సాధనలో దాహం ఉండాలి, కసి ఉండాలి

Practice should be thirsty and should be bored - Sakshi

కలాం కలలు

పంచదార, ఇసుక కలిపి అక్కడ పెడితే వేరుపరచడం మనకు అంత సులభ సాధ్యమయిన పనేమీ కాదు. కానీ ఇంత చిన్న శరీరం ఉన్న చీమ ఎంతో ఓపికగా ఇసుకలోకి వెళ్లి పంచదార రేణువుల్ని  ఒక్కొక్కటిగా నోటకరచుకుని ఎవరి కాళ్ల కిందా పడకుండా, ఏదైనా అడ్డుగా ఉంటే ఎంత చుట్టయినా సరే తిరిగి ఎక్కడో గోడ గుల్లగా ఉన్నచోట కన్నంలోకి వెళ్లి పంచదార కణాల్ని దాచి మళ్లీ తిరుగు ప్రయాణంలో ఎవర్నీ గుద్దుకోకుండా తిరిగొచ్చి ఇసుకలో ఉన్న పంచదార రేణువును మాత్రం పట్టుకుని మళ్లీ అంతదూరం వెళ్లి... మళ్లీ తిరుగుతూ మోసుకొచ్చి దాచుకుంటుంది. వానాకాలం వచ్చినప్పుడు తన చిన్న శరీరం నీటిలో కొట్టుకుపోతుందని బయటికి రాకుండా ఆ కన్నంలో కూచుని అక్కడ దాచుకున్న ఆహార పదార్థాలను తిని బతుకుతుంది. చిన్నచీమ అంతగా శ్రమించి సాధించగా లేనిది, ఒక విద్యార్థి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఎందుకు సాధించలేడు... ఇదీ కలాం గారి ఆర్తి. ఆయన చెప్పినట్లు మీ జీవితాలకు ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి.రవీంద్రనాథ్‌ ఠాగూర్‌లా మీరు కూడా గొప్ప కవి, ఈమని చిట్టిబాబులా గొప్ప వైణిక విద్వాంసుడు లేదా హరిప్రసాద్‌ చౌరాసియాలాగా గొప్ప వేణుగాన విద్వాంసుడు లేదా సుబ్బలక్ష్మిలా గొప్ప సంగీత విద్వాంసురాలు కావాలనుకుంటున్నారా!?

ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మిగారు పాట పాడుతుంటే  హెలెన్‌ కెల్లర్‌ ఏమన్నారో తెలుసా... హెలెన్‌కు కళ్ళూ, చెవులూ లేవు. కానీ ఒక శక్తి ఉండేది. ఆమె ఎవర్నయినా ముట్టుకుంటే వారి బలాల్ని, బలహీనతల్ని అన్నీ చెప్పేసేవారు. ఆమె ఓసారి భారతదేశానికి వచ్చినప్పడు ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మిగారి కచ్చేరీకి వచ్చారు. వేదికపైన సుబ్బలక్ష్మిగారి పక్కనే కూర్చున్నారు. అప్పుడు ఆమె తమిళంలో ‘ఒన్రాయ్‌ ఉల్లమ్‌ గోవిందా...’ అన్న కీర్తన పాడుతుంటే... ఆమె కంఠం కింద వేలుపెట్టిన కెల్లర్‌ కంటివెంట నీరు ధారకట్టగా గద్గద స్వరంతో...‘‘ఈమె సాధారణ గాయకురాలు కాదు, గంధర్వకాంత. ఇది దేవతలు మాత్రమే పాడగలిగిన పాట. మానవమాత్రులకు సాధ్యం కాదు’’ అని వ్యాఖ్యానించారు.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అంతటి ప్రశంసలు పొందిన సుబ్బలక్ష్మిగారు ఎన్ని కష్టాలలోంచి వచ్చారో తెలుసా..? చిన్నప్పడు అన్నంలో నీళ్ళమజ్జిగ పోసుకుని కడుపునింపుకునేవారు. తరువాత కాలంలో కోట్లు సంపాదించి కూడా తృణప్రాయంగా భావించి తమకంటూ రూపాయి కూడా ఉంచుకోకుండా దానం చేసేసిన మహాతల్లి ఆమె. ఒక సాధారణ నిరుపేద యువతికి ఇంతపెద్ద లక్ష్యం ఎలా సాధ్యమయింది ? ఆమె తన లక్ష్యాన్ని బరువుగా భావించలేదు. అది సాధన... సాధన... సాధన చేత మాత్రమే సాధ్యపడింది. ‘అబ్బా! చచ్చిపోతున్నా... మా అమ్మగారు చెప్పారు కాబట్టి ఫలానా వాద్యసంగీతం నేర్చుకుంటున్నా.... మా నాన్నగారు చెప్పారు కాబట్టి ఫలానా క్రీడలో శిక్షణ తీసుకుంటున్నా... వంటి సమాధానాలు కాదు. ఆ ‘ఫలానా..’ను నేర్చుకోవడంలో ఒక తృష్ణ ఉండాలి. దానిమీద పట్టుసాధించేదాకా పట్టుదలతో శ్రమించాలి. అదీ ఒక తపనతో, ఒక కసితో చేయాలి. అప్పుడే మీకు, మీ లక్ష్యానికి మధ్య దూరం తగ్గిపోతుంది.
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top