బ్యాక్‌ టు బి.సి

Sangeetha is designing a new generation of children - Sakshi

బిఫోర్‌ సెల్‌ఫోన్‌

సంగీత.. ఫ్యాషన్‌ డిజైనర్‌. ఎంతమంది లేరూ! సంగీత.. మోడల్‌ కూడా. వెరీ కామన్‌ థింగ్‌. అయితే డిజైనింగ్, మోడలింగ్‌ కాదు ఆమె ప్రత్యేకత. అవి రెండూ టైమ్‌ ఉన్నప్పుడు చేస్తుంటారు సంగీత. టైమ్‌ అంతా పెట్టి చేస్తున్నది వేరే ఉంది. అదీ డిజైనింగే, అదీ మోడలింగే! అవును. సంగీత ఓ కొత్త తరం పిల్లల్ని  డిజైన్‌ చేస్తున్నారు. ఆ పిల్లల్ని ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచానికి రోల్‌ మోడల్స్‌గా అందిస్తున్నారు. అందుకు ఆమె ఎంచుకున్న దారి.. ఆటలు! పబ్జీలు, పొకెమాన్‌ల ఆన్‌లైన్‌ ఆటలు కాదు. పచ్చీస్, బారాగట్టా వంటి బీసీ (బిఫోర్‌ సెల్‌ఫోన్‌) ఆటలు! 

అది ప్రైమరీ స్కూలు. పిల్లలకు అక్షరాలు దిద్దిస్తోంది టీచర్‌. ఓ తొమ్మిదేళ్ల బాలుడికి అక్షరాలు చక్కగా కుదరడం లేదు. తన ప్రి–స్కూల్‌ కోర్సులో భాగంగా అన్ని క్లాసులనూ పర్యవేక్షించడానికి అప్పుడే ఆ క్లాస్‌రూమ్‌లోకి వచ్చిన సంగీతా రాజేశ్‌ కంట పడిందా పిల్లవాడి చేతిరాత. పలక మీద ఇంగ్లిష్‌లో ‘ఏ’ అక్షరాన్ని రాయమన్నారామె. ఆ పిల్లవాడు రాశాడు. అయితే దానిని అక్షరం అనడానికి ఆమె మనసొప్పుకోలేదు. కుదురుగా కూర్చుని అక్షరాలన్నింటినీ చక్కగా రాసి చూపించమన్నారు సంగీతారాజేశ్‌. ‘‘అప్పుడా పిల్లవాడు ఇచ్చిన సమాధానంతో నా బుర్ర తిరిగిపోయింది’’ అన్నారామె. ‘‘అక్షరాలను గుర్తు పట్టడం వస్తే చాలు కదా మేడమ్, అందంగా, గుండ్రంగా రాయకపోతే ఏమవుతుంది? ఏది రాయాలన్నా కీ బోర్డు మీదనే టైప్‌ చేస్తాను కదా’’ అన్నాడా కుర్రాడు! 

మెదడు పరుగులే.. కాళ్ల పరుగుల్లేవు!
వీడియో గేమ్‌ల తరాన్ని దాటేశాం. ఈ తరం చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఆటవస్తువైపోయింది. ఆటలన్నీ అందులోనే. ఆ ఆటలు ఆడేటప్పుడు వాళ్ల మెదడు పాదరసం కంటే వేగంగా పనిచేస్తుంటుంది. పిల్లలు హైపర్‌ యాక్టివ్‌ అయిపోతున్నారు. ప్రతి చిన్న విషయానికీ అసహనమే. లిఫ్ట్‌ పై అంతçస్తు నుంచి కిందికి వచ్చే వరకు కూడా నిరీక్షించలేకపోతున్నారు. కంప్యూటర్‌ సెకన్లలో రెస్పాండ్‌ కాకపోతే మౌస్‌ను టపటపా కొడుతున్నారు. క్యూలో తమ వంతు వచ్చే వరకు డిసిప్లిన్‌తో నిలబడటానికీ విసుగే. ఇలాగే పిల్లలు పెరిగి పెద్దయితే సమాజంలో ఇమడలేరు. ఇలాంటి పిల్లలతో తయారయ్యే సమాజంలో మనుషుల మధ్య పరస్పర సంబంధాలు ఆరోగ్యకరంగా ఉండవు. వీటన్నింటికీ విరుగుడు వాళ్లను కూర్చోబెట్టి ఆటలాడించడమేనంటారు సంగీత.

