‘సమంత’ర రేఖ

Samantha In Oh Baby Movie Promotions - Sakshi

సమాంతర రేఖలు కలవవు.. కానీ ఆ పట్టాల మీదే జీవిత రైలు నడుస్తుంది.
కమర్షియల్‌ సినిమా ఒక రేఖ అయితే.. సమాంతర సినిమా రెండో రేఖ.
పాటలు పాడుతూ కమర్షియల్‌ సినిమాలు చేసిన సమంత ఇప్పుడు తనలోకి తనే తొంగి చూసుకుంటోంది.
మనందరిలోనూ ఈ రేఖలు ఉండాలి. ఒకటి.. అందరి కోసం... ఒకటి... మన కోసం. 

పెళ్లికి ముందు సక్సెస్‌లు చూశారు. తర్వాత రంగస్థలం, మహానటి, యు టర్న్, మజిలీ.. ఇలా వరుస విజయాల ఈ సక్సెస్‌ రైడ్‌ గురించి?
సక్సెస్‌ రైడ్‌ అనేది వినడానికి బాగుంది. కానీ ప్రెషర్‌ కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే మన గత సినిమా కంటే నెక్ట్స్‌ సినిమా స్క్రిప్ట్‌ బావుండాలి. అప్పుడే ఈ రైడ్‌ కంటిన్యూ అవుతుంది. అందుకే ఏది పడితే అది అంగీకరించ కూడదనుకున్నా. దీనివల్ల చేసే సినిమాల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. అయితే క్వాలిటీ సినిమాలు మాత్రమే బయటకు వస్తాయి. సంఖ్య తగ్గినా ఫర్వాలేదనుకుంటున్నా.

ఒకప్పుడు ఏడాదికి ఒకటో రెండో లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ వచ్చేవి. మహానటి, యు టర్న్, ఇప్పుడు మీరు నటించిన ‘ఓ బేబి’.. తెలుగులో ఫీమేల్‌ ఓరియంటెడ్‌ సినిమాలకు కొత్త డోర్స్‌ ఓపెన్‌ అయ్యాయనుకోవచ్చా?
అనుకోవచ్చు. అయితే ఈ లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌ కొన్నిసార్లు ఒక్క సెక్షన్‌కే రీచ్‌ అవుతున్నాయి. అలా కాకూడదని కోరుకుంటున్నాను. ఉదాహరణకు ‘మహానటి’ కమర్షియల్‌గా పెద్ద సక్సెస్‌. ఆ తర్వాత నేను ‘యు టర్న్‌’ చేశాను. ఆ సినిమా అనుకున్నంత కలెక్ట్‌ చేయలేదు. కానీ తక్కువ కలెక్షన్లు వచ్చాయని మనమెప్పుడూ ఆడియన్స్‌ను నిందించకూడదు. యూనివర్శల్‌ సబ్జెక్ట్స్‌ చేయాలి. ‘యు టర్న్‌’ మంచి సినిమానే. రివ్యూలు బావున్నాయి కదా, ఎందుకు కలెక్షన్స్‌ రాలేదు? అంటే థ్రిల్లర్‌ మూవీ ఆడియన్స్‌ నంబర్‌ తక్కువ ఉండొచ్చేమో. ఆ సినిమా నుంచి నేనేం నేర్చుకున్నానంటే.. అందరూ చూసే కథలతో సినిమాలు చేయాలని. ఇప్పుడు నేను చేసిన ‘ఓ బేబీ’ అన్ని వర్గాలవారికీ నచ్చే విధంగా ఉంటుంది. మంచి కామెడీ, చక్కని ఎమోషన్స్‌ ఉన్నాయి.

వరుసగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తే ‘మనల్ని ఈ జానర్‌కే పరిమితం చేస్తారేమో? హీరోలు మనల్ని పక్కన పెట్టేస్తారేమో?’ అనే భయాలు ఉంటాయా?
హీరోల గురించి ఆలోచించకుండా మన దారి మనమే సెట్‌ చేసుకోవాలి. కెరీర్‌ స్టార్టింగ్‌ స్టేజ్‌లో కమర్షియల్‌ సినిమాలు చేయాలి. ఓ పేరు సంపాదించుకోవాలి. హీరోయిన్‌గా పదేళ్లు అయిపొయ్యాక కూడా అదే  పాటలు.. అవే డ్యాన్సులు అంటే యాక్టర్‌గా కచ్చితంగా నిరాశ చెందుతాం. ఇన్ని సినిమాలు చేశాక ఇంకా అవే కమర్షియల్‌ చేస్తూ ఉంటే కేవలం డబ్బు కోసమే నేను సినిమాలు చేసినట్టు ఉంటుంది. అప్పుడు నాకు నేనే రోబోలా అనిపిస్తాను. ప్యాషన్‌ లేకుండా వర్క్‌ చేస్తున్న ఫీలింగ్‌ నాకు వస్తుంది. అందుకే దారి మార్చాలనుకున్నాను. మరి.. కెరీర్‌ స్టార్టింగ్‌లోనే ఇలాంటి సినిమాలు చేయొచ్చు కదా అంటే.. ఇండస్ట్రీకి రావడం రావడమే ‘సోలో’ ఫిల్మ్స్‌కి అవకాశం తక్కువ.

తక్కువ అంటే.. లేడీ ఓరియంటెడ్‌ మూవీ చేయాలంటే క్రేజ్‌ ఉన్న హీరోయినే చేయాలంటారా?
కావొచ్చు. థియేటర్లకు ప్రేక్షకులను తీసుకు రావాలి కదా. కెరీర్‌ స్టార్టింగ్‌లోనే ఫీమేల్‌ ఓరియంటెడ్‌ మూవీకి ఆడియన్స్‌ని లాగేంత కెపాసిటీ హాలీవుడ్‌లో ఉంటుంది. ఇక్కడ కూడా అలా జరగాలి. అయితే ఇంకా టైమ్‌ పడుతుందనుకుంటున్నాను.

కొరియన్‌ సినిమా ‘మిస్‌. గ్రానీ’కి ‘ఓ బేబి’ రీమేక్‌. ఆ సినిమా చూసినప్పుడు ఏమనిపించింది?
మన తెలుగు సినిమా చూస్తున్నట్టే అనిపించింది. కొరియన్‌ వాళ్ల ఎమోషన్స్, కల్చర్, ఫ్యామిలీ ఇవన్నీ మన కల్చర్‌కు దగ్గరగా అనిపించాయి. వెంటనే కనెక్ట్‌ అయ్యాను. కథలో ఆ కనెక్టివిటీ ఉంది కాబట్టే ఈ సినిమాను ఏడు భాషల్లో రీమేక్‌ చేశారు. డిస్నీ సినిమాలు అందరికీ కనెక్ట్‌ అవుతాయి కదా. ఈ సినిమా కూడా డిస్నీ సినిమాలానే ఉంటుంది. 

‘ఓ బేబీ’లో వృద్ధాప్యంలో ఉన్న మీ పాత్రకు మళ్లీ యవ్వనంలోకి వచ్చేలా మేజిక్‌ జరుగుతుంది. లైఫ్‌లో మళ్లీ వెనక్కి వెళ్లే చాన్స్‌ వస్తే ఏదైనా తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటారా?
అలాంటిది ఏమీ లేదు. జరిగిన ప్రతిదీ మన మంచికే జరిగింది అనుకుంటాను. దేనికీ రిగ్రెట్‌ ఫీల్‌ అవ్వను. నాకు జరిగిన ప్రతిదీ ఇవాళ నన్ను ఓ స్ట్రాంగ్‌ పర్సన్‌గా తయారు చేసిందనే నమ్ముతాను. తప్పు జరిగితేనే ఒప్పు ఏంటో తెలుసుకుంటాం. అందుకే ఏదీ మార్చదలచుకోవడం లేదు. నాకు యాక్టింగ్‌లో గురువులు ఎవరూ లేరు. నేను చేసిన ప్రతీ సినిమా ఏదోటి నేర్పింది. తప్పు చేస్తే అందులో నుంచి ఓ పాఠం వస్తుంది. ఆ పాఠం భవిష్యతులో ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుందనుకుంటా. 

‘ఓ బేబీ’ సినిమాకు ఎక్కువ మంది ఉమెన్‌ పని చేయడం ఎలా అనిపించింది?
రిలీజ్‌కు మూడు నెలల ముందే సినిమా రెడీ అయింది. ఒక్కరోజు షూటింగ్‌ కూడా ఆలస్యం కాలేదు. వాయిదా పడిన సందర్భాలూ లేవు. అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగింది. నిజం చెప్పాలంటే మేం సినిమా ఎప్పుడు స్టార్ట్‌ చేశాం ఎప్పుడు పూర్తి చేశామో కూడా చాలా మందికి తెలియదు. ఇండస్ట్రీలో మా (ఉమెన్‌) సంఖ్య చాలా తక్కువ. నిజానికి మెన్‌తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ కష్టపడతాం. ఒక అమ్మాయికి పని చెబితే అది పూర్తయిందా? లేదా అని ఫాలో అప్‌ చేయాల్సిన అవసరం లేదు. పని జరిగిపోతుంది. డైరెక్టర్‌ నందినీరెడ్డితో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ బాగుంటుంది. నా నెక్ట్స్‌ సినిమాకు కూడా వీళ్లను నా సినిమా సెట్లో ఉండేలా చూసుకుంటా. 

మరి.. ఈ సినిమాను మీరే నిర్మించి ఉంటే బావుండేదేమో? 
కొరియన్‌ సినిమా రీమేక్‌ చేద్దాం అనే ఆలోచనతోనే నిర్మాత సునీతగారు నన్ను అప్రోచ్‌ అయ్యారు. ఈ సినిమాను సురేశ్‌ ప్రొడక్షన్‌ సంస్థ డిస్ట్రిబ్యూట్‌ చేస్తోంది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ అంటే ఫ్యామిలీయే కదా. 

భవిష్యత్తులో మీ పేరు మీద సినిమాలు నిర్మిస్తారా?  
ప్రస్తుతానికి నాకు ఐడియాలేదు. కానీ భవిష్యత్తులో కచ్చితంగా నిర్మిస్తాను. అది నా పేరు మీదా? నా ఫ్యామిలీ పేరుతోనా చెప్పలేను. 

‘ఓ బేబి’ సినిమాను ఆడియన్స్‌ ఎందుకు చూడాలి?
70 ఏళ్ళ ముసలావిడ 25 ఏళ్ల అమ్మాయిలాగా ఎలా మారింది? అన్నదే ఈ సినిమాలో యూనిక్‌ పాయింట్‌. ఈ కాన్సెప్ట్‌ వల్ల సిచ్యువేషనల్‌ కామెడీ ఉంటుంది. ఈ సినిమా చేయడానికి మరో కారణ ం ఏంటంటే.. కొరియన్‌ సినిమా చూశాక మా అమ్మ దగ్గరకు వెళ్లి నువ్వు చిన్నప్పుడు ఏం చేయాలనుకున్నావు? నీ కలలు ఏంటి? అని అడిగాను. ప్రేక్షకులు కూడా అలానే చేస్తారని అనుకుంటున్నాను.

