వద్దన్న పాట

Rebecca Black Was Ahead of Her Time - Sakshi

పదమూడేళ్ల వయసులో రెబెక్కా బ్లాక్‌ పాడిన ‘ఫ్రైడే’ అనే పాటను ప్రపంచం తిరస్కరించింది! పాపం చిన్న పిల్ల కదా అని సరిపెట్టుకోకుండా ఛీ కొట్టింది. నీ ముఖం అంది. ‘ది వరస్ట్‌ సాంగ్‌ ఎవర్‌’ గా ఆ పాట లోక‘ప్రసిద్ధి’ చెందింది. రెబెక్కా ఆడి, పాడిన ఆ సింగిల్‌ సాంగ్‌ వీడియో పుట్టి తొమ్మిదేళ్లు. తొమ్మిదేళ్లుగా లోకం తిడుతున్న తిట్లను భరిస్తూనే జీవితాన్ని ప్రేమించడం నేర్చుకుంది రెబెక్కా. తిరస్కారాల నుంచే తనను తనను మలుచుకుంది. వద్దన్న పాట నుంచే భవిష్యత్తుకు కొత్త స్వరాలను సమకూర్చుకుంది. ప్రేమ దక్కని వాళ్లు చేయవలసిన పని ఇదే. జీవితానికి దగ్గరవడం.

మాధవ్‌ శింగరాజు
కొంచెం టైముందా! లేక.. ‘గాట్టా బి ఫ్రెష్‌. గాట్టా గో డౌన్‌స్టెయిర్స్‌.. ఇట్స్‌ ఫ్రైడే..’ మూడ్‌లో ఉన్నారా.. బెడ్రూమ్‌లోంచి దిగెళ్లి పళ్లు తోముకుని.. ఇంత తిని.. శుక్రవారపు సోమరి పరిమళాలను అందుకుని కిటికీలోంచి గాల్లో తేలిపోడానికి! ఇట్స్‌ వాలెంటైన్స్‌ డే కూడా కదా. ఎవరికీ అందకండి. ఇది మీ లైఫ్‌. శుక్ర–శని–ఆది.. మీదే లైఫ్‌. తర్వాతెలాగూ మీ లైఫ్‌ మీ బాస్‌ది. మీ లైఫ్‌ మీ ప్రిన్సిపాల్‌ది. మీ లైఫ్‌ మీ హెడ్‌మాస్టర్‌ది.
ఒక్కమాట. వెళ్తూవెళ్తూనైనా యూట్యూబ్‌లో రెబెక్కా బ్లాక్‌ – ఫ్రైడే అని కొట్టి చూడండి. పదమూడేళ్ల అమ్మాయి తొమ్మిదేళ్ల క్రితం పాడిన  వీడియో సాంగ్‌ అది. ఆమెను స్మరించుకుంటూ ప్రేమికుల రోజున ఈ పాటను చూడమని కాదు.

ఆమె నిక్షేపంగా ఉన్నారు తన ఇరవై రెండేళ్ల వయసులో. రెబెక్కా బ్లాక్‌ తన పేరు. ‘ఫ్రైడే’ ఆ పాట పేరు. 3 నిముషాల 47 సెకన్లు ఉంటుంది. వాలెంటైన్స్‌ డే రోజు అంత టైమ్‌ని వృ«థా చెయ్యడం అన్యాయమే. బయట గులాబీ పూలకాడలు అయిపోయాయంటే.. వట్టి చేతుల్తో వెళ్లి ఐలవ్యూకి ముందు సారీ చెప్పాల్సి వస్తుంది. సారీ కూడా ప్రేమ సిలబస్‌లో ఒక చాప్టరే. అలాగని బుంగమూతిని తెరిపించే పూలగుత్తేమీ కాదు కదా ‘సారీ’. వీడియో చూడకున్నా పర్లేదు. పైపై డీటెయిల్స్‌ చూడండి. పది లక్షలా పది వేల లైక్‌లు కనిపిస్తాయి. పక్కనే చూడండి. ముప్ఫై లక్షల అరవై వేల డిస్‌లైక్‌లు ఉంటాయి! రేటింగ్‌ చూడండి. ‘నో మెచ్యూర్‌ కంటెంట్‌’ అని ఉంటుంది. ఇక పాట చూడ్డానికేముంటుంది! చూసినా ఏం ఉంటుంది?
∙∙
‘7 ఎ.ఎం. వేకింగ్‌ అప్‌ ఇన్‌ ది మార్నింగ్‌ గాట్టా బి ఫ్రెష్‌.. గాట్టా గో డౌన్‌ స్టెయిర్స్‌.. గాట్టా గెట్‌ డౌన్‌ టు ద బస్‌ స్టాప్‌.. గాట్టా క్యాచ్‌ మై బస్‌.. ఐ సీ మై ఫ్రెండ్స్‌..’ పాటంతా ఇదే తొందర. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకోవాలన్న ఓ పదమూడేళ్ల అమ్మాయి తొందర.. రెబెక్కా బ్లాక్‌ ‘ఫ్రైడే’ సాంగ్‌ థీమ్‌.  