పులీమేక ఆటల్లో జీవితం ఉంటుంది
‘‘అవుట్‌డోర్‌ గేమ్స్‌ శారీరక చురుకుదనాన్ని, మానసిక ఆనందాన్ని ఇస్తాయి. ఇన్‌డోర్‌ గేమ్స్‌ పిల్లల్లో పరిణతిని తెస్తాయి. లైఫ్‌స్కిల్స్‌ నేర్పిస్తాయి. ఒక టాస్క్‌ కంప్లీట్‌ అయ్యే వరకు దాని మీద నుంచి దృష్టిని పక్కకు పోనివ్వని విధంగా ఏకాగ్రతను అలవరుస్తాయి. వ్యక్తిత్వ వికాసం, నిగ్రహశక్తి, సిచ్యుయేషన్‌ మేనేజ్‌మెంట్‌ వంటివి ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరం ఉండదు. అవన్నీ మన ఆటల్లో నిబిడీకృతమై ఉన్నాయి. అందుకే పచ్చీస్, వామనగుంటలు, విమానం (యుద్ధంలో మెళకువలు), పరమపదసోపాన పటం (వైకుంఠపాళీ), పులి– మేక, చదరంగం, బారాగట్టా వంటి ఆటలను అలవాటు చేస్తే పిల్లల్లో మెదడు స్థిమితంగా ఆలోచించడం మొదలు పెడుతుందనిపించింది. ఇప్పుడు పిల్లలు ఎదుర్కొంటున్న అటెన్షన్‌ డెఫిషియెన్సీకి కూడా అసలైన మందు మన ఇన్‌డోర్‌ గేమ్స్‌లో ఉంది’’ అన్నారామె. సంగీత ప్రి స్కూల్‌ ఎడ్యుకేషన్‌లో కోర్సు చేశారు. ప్రి స్కూల్స్‌కి కరికులమ్‌ డిజైన్‌ చేసిన అనుభవం కూడా ఉందామెకి. ఆమె స్వయంగా ‘స్మైల్‌’ పేరుతో స్పెషల్‌ చిల్డ్రన్‌కి స్కూల్‌ నడుపుతున్నారు.

పిల్లలు స్కూల్‌కి.. తను ‘ప్రి–స్కూల్‌’కి
తమిళనాడు, మదురై దగ్గర దిండిగల్‌లో పుట్టి పెరిగిన సంగీత డిగ్రీ వరకు అక్కడే చదివారు. పెళ్లి అనంతరం హైదరాబాద్‌ వచ్చారు. ‘‘పెళ్లయిన తర్వాత పీజీ చేశాను. తొమ్మిదేళ్లపాటు ఇద్దరు పిల్లలతో గృహిణిగా ఉన్నాను. నా పిల్లలను స్కూలుకి పంపించాల్సి వచ్చినప్పుడు ప్రి స్కూల్‌ ఎడ్యుకేషన్‌ మీద నా దృష్టి పడింది. నా కెరీర్‌ని స్కూల్‌లో డెవలప్‌ చేసుకుంటే పిల్లలతోపాటు వెళ్లి రావచ్చు అనుకున్నాను. ప్రి స్కూల్‌ కోర్సు చేశాను, కొన్ని కార్పొరేట్‌ స్కూళ్లతో కలిసి పని చేశాను. ఆ అనుభవంతో సొంతంగా స్కూలు పెట్టాను. స్పెషల్‌ కిడ్స్‌కి అవసరమైనట్లు డిజైన్‌ చేశానా స్కూల్‌ని. నార్మల్‌ కిడ్స్‌ కోసం ఒక సెక్షన్‌ ఉండేది.

