ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

The Office TV Series In Hotstar - Sakshi

పరిపాలన బాస్‌దే ఉండొచ్చు రాజ్యం మాత్రం టీమ్‌దే కావాలి!అధికారాన్ని బాధ్యత అనుకోకూడదు. బాధ్యతగా అధికారాన్ని వాడడం అఫీసుల్లో అవసరం! అలా లేని ఆఫీస్‌ ఉండకూడదు!

ది ఆఫీస్‌... అనగానే చాలామందికి బ్రిటిష్‌ సిరీస్‌ గుర్తొస్తుంది. ఇదెంత పాపులర్‌ అయిందంటే.. దీన్ని అమెరికా, జర్మనీతో పాటు మరో పది దేశాలు తమ భాషల్లో పునర్నిర్మించేంత. ఈ పదిలో అమెరికా, జర్మనీ సిరీసే సక్సెస్‌ అయింది బ్రిటిష్‌ ‘‘ది ఆఫీస్‌’’ తర్వాత. ఇప్పుడు దేశీ ‘‘ది ఆఫీస్‌’’ కూడా వచ్చింది. అమెరికన్‌ వెర్షన్‌ను అడాప్ట్‌ చేసుకొని. పదమూడు ఎపిసోడ్లతో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. ఒక పంజాబీ బాస్‌.. దేశంలోని రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులతో ఈ ఆఫీస్‌ కొలువుదీరింది. దీనికి దర్శకులు రోహన్‌ సిప్పీ, డెబ్బీరావు. సిరీస్‌లో కనబడే కార్యాలయం ‘‘విల్‌కిన్స్‌ చావ్లా పేపర్‌ కంపెనీ’’ బ్రాంచ్‌ ఆఫీస్‌. దీనికి మేనేజర్‌  జగ్‌దీప్‌ చద్దా (ముకుల్‌ చద్దా). నోటి దురుసుతనం, చవకబారు హాస్యానికి చిరునామా.  తన దగ్గర పనిచేసే ఉద్యోగులను పేరు, ఊరు, ప్రాంతం, శరీరం, రంగు, భాష, ఆహారపుటలవాట్లు, చిన్న, పెద్ద, ఆడ, మగ అనే తేడాలతో, తేడాలు  లేకుండా  అవమానపర్చడం, ఇబ్బంది పెట్టడం అతనికి సరదా. ఉద్యోగుల కుటుంబ విషయాలు కూడా అతని డర్టీజోక్స్‌కి సబ్జెక్ట్సే. ఉద్యోగులంతా బాధితులే. పర్మిత్, పమ్మీ, అమిత్‌ అనే ఉద్యోగుల ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ కూడా ఇన్‌క్లూడెడ్‌ ఈ ఆఫీస్‌లో.

వెల్‌కమ్‌ టు విల్‌కిన్స్‌ చావ్లా..
మొదటి ఎపిసోడ్‌ పేరు. ఈ భాగంతోనే ది ఆఫీస్‌లోని పాత్రలు.. స్వభావాలు పరిచయమే కాదు అవగతమూ అవుతాయి. ఒకరోజు హెడ్‌ ఆఫీస్‌ నుంచి రియా (గౌహర్‌ ఖాన్‌)వస్తుంది. ఫరిదాబాద్‌ (సిరీస్‌లో కనిపించే ఆఫీస్‌)బ్రాంచ్‌ను తీసేస్తున్నట్టు.. కాస్ట్‌ కట్టింగ్‌ జరగాలని.. వారంలోగా ఆ రిపోర్ట్‌ తనకు కావాలని.. ఈ విషయం స్టాఫ్‌కి లీక్‌ కావొద్దనీ హెచ్చరించీ వెళ్లిపోతుంది. అయితే ఈ కాన్ఫరెన్స్‌లో  రిసెప్షనిస్ట్‌  పమ్మీ కూడా ఉంటుంది. అందుకే చద్దాతోపాటు పమ్మీనీ వార్న్‌ చేస్తుంది రియా. ఆమె వెళ్లిపోగానే అర్జెంట్‌గా స్టాఫ్‌తో మీటింగ్‌ పెట్టి.. ఫరీదాబ్రాంచ్‌ను మెర్జ్‌ చేసేస్తున్నారు.. కాని మీ ఉద్యోగాలకేమీ ఢోకా ఉండదు అని చెప్తాడు  చద్దా. ‘‘అబద్ధం! కాస్ట్‌కటింగ్‌ ఉంటుంది అని రియా మేమ్‌ చెప్పారు’’ అని నిజం బయటపెడ్తుంది పమ్మీ. అంతే! ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరూ తమ ఉద్యోగాన్ని కాపాడుకునే ప్రయత్నంలో అవతలివాళ్లకు  ఎసరుపెట్టే పనిలో ఉంటూంటారు.