జీవితాన్ని ప్రేమిస్తే జీవితం మన చుట్టూ తిరుగుతుంది. వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి చుట్టూ మనం తిరగాల్సి వస్తుంది. రెబెక్కా బ్లాక్‌.. జీవితాన్ని ప్రేమించింది. ప్రేమించి ఊరుకోలేదు. పాటతో ఆ ప్రేమను చూపించింది. ఎవరికీ అర్థం కాలేదు. ఇదేం పాట అన్నారు! ఇది పాటా అన్నారు.

పాటలో కీట్స్‌ లేడు. షెల్లీ లేడు. బైరన్‌ లేడు. కనీసం కుర్రవృద్ధుడు జస్టిన్‌ బీబర్‌ లేడు. అసలు పొయెట్రీనే లేదు. శుక్రవారం రాగానే లేవడం, పార్టీలకు పరుగెత్తడం. ఏముంది ఇందులో? లోకం నిక్కచ్చి మాస్టారు. పదమూడేళ్ల పిల్లయినా గెలిచే తీరాలంటుంది. గెలవలేకపోతే ‘ఈ లోకంలోకి ఎందుకొచ్చావ్‌?’ అని అడుగుతుంది.

పాడింది మాత్రమే రెబెక్కా. తన ఫీలింగ్స్‌ని వేరెవరికో చెప్పి తనకు కావలసినట్లు పాటను రాయించుకుంది. ప్రపంచంలోని ఒక్క లిరిక్‌ లవర్‌కి కూడా ఈ పాట నచ్చలేదు. పూర్‌ గర్ల్‌ అన్నారు. ‘ఎస్టర్‌డే వాజ్‌ థర్స్‌డే.. టుడే ఈజ్‌ ఫ్రైడే.. టుమారో ఈజ్‌ శాటర్‌ డే’ అని పాడుతుంది రెబెక్కా.. పాటలో ఓ చోట. ‘డే ఆఫ్టర్‌ టుమారో సండే కదా.. హహహా.. ఈ పిల్లలో విషయం లేదు. కసిగా ఏదో అవ్వాలనుకుని లోకం మీద విసురుగా పడింది’ అని కామెంట్స్‌. సిస్టమ్‌ని షట్‌ డౌన్‌ చేసేస్తే ఈ కామెంట్స్‌ అన్ని మాయమౌతాయి. కానీ స్కూల్‌ మాయమౌతుందా? సెలవులొచ్చే వరకు ఆన్‌లోనే ఉంటుంది. సెలవులయ్యాక మళ్లీ స్కూల్‌.  

