కన్నీటి ఎడారి

Oppressive life in indian people in gulf countries - Sakshi

గల్ఫ్‌ వెళ్లాక పార్వతమ్మ ఏడ్వని రోజు లేదు. మూడేళ్లు ఆమె కన్నీటితో ఎడారి తడిసింది!భర్త పోయాడు. తెలియనివ్వలేదు. తండ్రి పోయాడు. తెలియనివ్వలేదు.అత్తమ్మ పోయింది. తెలియనివ్వలేదు.కనీసం..‘నేనిక్కడ క్షేమం కాదు’ అని చెప్పేందుకు..‘అమ్మా ఎలా ఉన్నావు’ అని అడిగేందుకు..  దారే లేని దుర్భర జీవితం!!చదవండి.  ఎడారి గుండెనే పిండేసే కన్నీటి వ్యథ ఇది.

కుటుంబాన్ని పోషించడానికి పెద్ద దిక్కుగా మారి విదేశంలో అడుగుపెట్టిన ఆమెకు అడుగడుగునా నరకమే ఎదురైంది. మూడు నెలలపాటు తిండి లేదు.. నిద్ర లేదు.. ఇంటిమీద బెంగతో ఓ ప్రక్క అల్లాడిపోతూనే మరో పక్క సే పెడుతున్న చిత్రహింసలను భరించింది.  రాత్రి 12 గంటలకు పడుకుంటే మళ్లీ తెల్లవారుజామున నాలుగు గంటలకే లేపుతారు. కేవలం నాలుగైదు గంటల నిద్రతోనే కాలం వెళ్లదీసింది. చివరికి జీతం కూడా ఆమెకు సక్రమంగా ఇవ్వలేదు. రెండేళ్లపాటు ఆమెను కుటుంబీకులతో కూడా మాట్లాడించలేదు. భర్త చనిపోయాడన్న వార్తను ఆమెకు తెలియనీయలేదు. తెలిసిన తర్వాత ఊరికి పంపించాలని బ్రతిమాలినా సే పట్టించుకోలేదు. పంపకపోతే చనిపోతానని ఏడ్చినా వినలేదు.  భర్త పోయాక తాళిబొట్టు ఎందుకంటూ మెడలోని నల్లపూసల దండను సేలాగి పడేశాడు. చనిపోవాలనుకుంటే చనిపో. పార్సిల్‌ చేసి ఇంటికి పంపుతానని బెదిరించాడు. ఆమె సౌదీ వెళ్లిన కొద్దిరోజులకే భర్త, నాన్న, అత్తమ్మలు తనువు చాలించారని తెలిసినా ఏమీ చేయలేని స్థితిలో నలుగురు బిడ్డలను తలుచుకుంటూనే అనుక్షణం ఒకమూల కూర్చొని ప్రతిరోజు ఒక యుగంలా గడిపింది పార్వతమ్మ. 

వైఎస్సార్‌ జిల్లా గాలివీడు మండలం ఎగువ గొట్టివీడు పరిధిలోని రెడ్డివారిపల్లెకు చెందిన పార్వతమ్మ సరిగ్గా మూడేళ్ల క్రితం కుటుంబ పోషణ నిమిత్తమై సౌదీ అరేబియాకు పయనమైంది. భర్త నాగేంద్రనాయుడిని, పిల్లలను ఇక్కడ వదలి వెళ్లడం కష్టమే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో పరాయిదేశానికి పయనమైంది.  2016 ఫిబ్రవరి 13వ తేదిన సౌదీకి వెళ్లిన పార్వతమ్మకు పరిస్థితులు భిన్నంగా కనిపించాయి. ఇక్కడ ఏజెంట్లు చెప్పిందొకటి.... అక్కడ చెయాల్సివచ్చింది మరొకటి.  అక్కడ సే (రాజ్‌సే) తన బిడ్డను చూసుకునే పని అప్పజెప్పాడు. ఆయనకు ముగ్గురు పిల్లలైతే చివరి బిడ్డను పార్వతమ్మే చూసుకునేది. 