అనేక్తా దివస్‌..
సెకండ్‌ ఎపిసోడ్‌. తనను తాను ‘ఫన్‌జాబీ’, ‘‘చీఫ్‌ ఫన్‌ ఆఫీసర్‌’’గా అభివర్ణించుకుంటూండే చద్దా తన మేల్‌ ఎంప్లాయ్స్‌తో వాట్సప్‌లో నాన్‌వెజ్‌ జోక్స్‌  గ్రూప్‌ ఒకటి క్రియేట్‌ చేస్తాడు. దాని మీద హెడ్‌ ఆఫీస్‌కు ఫిర్యాదు చేస్తారు ఉద్యోగులు. దాంతో హెడ్‌ ఆఫీస్‌ నుంచి హెచ్‌ఆర్‌కు చెందిన మధుకర్‌ అనే వ్యక్తిని ఈ బ్రాంచ్‌కు పంపిస్తారు. చద్దా వల్ల ఆ స్టాఫ్‌లో పెరిగిన అసహనాన్ని తగ్గించి, వాళ్లలో టాలరెన్స్‌ పెంచి, ఒకరిపట్ల ఒకరు సుహృద్భావంతో ఉండేలా వర్క్‌షాప్‌ నిర్వహించమని. ఆ నాన్‌వెజ్‌ గ్రూప్‌ను డిలీట్‌ చేయించి.. ఆఫీస్‌లో ఉన్న భిన్నత్వాన్ని గౌరవించాలని, తోటి ఉద్యోగులూ మనుషులేనని, వారికీ మర్యాద ఇవ్వాలని చద్దాకు క్లాస్‌ ఇస్తాడు మధుకర్‌. అతని ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు అన్నీ హెడ్‌ఆఫీస్‌ నిఘాలో ఉన్నాయని తెలియచేస్తాడు.

కాస్ట్‌ కటింగ్‌
మూడో ఎపిసోడ్‌. కాస్ట్‌ కటింగ్‌లో తన చేతులకు మట్టి అంటకుండా  ఆ బాధ్యతను అసిస్టెంట్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ అయిన టీపీ భుజాల మీద పెడ్తాడు చద్దా. ఇదే అదనుగా చద్దానే ఏరివేత జాబితాలో పెట్టేసి తనే బాస్‌ అయిపోవాలనే ప్లాన్‌ వేస్తాడు టీపీ.

ఎ సీక్రెట్‌ అలయెన్స్‌..
నాలుగో ఎపిసోడ్‌.  కాస్ట్‌కటింగ్‌ నిర్ణయంతో ఆఫీస్‌లో ఉద్యోగులంతా అభద్రతతో జట్లుజట్లుగా ప్రణాళికలు, ప్రతీకారాలతో కాలక్షేపం చేస్తూంటారు. బద్ద శత్రువుల్లా ఉండే టీపీ, అమిత్‌ ఒక్కటవుతారు.. కాదు ఒక్కటైనట్టు అమిత్‌ నటిస్తూంటాడు. లిస్ట్‌లో తన పేరు లేకుండా చూసుకోవడానికి. ఇలాంటి ఎత్తులు, పై ఎత్తులతో అసలు పని కుంటుపడుతుంది. ఈ పరిస్థితిని తప్పించడానికి చద్దా ఒక సర్‌ప్రైజ్‌ పార్టీ ఏర్పాటు చేస్తాడు. ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం నింపాలని. అదీ అతని నేలబారు తనంతో అభాసు పాలే అవుతుంది.