పాటను యూట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ చేసిన రోజు మొదలైన వెవ్వెవ్వేలు రెబెక్కాను టీనేజ్‌ అంతా వెంటాడాయి. స్కూల్లో టీచర్లు కూడా ఆమెను చూసి నోటికి చెయ్యి అడ్డుపెట్టి నవ్వుకున్నారు. ముడుచుకుపోయింది. స్కూల్లో పదిహేనవ యేట ఆమెతో మాట్లాడేవాళ్లు తగ్గిపోయారు. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. కాలేజ్‌లో పదిహేడవ యేట.. అప్పుడే రెబక్కా ‘ఫ్రైడే’ను చూసి వచ్చినవాళ్లెవరో.. తింటున్న పీజాలు, బర్గర్‌లు ఆమె మీద విసిరేశారు. సగం చచ్చిపోయింది. పందొమ్మిదో యేట మ్యూజిక్‌ ప్రొడ్యూజర్‌లు, సాంగ్‌ రైటర్‌లు నిన్నసలు ఎప్పటికీ తీసుకునేదే లేదనేశారు. ఇంటికొచ్చి ఏడ్చేసింది రెబెక్కా. రోజూ ఏడుస్తూనే ఉంది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఒకటే ఏడుపు. తలుపులు వేసుకుని ఒంటరిగా ఏడుపు. అమ్మకు చెప్పలేదు. నాన్నకు చెప్పలేదు.
∙∙
టీనేజ్‌ దాటుతుండగా రెబెక్కా ఓ రోజు అద్దంలో తనని తను పరిశీలనగా చూసుకుంది. ఏడ్చినట్లుంది. తనేం ఏడ్వడం లేదు. కానీ ఏడ్చినట్లే ఉంది! కన్నీళ్లొస్తే చేతులతో తుడుచుకుంటాం. ఏడుపే రాకుండా కన్నీళ్లు కనిపిస్తుంటే.. తుడుచుకోవలసింది కళ్లను కాదు. కళ్లు మూసినా, కళ్లు తెరిచినా తనను ఏడిపిస్తున్న లోకాన్ని! అవును.. లోకాన్ని తన కళ్ల ముందు నుంచి తుడిచేయాలి. కళ్లు మూసుకుంది రెబెక్కా. రెప్పల మాటున  అంతవరకు ఉంటూ వచ్చిన అవమానాలన్నీ ఒకటొకటిగా అదృశ్యం అయిపోవడం మొదలైంది. చివరికొక రూపం మిగిలింది. ఆ రూపం రెబక్కాదే. రెబక్కా అందంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో ఉంది. ఒక కొత్త పాట కోసం తనని తను ట్యూన్‌ చేసుకుంటోంది!

ఈ ఫిబ్రవరి 10 కి రెబెక్కా పాట ‘ఫ్రైడే’.. పదవ సంవత్సరంలోకి ప్రవేశించింది. దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్న పోస్ట్‌ పెట్టింది రెబెక్కా. ‘మీరేమిటన్నది మీ గురించి మీకేం తెలుసో అదే కానీ.. మీ గురించి ఎవరేమనుకుంటున్నారో అది కాదు మీరు’ అని. ఇంకా చాలా రాసింది. వాలెంటైన్స్‌ డే సెలబ్రేషన్స్‌ అయ్యాక.. ఈ సాయంత్రం రిలాక్స్‌డ్‌గా ఉన్నప్పుడు ఆ పోస్ట్‌ను చదవండి. మీరు జీవితాన్ని ప్రేమిస్తున్నారో, వ్యక్తిని ప్రేమిస్తున్నారో మీ కనురెప్పల లోపలి స్క్రీన్‌పై కనిపిస్తుంది. తర్వాత మీరు.. రెబెక్కా ఇన్నేళ్లలోనూ సొంతంగా, ఎవరి సహాయమూ లేకుండా చేసిన మిగతా సింగిల్స్‌ని (సింగిల్‌ సాంగ్స్‌) కూడా వెతకడం మొదలు పెడతారు. ఆమెదే కొద్దిగా ఫిల్మోగ్రఫీ ఉంది. డిస్కోగ్రఫీ ఉంది. అన్నీ తనకు తానుగా చేసుకున్నవే. జీవితాన్ని ప్రేమించేవారు ఏదైనా సొంతంగా చేసుకోగలరు. దేన్నయినా సొంతంగా సాధించగలరు. మన జీవితమే మనకు వాలంటైన్‌. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top