మూడేళ్లు జైలులో ఉన్నట్లే!
పార్వతమ్మ ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత నేరుగా  వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు. ఆరు నెలల వయస్సుగల బిడ్డను పార్వతమ్మ చేతిలో పెట్టారు. ఒక పాల బాటిల్‌ ఇచ్చి, బిడ్డ ఏడవకుండా చూసుకోవాల్సిన బాధ్యత పార్వతమ్మపై పెట్టారు. అంతేకాకుండా ఇంట్లో పనులు కూడా చేయించేవారు. బయటికి వెళ్లకుండా గేటుకు తాళం వేయడంతో ఎక్కడికీ వెళ్లడానికి ఆస్కారం లేదు. పారిపోవాలనిపించినా కాల్చి చంపుతారన్న భయంతో సే‡ ఇంటి ఆవరణలోని ఒక రూములో తలదాచుకుంటూ జీవనం సాగించింది. మూడేళ్లపాటు జైలు జీవితం కంటే అధ్వాన్నమైన పరిస్థితుల మధ్య కాలం వెళ్లదీసింది.

అనుక్షణం కన్నీరే
సమయానికి తిండి లేదు. కంటినిండా నిద్ర లేదు. ఎటూ వెళ్లలేక, అక్కడ ఉండలేక ఆమె అనుక్షణం రోదిస్తూనే ఉండేది. ఒక పక్క సే బిడ్డను ఏడ్వకుండా చూసుకుంటూనే మరోప్రక్క తన కన్నీళ్లను దిగమింగుకునేది. కష్టం చెప్పుకుంటే సేకొట్టడానికి వచ్చేవాడు. పైగా భాష సమస్య ఉండడంతో మూగ సైగలతోనే ఆమె మూడేళ్లు గడపాల్సి వచ్చింది.కుటుంబాన్నీ కోల్పోయిందిపార్వతమ్మ సౌదీ వెళ్లిన సంవత్సరంలోపే.. భర్త నాగేంద్రనాయుడు తనువు చాలించాడు. భార్య సౌదీ వెళ్లిన తర్వాత ఒక్కసారి కూడా ఫోన్‌ రాకపోవడం.. క్షేమ సమాచారం తెలియకపోవడంతో మనోవేదనతోనే చనిపోయాడు. తర్వాత పార్వతమ్మ తండ్రి తాతిరెడ్డినాయుడు కూడా అనారోగ్యంతో మృత్యువాతపడ్డాడు. అత్తమ్మ రామసుబ్బమ్మ 2018 జూన్‌లో మృతి చెందింది. అయితే భర్త చనిపోయినపుడు కూడా పార్వతమ్మకు కుటుంబీకులు చెప్పడానికి ఫోన్‌ నెంబరు తెలియని పరిస్థితి. దీంతో స్థానికంగా ఉన్న ఏజెంట్ల ద్వారా సమాచారాన్ని భర్త చనిపోయిన మూడు నెలలకు పార్వతమ్మ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పార్వతమ్మ స్వదేశం వెళ్లాలని పట్టుబట్టినా సే నిరాకరించారు. చివరికి ఈ ఒక్కసారైనా కుటుంబీకులతో ఫోన్‌లో మాట్లాడించాలని కాళ్లా వేళ్లా పడినా కనికరించలేదు.కుటుంబం కోసం గల్ఫ్‌ వెళ్లిన మూడేళ్లలోనే ముగ్గురిని కోల్పోవడంతో పార్వతమ్మ వేదనకు అంతే లేకుండా పోయింది. 

రెండేళ్లపాటు ఒక్క ఫోన్‌ కాల్‌ లేదు
గల్ఫ్‌ వెళ్లిన తర్వాత పార్వతమ్మకు సంబంధించిన సమాచారం కుటుంబీకులకు లేదు. ఏమైందో తెలియదు. ఎక్కడుందో తెలియదు. అసలు ఉందా, లేదా సమాచారం కూడా తెలిపే దిక్కులేదు. కారణం అక్కడికి వెళ్లిన తర్వాత కనీసం ఇక్కడికి ఫోన్‌ చేసుకోవడానికి ఒక్కసారి కూడా పార్వతమ్మకు అవకాశం రాకపోవడం. 2017 సంవత్సరం చివరన పార్వతమ్మ అత్త రామసుబ్బమ్మ కడప కలెక్టరేట్‌కు వచ్చి జిల్లా అధికారులను కలిసింది. అంతకుముందు కూడా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అభ్యర్థించి ఉండడంతో చలనం మొదలైంది. రెండేళ్ల తర్వాత మొదటి ఫోన్‌ కాల్‌ కుటుంబ సభ్యులకు వచ్చిందంటే ఎంతటి విపత్కర పరిస్థితిని పార్వతమ్మ అక్కడ అనుభవించిందో చెప్పకనే తెలిసిపోతోంది. ‘కనీసం నా బిడ్డలతో ఒక్కసారైనా మాట్లాడించండి.. మీ బిడ్డను ఇంత బాగా చూసుకుంటున్నా... కనికరించండి’ అని మొత్తుకున్నా సేuŠ‡ పట్టించుకోలేదని పార్వతమ్మ బోరున విలపించింది. ఇక్కడ ఆమె నలుగురు పిల్లలు వనజ, రెడ్డి నాగ శంకర్‌ నాయుడు, శైలజ, సునీల్‌కుమార్, మామ అనుక్షణం ఆమె క్షేమ సమాచారం కోసం పరితపిస్తూనే ఉన్నారు. ఏం చేయాలో పాలుపోక కనిపించిన ప్రతి అధికారిని కలిసి వేడుకోవడం మొదలు పెట్టారు. స్థానిక ఎస్‌ఐ మంజునాథ్‌ లోకల్‌గా ఉండి పార్వతమ్మను గల్ఫ్‌కు పంపిన ఏజెంట్లను పిలిపించి.. ‘పార్వతమ్మ అత్త చనిపోయింది, 45 రోజుల్లోపు రప్పించాల్సిందే’నని గట్టిగా మందలించడం.. సాక్షి టాబ్లాయిడ్‌లో వరుసగా కథనాలు ప్రచురితమైన నేపథ్యంలో చివరికి సెప్టెంబరులో పార్వతమ్మకు విముక్తి లభించింది. అక్కడి నుంచి స్వదేశానికి పంపించారు.