అంటే.. అమ్మని నెగ్లెక్ట్‌ చేశాననే బాధ ఉందా?
నా గోల్స్‌ కోసం పరిగెడుతున్నాను కానీ నీ కలలేంటి అని ఎప్పుడూ అమ్మను అడగలేదు. ఆ ఆలోచనే రాలేదు. జనరల్‌గా నాన్న అది చేస్తారు.. ఇది చేస్తారు అని మన ఇంటికి సంపాదన తెచ్చే వ్యక్తి గురించి గొప్పగా మాట్లాడతాం కానీ అమ్మ గురించి ఎక్కువగా మాట్లాడం. ఇంటిని చూసుకోవడం అంటే ఎంత కష్టమైన పని. ఎన్నో త్యాగాలతో కూడుకున్నది. అమ్మ దగ్గరికెళ్లి ‘సంతోషంగా ఉన్నావా?’ అని అడిగితే, ‘నువ్వు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను’ అంటారు. వాళ్లకు పర్సనల్‌ అంటూ ఏమీ ఉండదు. వాళ్ల గురించి వాళ్లు ఆలోచించనే ఆలోచించరు. ‘నా.. నేను’ అనే ఓ మాటలు వాళ్ల జీవితంలో ఉండవు. మనందరికీ అమ్మ మీద ప్రేమ ఉంటుంది. కానీ ఎప్పుడూ చెప్పం. ‘అమ్మా థాంక్యూ. మా కోసం ఇన్ని పోగొట్టుకున్నారు’ అని చెప్పం. ‘ఓ బేబీ’ మాత్రం అమ్మకు కృతజ్ఞతలు చెప్పాలి అనే విషయాన్ని గుర్తు చేస్తుంది. మీ అమ్మా నానమ్మలతో సినిమాకు రండి. సినిమా పూర్తయ్యాక వాళ్లు చిన్నప్పుడు ఏం చేయాలనుకున్నారో అడగండి. 

నటిగా బెటర్‌ అవుతున్నానా? అని చెక్‌ చేసుకుంటుంటారా?
అది ఎప్పటికప్పుడు జరుగుతుంటుంది. నటిగా ఇంప్రూవ్‌ అవుతున్నాను అనే అనుకుంటున్నాను. అప్పట్లో యాక్టింగ్‌ పరంగా నాకు మెంటర్స్, దారి చూపించేవాళ్లు ఎవరూ లేరు. నన్ను నేనే గైడ్‌ చేసుకోవాలి. నా అనుభవాలతో స్వయంగా నేర్చుకున్నాను. అందుకు కొంచెం టైమ్‌ పట్టింది. కానీ ప్రస్తుతం ఉన్న అనుభవంతో మంచి సినిమాలు ఎంచుకోగలుగుతున్నాను.

మీ మామ గారు (నాగార్జున)తో ‘మన్మథుడు 2’లో చేస్తున్నారు  కదా... ఎలా అనిపిస్తోంది? 
ఈ సినిమా నాకు స్పెషల్‌. రాహుల్, వెన్నెల కిషోర్‌ అందరూ నాకు క్లోజ్‌ ఫ్రెండ్స్‌. అందుకే ఈ సినిమాలో చిన్న భాగమైనా ఆనందంగా ఉంది. సినిమా చాలా సరదాగా ఉంటుంది. అందరూ ఎంజాయ్‌ చేస్తారు. అప్పటి ‘మన్మథుడు’ సినిమాలో మామయ్య ఎలా ఉన్నారో ఇప్పుడు ‘మన్మథుడు 2’ లోనూ అలానే ఉన్నారు. టీజర్‌లో చూసి ‘ఏంటి మామయ్యా! మీరేమనుకుంటున్నారు? మేం రిటైర్‌ అయినా సరే మీరింకా సినిమాలు చేసేలా ఉన్నారు’ అన్నాను. అప్పుడు ఆయన ‘అవును.. నేను అప్పుడు కూడా చేస్తాను’ అన్నారు. ఆయన లైఫ్‌ లాంగ్‌ సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 

అమలగారు కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తే బాగుంటుందంటారా?
ఆవిడ అన్నపూర్ణ ఫిల్మ్‌ స్కూల్‌తో చాలా బిజీ. బ్లూ క్రాస్‌ పనులతో బిజీగా ఉంటారు. ఇవన్నీ కూడా తన ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఆమె చాయిస్‌ అది. నేను ఇంతకుముందు ఆడవాళ్లకు చాయిస్‌ ఉండాలన్నాను కదా. ఇది కూడా అలాంటిదే. వాళ్ల చాయిస్‌కి తగ్గట్టు వాళ్లను చేసుకోనివ్వాలి. నాకు యాక్టింగ్‌ బాగా ఇంట్రెస్ట్‌ కాబట్టి వరుసగా సినిమాలు చేస్తున్నాను.  