అప్పట్లో దుబాయ్‌ నుంచి ఒక తల్లి తన పిల్లవాడి కోసం అక్కడ మంచి స్కూల్‌ లేదని మా దగ్గరకు వచ్చింది. ఇప్పుడా అబ్బాయి మా దగ్గరే ఎయిత్‌ క్లాస్‌ చదువుతున్నాడు. ఆ అబ్బాయితో మొదలైన స్కూల్‌ ఇప్పుడు 45 మంది పిల్లలతో నడుస్తోంది. స్కూల్‌ని విస్తరించాలనే ఉద్దేశంతో ఐఎస్‌బీ కోర్సు చేశాను. కోర్సు చేసిన తర్వాత స్పెషల్‌ కిడ్స్‌ కోసం డిజైన్‌ చేసిన స్కూల్‌ని వ్యాపారపరంగా ఫ్రాంచైజీలు ఇవ్వడానికి నాకు మనసు రాలేదు. ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్లు నేను నడిపినట్లు నడపకపోతే ఆ పిల్లల భవిష్యత్తు మరింత గందరగోళమవుతుంది. అందుకే స్కూలును నా ఆత్మసంతృప్తి కోసమే నడపాలి, వ్యాపారం చేయకూడదనే నిర్ణయానికి వచ్చేశాను’’ అన్నారు.

ఆడించడానికి బొమ్మలు చేయించారు
‘‘ఒక సమస్య నా దృష్టిలో పడితే దానికి పరిష్కారం కోసం ఆలోచించడం నాకలవాటు. అది నాకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తుందా లేదా అనేది తర్వాతి మాట. ముందా పని చేసేస్తాను. అలా మొదలైందే ఈ ఆటబొమ్మల పునః పరిచయం. మన సంప్రదాయ ఆటవస్తువులను పిల్లలకు పరిచయం చేయాలంటే ఆటవస్తువులను తయారు చేయించాలి. వాటికోసం హైదరాబాద్‌లో వడ్రంగులు సరిగ్గా దొరకలేదు. దాంతో తమిళనాడు, కర్ణాటకలోని పల్లెలకు వెళ్లి అక్కడి వడ్రంగుల చేత ఆటవస్తువులను తయారు చేయిస్తున్నాను. పిల్లలకు ఆడటం నేర్పించడానికి స్కూళ్లలో చిన్న చిన్న పోటీలు పెడుతున్నాం. నా అనుభవంలో తెలుసుకున్నదేమిటంటే.. ఈ ఆటలు కొన ఊపిరితో ఉన్నాయి. కొన్ని ఇళ్లలో పిల్లలకు అలవాటు చేస్తున్నారు. అయితే అది నూటికి పది మందిలోపే. తొంభై శాతం పిల్లలకు మేము పెడుతున్న వర్క్‌షాపులతోనే పరిచయమవుతున్నాయి ఈ ఆటలు. మా ఆటవస్తువుల అమ్మకం కోసమే అయితే ఎగ్జిబిషన్‌లో స్టాల్‌ పెట్టవచ్చు. నా ఉద్దేశం పిల్లలకు ఆడటం నేర్పించడం. అందుకే స్కూళ్లకు వెళ్లి పిల్లలకు ఆట నేర్పించే పని కూడా మేమే చేస్తున్నాం. 