మూడేళ్లు గడిచినా జీతం లేదు
ఏజెంట్లు ఏం మాట్లాడుకున్నారో ఏమో.. సే మాత్రం ఈ మూడేళ్లలో ఒక్క నెల కూడా జీతం ఇవ్వలేదని పార్వతమ్మ ‘సాక్షి’తో తన గోడు వెళ్లబోసుకుంది. ‘పిల్లలు ఉన్నారు, కుటుంబం ఇబ్బంది పడుతోంది.. జీతం ఇవ్వండి’ అని  ఎన్నిమార్లు అడిగినా పలకనే పలకలేదని వాపోయింది. చివరకు ఊరికి వచ్చేటపుడు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, సౌదీ నుంచి దుబాయ్‌ వచ్చి అక్కడి నుంచి నేరుగా స్వదేశానికి వచ్చానని పార్వతమ్మ తెలిపింది.  
– బీవీ నాగిరెడ్డి, సాక్షి, వైఎస్సార్‌ జిల్లా

మా కోడలు మాకు దక్కుతుందని అనుకోలేదు
మా కోడలు పార్వతమ్మ మాకు దక్కుతుందని అసలు ఊహించలేదు. సౌదీ అరేబియా వెళ్లిన నాటి నుంచి రెండేళ్ల వరకు జాడ తెలియక మేము పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పోలీసుస్టేషన్‌ మొదలుకొని రాజకీయ నాయకులు, జిల్లా పోలీసు అధికారులు, కలెక్టర్, ఏజెంట్లు, ఇలా అందరినీ అడిగాను. కానీ ఎవరిని అడిగినా కోడలి అడ్రస్‌ దొరకలేదు. నేను నా భార్య, మనవళ్లు, మనవరాళ్లతో అన్నిచోట్లకు తిరిగి అమ్మతో మాట్లాడించాలని కోరాం. ఏజెంట్లను బ్రతిమాలాము. సాక్షి పత్రిక వారు మా బాధను అర్థం చేసుకుని ఆరేడుసార్లు పేపరులో రాశారు. మాకైతే ఒకరకంగా ఆమెపై ఆశే లేదు. ఎందుకంటే వెళ్లినప్పటి నుంచి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అసలు ఉందో, లేదో తెలియదు. భాష రాని చోట ఏమైందో అన్న బెంగతోనే భయపడుతూ రెండేళ్లు గడిపాం. చివరకు కొడుకును, వియ్యంకుడిని, భార్యను పోగొట్టుకున్న సందర్బంలోనూ కోడలికి తెలియజేసే ప్రయత్నం ఏజెంట్ల ద్వారా చేసినా తెలిసిందో, తెలియదోనన్న బెంగ వెంటాడింది. కుటుంబీకులు చనిపోయినపుడే పార్వతమ్మను స్వదేశానికి పంపని సేuŠ‡లు ఆ తర్వాత ఏం పంపిస్తారని అనుకున్నాం. దేవుని దయవల్ల పోలీసులు, సాక్షి పేపరోళ్ల పుణ్యమా అని మా కోడలు ఇంటికి రావడంతో పిల్లలు అనాథలు కాకుండా మిగిలారు!
– వెంకట రమణ నాయుడు, పార్వతమ్మ మామ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top