కబడ్డీ.. కబడ్డీ..
అయిదో ఎపిసోడ్‌.  కొత్త కొత్త తలతిక్క స్ట్రాటజీలను  కనుక్కోవడంలో ముందుండే చద్దా.. ఈసారి గోడౌన్‌ ఎంప్లాయ్స్‌కి, తన స్టాఫ్‌కి మధ్య కబడ్డీ పోటీ పెడ్తాడు. సండే కూడా ఆఫీస్‌కు రావాలనే హెడ్‌ ఆఫీస్‌ నిర్ణయాన్ని అమలు చేయడానికి. ముందుగా తన ఎంప్లాయ్స్‌నే అడుగుతాడు సండే రోజు కూడా ఆఫీస్‌కు రావాలని. ఎవరూ ఖాతరు చేయకపోగా కరాఖండిగా రామని చెప్పేస్తారు. దాంతో గోడౌన్‌ వాళ్లచేతైనా వర్క్‌చేయించాలని ఈ పోటీ పెడ్తాడు. ఓడిపోయిన వాళ్లు సండే ఆఫీస్‌కు రావాలనే షరతు మీద. తొండి ఆటతో తామే నెగ్గేలా చేస్తాడు.

హూ ఈజ్‌ దట్‌ న్యూ గర్ల్‌..
ఆరో ఎపిసోడ్‌. హెల్త్‌ అండ్‌ బ్యూటీ కాన్షస్‌ పట్ల అవగాహన కల్పించడానికి అనుమతివ్వాల్సిందిగా లవ్లీన్‌ అనే ఓ బ్యూటీషియన్‌ వస్తుంది. ఇలాంటి చెత్త వ్యవహారాలను తాను యాక్సెప్ట్‌ చేయబోనని రిసెప్షనిస్ట్‌కు చెప్పబోతుంటే  గ్లాస్‌ క్యాబిన్‌లోంచి లవ్లీన్‌ కనపడుతుంది చద్దాకు. అమ్మాయి అందంగా ఉండడంతో ఆఫీస్‌లో క్యాంప్‌కి అనుమతి ఇస్తాడు. చద్దానే కాదు ఆ ఆఫీస్‌లోని మగవాళ్లంతా ఆ అమ్మాయి చుట్టూ చేరి ఆమెను ఇంప్రెస్‌ చేసే గిమ్మిక్కులు, చీప్‌ ట్రీక్స్‌తో ఈ ఎపిసోడ్‌ ఎండ్‌ అవుతుంది.

ది చడ్డీస్‌..
ఏడో ఎపిసోడ్‌. విల్‌కిన్స్‌ చావ్లా ఫరిదాబాద్‌ బ్రాంచ్‌ యాన్యువల్‌ అవార్డ్స్‌ ఫంక్షన్‌ అన్నమాట. ఎప్పటిలాగే చద్దా తన డబుల్‌ మీనింగ్‌ మాటలు, జోక్స్‌తో  ఆఫీస్‌స్టాఫ్‌కే కాదు ఆ వేడుకకు హాజరైన వాళ్ల కుటుంబాలకూ ఏవగింపు కలిగిస్తాడు.  

పి.ఓ.ఎస్‌.హెచ్‌
ఎనిమిదో ఎపిసోడ్‌. చద్దా ఆగడాలకు అడ్డుకట్టవేయడానికి సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ వర్క్‌షాప్‌ నిర్వహించమని మధుకర్‌కు ఆర్డర్స్‌ అందుతాయి హెడ్‌ ఆఫీస్‌ నుంచి. ఎప్పటిలాగే దీన్ని వ్యతిరేకిస్తాడు చద్దా. అమ్మాయిలను అదేపనిగా చూసినా, వల్గర్‌ జోక్స్‌ పాస్‌చేసినా, వాళ్ల అనుమతి లేకుండా కాంప్లిమెంట్‌ ఇచ్చినా.. కామెంట్‌ చేసినా.. వాళ్లముందు వెకిలిగా నవ్వినా, బూతులు మాట్లాడినా, వెక్కిరించినా, డబుల్‌మీనింగ్స్, కోడ్‌ లాంగ్వేజ్‌ .. ఇలా అమర్యాదగా ఏం చేసినా సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ కిందకే వస్తుందని చెప్తాడు మధుకర్‌. దీంతో చద్దా ఇరకాటంలో పడ్తాడు. ‘‘ఆఫీస్‌లో మగవాళ్లెవరూ నోరెత్తొద్దా? కళ్లకు గంతలు కట్టుకొని రావాలా? ఫన్‌ ఏముంటుందిక?’’ అంటూ చిందులు తొక్కుతాడు.