ఈ సినిమా చూశాక వయసు మళ్లిన వాళ్ల మీద మీ అభిప్రాయం మారిందా?
మారింది. నేను అనే కాదు.. మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్లను మనం చాలామంది పట్టించుకోం. వాళ్లకు అంత ఇంపార్టెన్స్, టైమ్‌ ఇవ్వం. ఏదైనా చెప్పబోతుంటే వినం. ఇన్నాళ్లూ పెద్దవాళ్లకు ఇవ్వాల్సినంత టైమ్‌ ఇవ్వలే దేమో అని కచ్చితంగా అనిపించింది. ఆడియన్స్‌కి కూడా అనిపిస్తుంది.

అమ్మగా మారాక ‘నేను’ అనేది ఉండదన్నారు. తల్లయ్యాక మీరూ అలానే ఉంటారా?
ఉంటానేమో. పిల్లల మీద ప్రేమ ఏ తల్లిని అయినా అలా చేసేస్తుంది. అయితే ఆడవాళ్లకు చాయిస్‌లు ఉండాలి. గృహిణిగా ఉండాలా? ఉద్యోగం చేయాలా? అనేది వాళ్ల ఇష్టానికి వదిలేయాలి. అయితే కొంతమంది తమ భార్య ఇంటిపట్టునే ఉండాలంటారు. ఉద్యోగం చేయడానికి ఇష్టపడని అమ్మాయిని భర్తే స్వయంగా ఆఫీసుకి పంపిస్తాడు. ఇలా మాట్లాడితే.. ‘ఫెమినిజమ్‌ ఫెమినిజమ్‌’ అంటారు. ఫెమినిస్ట్‌ అంటే మగాళ్లను అసహ్యించుకుంటాం అని కాదు. మగవాళ్లంటే గౌరవం ఉంటుంది. సపోర్ట్‌గా నిలిచే మగవాళ్లు చాలామంది జీవితాల్లో ఉన్నారు. లేనివాళ్ల గురించి మాట్లాడుతున్నాను. సమానత్వం కోసమే ఆడవాళ్ల పోరాటం. అది స్త్రీవాదం కాదు. 

అయితే ఇప్పుడు భర్త కూడా పిల్లలను పెంచడం, ఇంటి పనులు చూసుకోవడంలో సహాయపడుతున్నాడు..
అది మంచి మార్పు. పూర్వం మగవాడు వంట గదిలోకి వస్తే అదేదో పెద్ద తప్పన్నట్లు మాట్లాడేవారు. అప్పట్లో పిల్లలను చాలావరకు ఆడవాళ్లే ఎత్తుకునేవారు. భర్త దర్జాగా నడిచేవాడు. ఇప్పుడు అలా కాదు. నా ఫ్రెండ్స్‌ ఫ్యామిలీలో చాలా మంది భర్తలు  భార్యకంటే ముందే నిద్రలేచి పిల్లలను రెడీ చేస్తుంటారు. ఇంటి పనిని సమానంగా పంచుకుంటున్నారు. 

అయితే మీ భర్త నాగచైతన్య కూడా పిల్లలను ఇలా చూసుకుంటారనే నమ్మకం ఉందా?
100 శాతం ఉంది. మా ఇంటి కుక్కపిల్లతోనే ఆయన ఎంతో ఓపికగా ఉంటారు. దానికి స్విమ్మింగ్‌ నేర్పిస్తున్నారు. తనకు నా కంటే చాలా ఓపిక ఎక్కువ. చైతన్య 100 శాతం గ్రేట్‌ డాడ్‌ అవుతారు. 

ఫైనల్లీ... నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌ ఏంటి?
త్వరలోనే అనౌన్స్‌ చేయబోతున్నాం. 
డి.జి. భవాని

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top