పరీక్షలకూ ఆటల ప్రిపరేషన్‌!
ఆటలు నిజాయితీగా ఆడితే తోటి పిల్లలందరూ స్నేహితులవుతారు, మోసపూరితంగా ఆడే వాళ్లను దూరం పెడతారు. మోసం చేసే వాళ్లు తమను తాము తెలివైన వాళ్లమనే భ్రమలో ఉంటారు, కానీ అది ఎక్కువ కాలం నిలవదనే వాస్తవాన్ని ఆటల్లోనే తెలుసుకుంటారు. ఒక పిల్లాడు తాను గెలవడం కోసం ఒక అబద్ధం చెబితే, అది అబద్ధం అని తెలిసినప్పుడు మిగిలిన పిల్లలందరూ ఆ పిల్లవాడిని దొంగను చూసినట్లు చూస్తారు. అది ఆ ఒక్కడికే కాకుండా అప్పుడు ఆటలో ఉన్న వాళ్లందరూ తెలుసుకుంటారు. అలాగే ఈ ఆటలు చదివిస్తాయి కూడా. కొన్ని ఆటలు పూర్తవడానికి రెండు–మూడు గంటల టైమ్‌ పడుతుంది. అంతసేపూ ఏకాగ్రతతో కూర్చోవడం అలవాటవుతుంది పిల్లలకు. పెద్ద తరగతులకు వెళ్లిన తర్వాత పరీక్షలకు ప్రిపేర్‌ అవ్వాలంటే ఒక టాపిక్‌ మీద అంత టైమ్‌ ఉండగలగడం వస్తుంది ఈ ఆటలతో. ‘మా వాడికి తెలివి ఉందండీ. చాలా చురుగ్గా ఉంటాడు. కానీ కుదురుగా కూర్చోవడమే కష్టం. ఒక గంట కూర్చోపెట్టలేకపోతున్నాం’ అని బాధపడే తల్లిదండ్రులందరికీ ఈ ఆటలు చక్కటి పరిష్కారం’’ అన్నారు సంగీత.
– వాకా మంజులారెడ్డి
ఫొటో : శివ మల్లాల

మా అమ్మ కోప్పడుతుంటుంది
‘‘స్కూలు, ఆటవస్తువుల పునః పరిచయం వంటివన్నీ నా ఆత్మసంతృప్తి కోసం చేస్తున్నాను. నేను ఉపాధి పొందడానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు ఫ్యాషన్‌ డిజైనింగ్‌ వైపు మళ్లింది నా ఆలోచన. అందులో దిగిన తర్వాత అదొక బిజినెస్‌ సైన్స్, చాలా సెన్సిబుల్‌గా మార్కెట్‌ చేయాలని తెలిసింది. డిజైనింగ్‌లో క్రియేటివిటీతోపాటు చాలా శాస్త్రబద్ధంగా చేయగలుగుతున్నాను. కానీ మార్కెట్‌ దగ్గర విఫలమయ్యాను. నా ఇంట్రెస్ట్‌లన్నీ కలగలుపుతూ ఒక పీస్‌ చేయగలుగుతున్నాను. దానిని అంత ధరకు అమ్మడం ఎలాగో నేర్చుకోవాలిప్పుడు. నేను డిజైన్‌ చేసిన చీరను ప్రదర్శించడానికి మోడల్స్‌కి డబ్బిచ్చే బడ్జెట్‌ లేదు నాకు. అందుకే నేనే స్వయంగా ప్రదర్శిస్తూ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ చేస్తున్నాను.


కాళహస్తిలో కలంకారీ కళాకారుల కష్టాన్ని నా ఫోన్‌లో షూట్‌ చేసి వీడియోలు పోస్ట్‌ చేశాను. ఒక చీర అందంగా తయారు కావాలంటే కోట నుంచి సాదా చీర, కాళహస్తిలో పెన్‌కలంకారీ డిజైన్‌ వేయడం, రంగులు అద్దడం, మగ్గం మీద పని, టైలర్‌ అప్లిక్‌ వర్క్‌ చేయడం వంటి దశలన్నీ చూపించాను. పదివేల రూపాయల చీర వెనుక ఎంతమంది శ్రమ ఉందో తెలియచేయడంలో, ఆ చీర కొంటే పరోక్షంగా ఎంతమంది ఉపాధి పొందుతారో తెలియచేయడంలో సక్సెస్‌ అయ్యాను. చీరల గురించి పాఠాలు చెప్పడం మాని వ్యాపారం చేయడం నేర్చుకోమని మా అమ్మ కోప్పడుతుంటుంది’’ అన్నారు సంగీత తన ‘సంగీత ఫ్యాషన్‌ స్టూడియో’ గురించి చెబుతూ.
– సంగీతా రాజేశ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top