విల్‌కిన్స్‌ ఒలింపిక్స్‌..
ఎప్పటి నుంచో చద్దా ఫ్లాట్‌ కొనాలనుకుంటూంటాడు తన తల్లి ప్రోద్బలంతో. ఇల్లుంటేనైనా కొడుక్కి పిల్లనివ్వడానికి వస్తారేమో అని ఆ తల్లి ఆశ. ఆ ఫ్లాట్‌కి అడ్వాన్స్‌ ఇచ్చి, అగ్రిమెంట్‌ రాసుకోవడానికి బయటకు వెళ్తాడు టీపీని తోడు తీసుకొని. ఈ లోపు ఆఫీస్‌లో అమిత్, పమ్మి కలిసి ‘విల్‌కిన్స్‌ ఒలింపిక్స్‌’ అనే పేరుతో  ఇండోర్‌ గేమ్స్‌ పెట్టి ఆ ఇద్దరూ వచ్చేసరికి ఆఫీస్‌ అంతా అల్లకల్లోలం చేస్తారు.

ఎమర్జెన్సీ అలర్ట్‌..
పదో ఎపిసోడ్‌. ఆఫీస్‌ ప్యాంట్రీలో ఎలక్ట్రిక్‌ టీ కెటిల్‌తో షార్ట్‌సర్క్యూట్‌ అయి ఆఫీస్‌లో మంటలంటుకుంటాయి. ఎంప్లాయ్స్‌ను సురక్షితంగా బయటకు పంపించాల్సింది పోయి.. అందరికంటే ముందు బాసే పరిగెత్తుతాడు. టీపీ, అమిత్‌ కలిసి మిగిలిన వాళ్లను సురక్షితంగా బిల్డింగ్‌ కిందకు చేరుస్తారు. దీంతో మరింతగా ఉద్యోగుల ఆగ్రహానికి గురవుతాడు బాస్‌.. చద్దా.

దాండియా డౌన్‌సైజ్‌
పదకొండో ఎపిసోడ్‌. నవరాత్రి సమయం. ఆఫీస్‌ స్టాఫ్‌ అంతా దాండియా ఆడాలనుకుంటారు. చద్దాకు ఆ రోజే డెడ్‌లైన్‌.. కాస్ట్‌కట్టింగ్‌లో తొలగించాల్సిన ఉద్యోగుల పేర్లు పంపడానికి. అందుకే ఆ దాండియా నైట్‌ చద్దాకు కాలరాత్రే అవుతుంది.

దంగల్‌
పన్నెండో ఎపిసోడ్‌. టీపీకి, చద్దాకు మల్ల యుద్ధ పోటీ పెడ్తుంది స్టాఫ్‌. ఎప్పటిలాగే తొండితో చద్దానే గెలుస్తాడు.

ది డీల్‌
ఆఖరు ఎపిసోడ్‌.  రియా, చద్దా కలిసి కొత్త క్లయింట్‌ను పట్టుకుంటారు. కాంట్రాక్ట్‌ తెస్తారు. ఫరిదాబ్రాంచ్‌ను విలీనం చేసే ప్రమాదాన్ని, కాస్ట్‌ కట్టింగ్‌ కష్టాన్నీ తప్పిస్తారు. స్టాఫ్‌ అంతా సంతోషంగా ఉంటారు.
ఇదీ ‘ది ఆఫీస్‌’. అమెరికా వెర్షన్‌కు మక్కీకి మక్కీ అన్న టాకే చాలా మంది నుంచి. దీనికన్నా యూట్యూబ్‌లో ఎప్పుడో స్ట్రీమ్‌ అయిన ‘‘బెటర్‌ లైఫ్‌ ఫౌండేషన్‌’’ అనే ఆఫీస్‌ కాన్సెప్ట్‌ సిరీస్‌ చాలా బాగుంది, పైగా పక్కా దేశీ అన్న కామెంట్‌ చాలా రివ్యూల్లో. బహుశా రియల్‌ లైఫ్‌ ఆఫీస్‌లు.. బాస్‌లు.. హాట్‌స్టార్‌ ‘ది ఆఫీస్‌’ లా ఉండకూడదనే ఇలా చూపించారేమో!
– సరస్వతి రమ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top