్నలు–జవాబులు
డాక్టర్‌ ఖాదర్‌వలి ఈ కథనంలో వ్యక్తపరచిన అభిప్రాయాలపై ప్రశ్నలను పాఠకులు ‘ఎడిటర్‌ (సిరిధాన్యాలతో చికిత్స), సాక్షి దినపత్రిక, సాక్షి టవర్స్, రోడ్డు నంబర్‌ –1, బంజారాహిల్స్, హైదరాబాద్‌ – 500034’ చిరునామాకు పంపవచ్చు. ఆ ప్రశ్నలకు డా. ఖాదర్‌ ఇచ్చే జవాబులను ‘సాక్షి’లో ప్రచురిస్తాం. 
– ఎడిటర్‌  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top