పీడియాట్రిక్ కౌన్సెలింగ్ | Pediatric Counseling | Sakshi
Sakshi News home page

పీడియాట్రిక్ కౌన్సెలింగ్

Jul 3 2015 11:29 PM | Updated on Sep 3 2017 4:49 AM

పీడియాట్రిక్ కౌన్సెలింగ్

పీడియాట్రిక్ కౌన్సెలింగ్

మా బాబుకి తొమ్మిదేళ్లు. మిగతా ఆరోగ్యమంతా బాగానే ఉంది. చురుగ్గా కూడా ఉంటాడు.

బాబు కళ్లు అటు ఇటు తిరుగుతున్నాయి!
 మా బాబుకి తొమ్మిదేళ్లు. మిగతా ఆరోగ్యమంతా బాగానే ఉంది. చురుగ్గా కూడా ఉంటాడు. అయితే సమస్య ఏమిటంటే బాబుకి కనుగుడ్లు వేగంగా చకచకా అటు ఇటు తిరుగుతున్నట్లుగా ఉంటాయి. ఈ సమస్యతో వాడు సరిగా చదవలేకపోతున్నాడు. అసలు వాడికి వచ్చిన సమస్య ఏమిటి? వాడి విషయంలో మేము ఏం చేయాలో తగిన సలహా ఇవ్వండి.
 - వై. సుకుమార్, చీపురుపల్లి

 మీరు వివరించిన లక్షణాలను బట్టి చూస్తుంటే మీ బాబుకి కళ్ల పొజిషన్, కదలికలో తేడా ఉన్నట్టు అనిపిస్తుంది. వీటిలో చాలా రకాలుంటాయి. వాటిలో మీ అబ్బాయికున్న సమస్య కింద పేర్కొన్న రెండింటిలో ఒకదానికి సంబంధించినదై ఉండవచ్చు. అది ఒకటి నిస్టాగ్మస్ లేదా రెండోది ఆప్సోక్లోనస్. మీ ఉత్తరంలో బాబు సమస్యకి సంబంధించి చాలా వివరాలు  తెలపలేదు. అందుకే కచ్చితమైన కారణం నిర్ధారణ చేయడం సాధ్యం కాదు. అయినా మీరు రాసిన మేరకు చదివి, మీకు కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాను. మీ బాబుకు ఒకవేళ నిస్టాగ్మస్ కండిషన్ ఉంటే అదొక వ్యాధి కాదు. మీ బాబులోని రుగ్మతకు కేవలం ఒక సంకేతం మాత్రమే. నిస్టాగ్మస్ ఉన్న వారి కళ్లు రిథమిక్‌గా కదులుతూ (రిథమిక్ ఆసిలేషన్ మూవ్‌మెంట్స్) ఉంటాయి. ఇది ఒకటి లేదా రెండు కళ్లకు ఉండవచ్చు. పుట్టుక నుండి ఉండవచ్చు లేదా ఆ తర్వాత అయినా ఇది రావచ్చు. ఈ పరిస్థితికి అనేక కారణాలుంటాయి. ఉదా. కంటి సమస్యలు, చెవి సమస్యలు (లాబ్రెంతైైటిస్), ఆల్బెనిజం, మెదడు సమస్యలు, కొన్ని సార్లు కొన్ని మందుల వల్ల కూడా ఈ విధమైన లోపాలు ఏర్పడుతుంటాయి.

 ఇక ఆప్సోక్లోనస్ విషయంలో కళ్లు నాన్ రిథమిక్‌గా, అనేక డెరైక్షన్స్‌లో తిరుగుతుంటాయి. కళ్లను చూస్తే ఏదో కలవరంతోనో, కోపంతోనో (ఆజిటేటెడ్‌గా) ఉన్నట్లు అనిపిస్తాయి. కొన్నిసార్లు ఈ స్థితి న్యూరోబ్లాస్టోమా అనే తీవ్రమైన మెదడు జబ్బుకి మొదటి సూచిక అయిండవచ్చు. మీ అబ్బాయి విషయంలో సమస్య పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో కంటి పరీక్షలు చేయించడంతో పాటు ఒకసారి బ్రెయిన్ స్కాన్ కూడా చేయించడం మంచిది. ఒకవేళ కంటి సమస్య ఉన్నట్లు నిర్థారణ అయి, అది ప్రధానంగా కంటి కండరాలకు సంబంధించిన సమస్యగా నిర్ధారణ అయితే దాన్ని కొన్ని రకాల శస్త్ర చికిత్సల ద్వారా సమస్యను కొంతవరకు పరిష్కరించవచ్చు. మీవాడి సమస్యకు కారణం ఏమిటనేది వైద్యపరీక్షల ద్వారా తెలుసుకుంటేనే పరిష్కారం చెప్పడం వీలవుతుంది. కాబట్టి మీరు ఒకసారి మీ కంటి వైద్య నిపుణులనిగానీ, లేదా న్యూరోఫిజీషియన్‌నుగానీ కలిసి తగు సలహా, చికిత్స తీసుకోండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement