వదులుకోజాలని అవకాశం! | Sakshi
Sakshi News home page

వదులుకోజాలని అవకాశం!

Published Mon, Jun 19 2017 11:16 PM

వదులుకోజాలని అవకాశం!

రమజాన్‌ కాంతులు

ఒక వ్యక్తి దైవం కోసం, దైవ ప్రసన్నత కోసం, దైవాదేశాలకనుగుణంగా, దైవ ప్రవక్త సాంప్రదాయ విధానం ప్రకారం పాటించినట్లయితే, తప్పకుండా అతనిలో సుగుణాలు జనించి తీరవలసిందే. నిజానికి నమాజ్, రోజా, జకాత్, హజ్‌ లాంటి ఆరాధనల ద్వారా మనిషి సంపూర్ణ మానవతావాదిగా, మానవ రూపంలోని దైవదూత గుణసంపన్ను గా పరివర్తన చెందాలన్నది అసలు ఉద్దేశ్యం. అందుకే దైవం సృష్టిలో ఏ జీవరాశికీ ఇవ్వనటువంటి ప్రత్యేకత, బుద్ధికుశలత, విచక్షణాజ్ఞానం ఒక్క మానవుడికే ప్రసాదించాడు. కాని మానవుడు తన స్థాయిని గుర్తించక, దైవ ప్రసాదితమైన బుద్ధీజ్ఞానాలను, శక్తియుక్తులను దుర్వినియోగ పరుస్తూ, ఇచ్ఛానుసార జీవితం గడుపుతూ, కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడు.

దైవాదేశాలను విస్మరించి ఇష్టానుసార జీవితం గడుపుతున్నప్పటికీ ఇహలోక జీవితం సుఖవంతంగా, నిరాటంకగా సాగిపోతోందంటే, ఇక ఏం చేసినా చెల్లిపోతుందని కాదు. ఏదో ఒకనాడు వీటన్నిటికీ ఫలితం అనుభవించవలసి ఉంటుంది. ఇహలోకంలో కాకపోయినా పరలోకంలోనైనా దైవానికి సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. అందుకని మనిషి తన స్థాయిని గుర్తించాలి. మానవ సహజ బలహీనత వల్ల జరిగిన తప్పును తెలుసుకోవాలి. పశ్చాత్తాపంతో దైవం వైపునకు మరలి సత్కార్యాల్లో లీనం ఈవాలి. దైవభీతితో హృదయం కంపించి పోవాలి. ఈ విధంగా దైవానికి దగ్గర కావడానికి, సత్కార్యాల్లో ఇతోధికంగా పాలుపంచుకోడానికి పవిత్ర రమజాన్‌కు మించిన అవకాశం మరొకటి లేదు.
–హసీనా షేక్‌

Advertisement
Advertisement